Monday, April 15, 2024
HomeTrending Newsపెన్షన్లు ఆపింది చంద్రబాబే: జగన్ ధ్వజం

పెన్షన్లు ఆపింది చంద్రబాబే: జగన్ ధ్వజం

ప్రతిపక్షాలు విడివిడిగా పోటీకి రాలేకపోతున్నారని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ కూడా లేదని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి.. అబద్ధాలతో వస్తున్నారు. ‘జెండాలు జతకట్టడమే వారి పని అయితే ప్రజల గుండెల్లో గుడి కట్టడమే ఈ జగన్‌ చేసింది అని సగర్వంగా చెప్పగలుగుతానని పేర్కొన్నారు. మదనపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగసభలో ప్రసంగించారు. “కానీ వాళ్లందరికీ తెలియని విషయం ఒకటుంది. ఇంత మంది జతకట్టి వచ్చినా కూడా వాళ్లందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్‌ పరీక్షలకు భయపడతాడా? అని అడుగుతున్నాను. అటువైపున గతంలో వాళ్లు పరీక్షలు రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్‌.. పరీక్ష పాసవుతాడా? అని అడుగుతున్నాను” అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

“మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ చూశారు కదా.. చివరికి చంద్రబాబు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా.. లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్కచెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్‌ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెలనెలా 1వ తారీఖున ఇంటికే వచ్చి, సూర్యోదయానికంటే మునుపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్‌ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతున్న వాలంటీర్లను ఏప్రిల్‌ 1వ తారీఖు నుంచి పెన్షన్‌ ఇవ్వటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్‌ కు చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. పేదలంటే ఈ చంద్రబాబుకు ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను” అంటూ విజ్ఞప్తి చేశారు.

“చంద్రబాబునాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్‌ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా? జగన్‌ మీద కాదు.. జగన్‌ ను నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయలేదు. 66 లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తున్నా కూడా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. పేదవాడికి నష్టం జరుగుతోంది. అవ్వలకు నష్టం జరుగుతోంది. నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికెళ్లి తోడుగా ఇప్పించే కార్యక్రమంలో శభాష్‌ అని చెప్పాల్సింది పోయి.. ఆ వాలంటీర్‌ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారంటే ఇలాంటి మనిషిని ఏమనాలి” అంటూ ప్రశ్నించారు.

“ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా? మోసాలే అలవాటుగా, అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా చంద్రబాబునాయుడు. మీరంతా అరుంధతి సినిమా చూశారా? ఆ అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాళీ వదల.. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు ఈ పశుపుపతి.” అంటూ బాబుపై ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్