Tuesday, February 25, 2025
Homeసినిమాసావిత్రికి మరణం లేదు: చిరంజీవి 

సావిత్రికి మరణం లేదు: చిరంజీవి 

మహానటి సావిత్రి .. తెలుగు సినిమా గురించి తెలిసినవారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. ఈ జనరేషన్ వాళ్లంతా కొత్త సినిమాలను ఫాలో అవుతుంటారేమో గానీ, చాలామంది పాత సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా సావిత్రి సినిమాలను చూడటానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అందుకు కారణం కళ్లతో ఆమె పలికించే హావభావాలు .. పాత్రలో అందంగా ఒదిగిపోయే తీరు అనే చెప్పవలసి ఉంటుంది. అలాంటి సావిత్రి జీవితంపై గతంలోనే ఒక పుస్తకం వచ్చింది .. మంచి ఆదరణ పొందింది.

అయితే సావిత్రి నటించిన కొన్ని క్లాసికల్ మూవీస్ కి సంబంధించిన విశేషాలను పొందుపరుస్తూ, ఇప్పుడు ‘సావిత్రి క్లాసిక్స్’ అనే మరో పుస్తకాన్ని ఆవిష్కరించారు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి ఇందుకు పూనుకోగా, సంజయ్ కిషోర్ ఈ పుస్తకాన్ని సిద్ధం చేశారు. చిరంజీవి ఈ పుస్తక ఆవిష్కారణ బాధ్యతను తీసుకున్నారు. ఆయన స్వయంగా ఆహ్వానించడం వల్లనే మురళీమోహన్ .. బ్రహ్మానందం .. పరుచూరి గోపాలకృష్ణ .. అల్లు అరవింద్ .. తనికెళ్ల భరణి .. జయసుధ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అందరూ కూడా సావిత్రి సినిమాలను గురించిన కొన్ని సన్నివేశాలను .. ఆమె నట వైభవాన్ని గురించి ప్రస్తావించారు. నటుడిగా తాను చాలా పై స్థాయికి ఎదుగుతానని సావిత్రి తనని ఆశీర్వదించిన సందర్భాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. సావిత్రితో కలిసి నటించే అవకాశం రావడం తమ అదృష్టమని మురళీమోహన్ .. జయసుధ అన్నారు. గొప్పనటులమనే అహంభావం ఉన్నవాళ్లు సావిత్రి సినిమాలు చూడాలనే అభిప్రాయాన్ని బ్రహ్మానందం వ్యక్తం చేశారు. సావిత్రికి మరణం లేదనీ, ఆమె ఎప్పటికీ సజీవంగానే అభిమానుల హృదయంలో ఉంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవితో పాటు, పరుచూరి .. తనికెళ్ల భరణి .. అల్లు అరవింద్ వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్