Friday, March 29, 2024
HomeTrending Newsటీఆర్ఎస్, బిజెపిల అరాచకాలు - కాంగ్రెస్ విమర్శ

టీఆర్ఎస్, బిజెపిల అరాచకాలు – కాంగ్రెస్ విమర్శ

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ధనస్వామ్యానికి తెరలేపిన బిజెపి, టీఆర్ఎస్ పార్టీలను ఎన్నికల కమిషన్ తక్షణమే కట్టడి చేసి చర్యలు తీసుకోవాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్లో నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంతో సంపాదించిన కోట్ల రూపాయలను
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్లను కొనడానికి విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఓట్ల కోసం మంత్రి మల్లారెడ్డి రూ.12 లక్షలు ఇస్తానని వాగ్దానం చేసి 2 లక్షలు ఇచ్చి, మిగత రూ.10 లక్షలు ఇవ్వకుండా ప్రచారం ముగించుకొని వెళ్తుండగా ఆ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు మంత్రిని అడ్డుకొని రూ.10 లక్షలు ఎప్పుడు ఇస్తావు అని నిలదీయడాన్ని బట్టి అధికార టిఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తెర లేపిన విధానం అర్థమవుతుందన్నారు.

బాధ్యత కలిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా స్వామ్యాన్ని ఖూని చేస్తూ అపహస్యం చేస్తున్నారు అనడానికి ఇంకేం సాక్ష్యం కావాలన్నారు. బిజెపి కేంద్ర మంత్రులు, మఠాధిపతులు నోట్ల సంచులతో మునుగోడు ఓటర్లను కొనడానికి మిడతల దండులాగా దాడి చేయడానికి వస్తున్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. కార్లు, బైకులు, బంగారు ఆభరణాలు ఇస్తామని బిజెపి నాయకత్వం ప్రకటనలు చేస్తుండగా, లక్షలు ఇస్తామని టిఆర్ఎస్ పాలకులు చేస్తున్న వాగ్దానాల ప్రకటనలు మునుగోడులో ధనస్వామ్యాన్ని చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి మంత్రులు, టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేసిన డబ్బులతో మునుగోడుని కొనుగోలు చేస్తామంటే… మునుగోడు ప్రజలను అవమాన పరిచినట్టేనని అన్నారు. విలువ కట్టలేని ఓటును బీజేపీ, టిఆర్ఎస్ లు ఇష్టారాజ్యంగా డబ్బులతో కొనుగోలు చేయాలని చూడటం ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. “మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న. మీ ఓటు విలువైనది. విలువ కట్టలేనిదని గమనించండి. మీ ఓటు దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ఉండాలని” విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా ధనస్వామ్యానికి తెరలేపిన టీఆరెస్, బీజేపీల పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని కట్టడి చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సిగ్గు, శరం, లజ్జా లేని టీఆరెస్, బీజేపీలు
ఉత్తమ్ కుమార్ రెడ్డి
సిగ్గు, శరం వదిలి టీఆరెస్, బీజేపీలు డబ్బు, లిక్కర్ తో మునుగోడులో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్తలే వాళ్ళ మంత్రి ని 12 లక్షలు ఇస్తానని 2 లక్షలు ఇచ్చి ఎలా వెళతారని అడ్డుకోవడం చూస్తుంటే టిఆర్ఎస్ డబ్బులని ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేస్తుందో అర్థమవుతుందన్నారు. బీజేపీ కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ముతో మునుగోడులో ఓటర్లను కొనుగోలు చేస్తున్నదని విమర్శించారు. మునుగోడు ఆడబిడ్డ కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

పాల్వాయి స్రవంతి,మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి

మునుగోడు ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు ధన అధికార బలాన్ని ఉపయోగించి
కాంగ్రెస్ నాయకులను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిపాల్వాయి స్రవంతి విమర్శించారు. పార్టీ మారని కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి మంత్రులు, కేంద్రం నుండి మంత్రులు మునుగోడు గ్రామలను దత్తత తీసుకొని ఒక మహిళ గా నన్ను ఓడించాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ధన బలం చూపెట్టే వారు రేపు ప్రజాసేవ చేయరన్న విషయాన్ని మునుగోడు ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. ధన ,అధికార బలం ఎంతున్న ..మునుగోడు ఓటరు మహాశయులు తనను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: మునుగోడుతో కేసీఆర్ కు గుణపాఠం ఈటల హెచ్చరిక

RELATED ARTICLES

Most Popular

న్యూస్