Sunday, September 8, 2024

ఆకాశంలో సగం

Legitimate Right: చాలామంది ఇళ్లల్లో భర్తలు ఎనిమిది గంటల ఉద్యోగం చేస్తూ ఉంటే వారి భార్యలు 24 గంటల పనిలో ఉంటారు. భర్తల ఉద్యోగానికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. టంచనుగా టీ బ్రేక్, లంచ్ బ్రేక్ , వారానికో సెలవు. కొన్ని ఆఫీసుల్లో ఉదారంగా విహారయాత్రలు, పార్టీలు కూడా. మరి వీరి భార్యల మాటేమిటి ? ముందుగా ఉద్యోగం చెయ్యని వారి సంగతి చూద్దాం…

పొద్దున్నే లేచి కాఫీలు, టిఫిన్లు చెయ్యాలి. పిల్లలకు,భర్తకు బాక్సులు రెడీ చెయ్యాలి. పిల్లల్ని తయారుచేసి తీసుకెళ్లి స్కూల్ ఆటోనో, బస్సో ఎక్కించాలి. ఆపైన ఇంటికొచ్చి భర్తని పంపి ఇల్లంతా సర్దుకోవాలి. బట్టలు ఉతకడం, ఆరినవి మడతలు పెట్టడం, ఐస్త్రీకి ఇవ్వడం చెయ్యాలి. ఇంకా ఇంట్లో పెద్దవారు ఉంటే వారి అవసరాలు చూసుకోవాలి. భర్త, అత్తమామలు చిన్న చిన్న సహాయాలు చెయ్యచ్చు. కానీ పూర్తి బాధ్యత ఇల్లాలిదే. మధ్యాహ్నం భోజనం అయ్యి, రెస్ట్ తీసుకునేలోపు పిల్లలకి స్నాక్స్ చెయ్యడం, ఈ లోగా వాళ్ళు రావడం, మళ్ళీ రెడీ చేసి ట్యూషన్లు, సంగీతం, డాన్స్ అంటూ పరుగెత్తడం. రాత్రికి వంట చెయ్యడం, మర్నాటికి ఇడ్లి , దోసె పిండి రెడీ చేసుకోవడం… ఇలాగే తెల్లారిపోతుంది. మధ్యలో పిల్లలు, భర్త ఆమెని చూసి హాయిగా ఇంట్లో ఉన్నావ్ అనడమూ మామూలే. పైగా కొంతమంది ఆమె చేసేపని చాలా సులువన్నట్టు మాట్లాడతారు.

ఉండడానికి సొంత ఇల్లు, కారు అన్నీ ఉన్నా ఏవీ ఆమె పేరు మీద ఉండవు. అన్ని అవసరాలకూ భర్తని అడగాల్సిందే. అందుకే చాలామంది పిల్లలకు, భర్తకు కూడా లోకువ. అందరూ ఇలా ఉంటారనికాదు కానీ అరవై శాతం పైన మహిళల పరిస్థితి ఇంతే.

ఇక ఉద్యోగం చేసే మహిళల సంగతి చూద్దాం. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే రకమైన ఉద్యోగం చేస్తున్నా ఇంటి పని అంతా ఆమె నిర్వహించాల్సిందే. కొద్దిగా సహాయం అందుతూ ఉంటుంది. భర్తకు మాత్రమే వాహనం ఉంటుంది. ఆమె బస్ ఎక్కో, భర్త వాహనం పైనో ఆఫీస్ కి వెళ్ళాలి. ఇక ఆఫీస్ అయ్యాక భర్త స్నేహితులతో బయటకు వెళ్తే ఈమె కూరలు, పళ్ళు, కొనుక్కుని బస్ పట్టుకుని ఇంటికి చేరాలి. కేర్ సెంటర్లలో పిల్లలు ఉంటే అదో పని. మళ్ళీ ఇంటికొచ్చాక వంట, పిల్లలు … చర్విత చరణం. భర్త లేట్ గా ఇంటికొచ్చి తిని పడుకుంటాడు. మర్నాటిగురించి చింత ఉండదు. ఉద్యోగస్తురాలు కాబట్టి ఇల్లు ఆమె పేరున ఉండచ్చు, చేతిలో కాస్త డబ్బులు ఉంటాయి గానీ ఎవరికి అవసరమైనా ఆమె సర్దాల్సిందే. లోన్లు కట్టాల్సిందే. పిల్లల కోరికలు తీర్చాల్సిందే. ఇప్పుడిప్పుడు కొంతమంది మగవారు సహాయం చేస్తున్నారుగానీ వారికంటే పనిమనుషులు, వంటవారిపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు.

ఇంతకీ పై వివరణ దేనికి? ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా మహిళలు ఆస్తులు వారి పేరిట సమకూర్చుకోలేక పోతున్నారని చెప్పడానికి. ఓపిక ఉన్నన్నాళ్లూ ఇంటికి, ఆఫీసుకి చాకిరీ చేసి, ఓపికలేనప్పుడు కూడా పిల్లలకి, వారి పిల్లలకి విదేశాలు కూడా వెళ్లి సహాయపడే అమ్మలు మనకి అడుగడుగునా కనిపిస్తారు. కానీ ఎవరికీ వారికోసం ఏదన్నా చేద్దామని ఆలోచన ఉండదు. కానీ మద్రాస్ హైకోర్టు భిన్నంగా ఆలోచించింది. భర్త కష్టపడి సంపాదించి ఆస్తులు కొంటే అది భార్యాభర్తల ఉమ్మడి సంపాదన అని తీర్పు చెప్పింది. సంబంధిత కేసులో భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తే భార్య పిల్లల్ని చూసుకుంటూ, ఆస్తులు సంరక్షిస్తూ ఉంది. భర్త వచ్చాక ఇద్దరికీ గొడవలొచ్చాయి. ఆస్తిలో భాగం కావాలంది. కుదరదు అన్నాడాయన. కింది కోర్టుల్లో తేలక హైకోర్టు కి చేరింది విషయం. ఈ లోగా భర్త చనిపోయాడు. పిల్లలు సైతం తల్లికి ఆస్తి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కోర్ట్ వాళ్ళకి చివాట్లు పెట్టి తల్లికి ఆస్తిలో, బంగారంలో సగం వాటా ఇవ్వాలని తీర్పుచెప్పింది. ఆమె సహకారం లేకుండా ఎటువంటి ఆస్తులు కొనడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ఈ తీర్పుతో నయినా కట్టుకున్నవాళ్ళు, కన్నపిల్లలు మారి వారి ఇంటి మహాలక్ష్మికి ఆర్థిక భద్రత కల్పిస్తారని ఆశిద్దాం. అసలు అంతవరకూ ఎదురు చూడకుండా మహిళలే తమ జాగ్రత్తలో తాము ఉంటే ఇంకా మంచిది.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్