అవును.
అతడు అందరికంటే ఎక్కువ.
దేవుడి కంటే మాత్రమే తక్కువ.
ఎవరన్నారు అతడు చాలా మందితో సమానమని?
ఎందుకన్నారు అతడూ అందరి లాంటి వాడేనని?
ఎలా అన్నారు అతడి వాణి బాణీ తెలిసికూడా, అతడు ఏ గంధర్వుడో కాదు మానవమాత్రుడేనని?
నిజమే ! కీర్తనా మూర్తులుగా, సంగీత త్రిమూర్తులుగా గౌరవింపబడుతున్న ముత్తుస్వామి దీక్షితార్, త్యాగరాజు, శ్యామశాస్త్రిలు కర్నాటక సంగీతంలో దాదాపు రెండు వందల సంవత్సరాల నుండీ తిరుగులేని గుర్తింపు ఉన్నవారే.
ఆ కీర్తనలు , వారి సంగీత బాణీలు దక్షిణభారత నేలపై సుప్రసిద్దాలే. వారి కృతులు సంగీత మందిరాల్లో వినబడుతూనే ఉంటాయి. సాహిత్య పందిరుల కింద ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
సంగీత సరస్వతికి వారు చేసిన స్వర నీరాజనం వారి శైలిలో మరలా ఎప్పుడూ ఎవరూ చేయలేకపోవచ్చు.
ఆ శారదామాత ముద్దుబిడ్డల్లో వారు ఎప్పటికే ప్రత్యేకమే.
ఓ సుస్వర వన విహారంలో వారి అడుగులు ఎప్పటికీ మెరిసే రహదారులే.
కానీ సామాన్య సమాజంలో వీరి ప్రభావమెంత?
ఓ పామరుడికి తెలిసిన వారి ప్రావీణ్యమెంత?
మరి ఇళయరాజా?
ఓ అర్ధశతాబ్ధం నుండి దక్షిణ భారతానికి వీనుల విందు ఇతడు.
అలసిన మనసుకు మందు ఇతడు.
ఓ 80 సంవత్సరాల క్రితం స్వర్గలోకంలో శారదమ్మ సంతోషంగా ఓ బొమ్మను చేస్తే – దానికి సప్తస్వరాల ప్రాణం పోస్తూ ఓ సారి తేరిపార చూసి, ఎలా ఉందన్నాడట బ్రహ్మ.
అది చూసి- బొమ్మ చిన్నదే అందట ఆ అమ్మ.
అప్పుడు ఆ చతుర్ముఖుడు –
ఓ దేవీ, ఈ పొట్టి బొమ్మ ప్రజ్ఞాపాటవం ఎంత ఎత్తుకు పోతుందో నీవే చూస్తుండు.
ఈ చిన్న రెమ్మ ఎన్ని స్వరాల శాఖలుగా విస్తరిస్తుందో అలా చూస్తూ ఉండు అంటూ-
ఆ బొమ్మతో వెళ్ళు.
భువిపై భ్రమర నాదాల్ని
లతల గానాన్ని
సెలయేటి రాగాల్ని
అందరికీ సరికొత్తగా వినిపించు.
వాళ్ళ మోముపై ఓ ఆనంద వీచికై కనిపించు.
అని ఓ మారుమూల పల్లెలో పడేస్తే…అటూ ఇటూ తిరిగిన ఆ బాల్యం ఓ చిన్న చెక్క హార్మోనియం పెట్టెను పట్టుకుందట.
ఆపై …
” సరిగమలన్నీ పదనిస పాడగ..
హార్మొనియమూ హాయిగ నవ్వగ..
చరణం- పల్లవి ఎదురే వెళ్ళగ…
రాగం-తానం రారమ్మనగా..
ఎన్నడు విననీ బాణీ మూటతో..
వచ్చాడంటా ఎద తడిమేందుకు…
వామనుడల్లే కనబడు రూపం
విశ్వమంతటా వినబడు రాగం
ఏడు స్వరాలూ చేతన బట్టీ
నవరసాలకూ ప్రాణం పోసీ
Beethoven-Mozart లకన్నా
ఈ తరమునకూ నేనే మిన్నని…
సంగీతానికి రాజును అంటూ..
స్వరాలతో -నే- ఆడెదనంటూ..
సురాగాలు కురిపించెదనంటూ ..
జావళీలతో జనమును తడపగ…”
ఈ సమాజం ఓ చిత్రమైన , మునుపెన్నడూ లేని శబ్ద సౌందర్యాన్ని చూసింది.
ఓ గానలహరిలో మునిగింది.
ఓ మురళీ నాదమై ఊగింది.
ప్రకృతి ఘోషనూ
పెదవుల ఆశనూ
పదముకు శ్వాసనూ
గుండెకు భాషనూ స్వరపరచి…
మాటను మంత్రంగా చేసి..
పాటను ఆటలుగా చేసి …
ఎన్ని గుండెలను ఊసులాడించాడో!
ఎన్ని బండలతో ఎద పాట పాడించాడో!
ఓ వ్యక్తి ప్రజ్ఞను కొలవాలంటే
ఆ విద్వత్తు విస్తృతిని చూడాలంట.
ఈ విషయంలో ఆయన ఎవరెస్టంత ఎత్తు.
మేరియానా ట్రెంచంత లోతు.
భువన భువనాంతరమంత వెడల్పు.
పండిత పామర బేధము లేదు.
తెలుగూ తమిళం వాదన లేదు.
కావేరీ పాదాల నుండీ, గంగ నుదిటిపై వరకూ ప్రవహించిన రాగ సుధా లహరి ఇతడు.
ఏ వింధ్య పర్వతాలూ విడదీయలేని వేణునాదం ఇతడు.
ఏ సాత్పురా పర్వతాలూ విభజించలేని రాగరంజిత నైసర్గిక స్వరూపమితడు. ఎన్ని భాషల్లో… ఎన్ని పాటల్లో ..ఇతడి విద్యను కాస్త మార్చీ , మనుషులను ఏమార్చీ తమవిగా చెప్పుకున్న తెంపరితనమో!
తొలిరోజుల్లో ఎవరి దగ్గర పనిచేసాడో వారే తిరిగి ఈయన దగ్గర పనిచేసిన గొప్ప ఇతడు.
కళాకారులకే కళాకారుడు.
సెలబ్రిటీలకే సెలబ్రిటీ.
ఈ ‘ముని’ వేళ్ళ స్పర్శకై హార్మోనియం మెట్లు ఆబగా ఎదురు చూస్తాయట.
ఈ గుండె పలికించే హొయలలో గిటారు తంత్రులు గింగిరాలు తిరుగుతాయట.
తన కనుచూపు కదలికతో ఓ వేణుగాన విద్వాంసుడి పెదవి పూరాగమాలిక వినిపిస్తుందట.
ఇతడి చేతిలో స్వరం శబ్దంతో మనువాడి వెన్నెల రాగం పలికిస్తుందట.
పల్లె పొలాల్లో రైతు చెమట బిందువు కష్టాన్ని మరిపించినా,
కోతకోసే కొడవలి కోయిల రాగం అనిపించినా-
అది ఇతడి సరాగాల సమ్మోహనమే.
రాత్రీ పగలు- తూర్పూ పశ్చిమ తేడాల్లేకుండా పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వారి అలసటను మాయం చేసే మాయ ఈతడి రాగ సందోహమే.
ఇటువంటి వాడు మరలా పుడతాడా అంటే ఆ బ్రహ్మకే సందేహం!
ఇంత మంది హృదయాలని స్పృశించే నైపుణ్యం ఇంకెవరికైనా ఇస్తావా అంటే , ఆ చదువుల తల్లి ఊపుతుంది తల అడ్డం!
ఇతడి యుగంలో పుట్టి , పరవశించిపోవడం మన కనులూ చెవులూ పంచుకున్న సంతోషం.
ఎందరు కవులు!
ఎందరు దర్శకులు!
ఎందరు నటులు!
కన్నదాసన్, వైరి ముత్తు , గుల్జార్
ఆత్రేయ ,వేటూరి, సిరివెన్నెల వంటి ఎందరో లబ్ధప్రతిష్ఠుల అక్షరాలకు వెన్నెలద్దుతూ…
బాలచందర్, మణిరత్నం , భారతీరాజా, విశ్వనాథ్, వంశీ , రాఘవేంద్రరావు, బాలూమహేంద్రుల భావానికి పున్నమి రుద్దుతూ…
కమల్ హాసన్ , రజనీకాంత్ , కోకిల మోహన్, చిరంజీవులను తెరపై నిలబెడుతూ ఈయన చేసిన విన్యాసాలు అనన్య సామాన్యం.
బాలు గొంతు మరింత మధురంగా వినిపించడానికీ,
జానకమ్మ నవ్వు మరింత మల్లెలా వికసించడానికీ ఇతడే కారణం.
ఇది- అనంతమైన కాల గమనంలో ఏ రెండు బింధువుల మధ్యలో ఏ కొద్ది సార్లో మాత్రమే జరిగే ఓ అపురూప మేధో సంగమం.
ఇక..వ్యక్తిలో లోపాలుండడం సహజం.
మానవుడిగా జన్మించిన మనలో నచ్చని గుణాలుండడం ఇంకా సహజం.
వాటిని వదిలేద్దాం.
ఈ ప్రజ్ఞను ప్రేమిద్దాం.
కోర్టులు, వాదనలు ,హక్కులు అనేవి ఎవరికి వారి పరిస్థితులను బట్టి తప్పొప్పులు.
చివరిగా…
“బాధల్లో నీ ఓదార్పతడు.
నవ్వుల్లో నీ చెలికాడతడు.
పయనాల్లో ప్రియశబ్దం అతడు.
స్వరములు కూడా ఔరా అనేటి,
భువిపై అష్టమ అద్భుతమతడు.
ఇళయరాజా అతడు..”
అంతే!
-కిలపర్తి త్రినాధ్
9440886844
(భారత వాయుసేన మాజీ ఉద్యోగి. ప్రస్తుతం విజయనగరంలో బ్యాంక్ ఉద్యోగి. రచన ప్రవృత్తి)