Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమోడీగారూ! తెలుగు కూడా నేర్చుకోండి!

మోడీగారూ! తెలుగు కూడా నేర్చుకోండి!

గౌరవనీయ భారత ప్రధానమంత్రి మోడీ గారికి-

నమస్సులు. ఏడు పదులు దాటిన వయసులో మీకు ఏ మాత్రం సంబంధంలేని దక్షిణ భారత తమిళం నేర్చుకుని…ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తానని చెప్పినందుకు మీకు మనసారా అభినందనలు.

మా తెలుగువారి ఠీవి పి వి తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, ఉర్దూ, జర్మన్, రష్యాతో పాటు మరికొన్ని అంతర్జాతీయ భాషల్లో వీరవిహారం చేసిన సంగతి మీకు తెలియనిది కాదు. కర్ణాటక తుముకూరు ప్రాంతంలో పి వి ఉపన్యాసానికి కన్నడ అనువాదం చేయబోతే...నాకొచ్చిన నాలుగు ముక్కలు కన్నడలోనే మాట్లాడతాను…అది అర్థం కాకపొతే…అప్పుడు అనువాదం గురించి ఆలోచిద్దామన్నారట. ఉపన్యాసం పూర్తయ్యేసరికి మా కన్నడ నాయకులకంటే పి వీ గారి కన్నడే కస్తూరి పరిమళంలా ఉందని పొంగిపోయారట స్థానిక కన్నడిగులు. కవి, రచయిత, మంచి చదువరి, హిందీ సాహితీ పిపాసి అయిన అటల్ బిహారీ వాజ్ పేయితో ప్రామాణికమైన వారణాసి హిందీ యాసలో మాట్లాడిన పి వి గురించి మీకు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. తెలుగులో తొలిసారి జ్ఞాన పీఠం అందుకున్న విశ్వనాథవారి వేయిపడగలను సహస్రఫణ్ పేరిట పి వి హిందీలోకి అనువదించిన విషయం మీకు తెలిసిందే.

భారతదేశం డి ఎన్ ఏ భిన్నత్వంలో ఏకత్వం. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులకు నిలయమైన ఈ దేశంలో ఒక్కో భాషది ఒక్కో అందం. తవ్వితే ఒక్కో భాషకు వందల, వేల ఏళ్ల చరిత్ర. ఇలాంటి దేశంలో భాష ఒక భావోద్విగ్న అంశం.

సంస్కృత మహా కావ్యాలకు అనితరసాధ్యమైన వ్యాఖ్యాన గ్రంథాలు రాసిన “వ్యాఖ్యాన చక్రవర్తి” మల్లినాథసూరి మా తెలుగువాడు. తెలుగు గోదావరీ తీరం ముంగండలో పుట్టి…కాశీలో సకల శాస్త్రాలు చదివి…భారతీయ కావ్యాలంకార లక్షణ శాస్త్రానికి తలమానికమైన “రసగంగాధరం” రచించి…ఢిల్లీ సుల్తానుల కొలువులో ఆస్థాన పండితుడిగా అనన్యసామాన్యమైన రాచమర్యాదలు పొందిన జగన్నాథ పండితరాయలు మా తెలుగువాడు.

నాటి నన్నయ నుండి నిన్నటి సి నా రె వరకు మా తెలుగు రసగంగా ప్రవాహం గురించి రాస్తే రామాయణమంత. చెబితే మహాభారతమంత.

ఐతరేయ బ్రాహ్మణంలోనే తెలుగు పదాలున్నాయి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు పాండవుల పక్షాన నిలబడి…ధర్మాన్ని గెలిపించడానికి ఢిల్లీకి బండ్లు కట్టుకుని వచ్చారు. “చాణూరాంధ్ర నిషూదనః” అని విష్ణుసహస్రనామాల్లో ఒక పేరుంది. మహాభారతానికంటే చాలా ముందే ఆంధ్ర ప్రస్తావన గురించి ఉన్నట్లు దీనితో రుజువవుతోందని మీకు చెప్పేంతవాళ్ళం కాము.

తమిళం మీద మాకు ద్వేషం లేదు. తెలుగు మీద ఉండాల్సినంత ప్రేమ మాత్రం మాకు లేదు. ఎన్నికలయ్యాక మీరన్నట్లుగానే తమిళం నేర్చుకుని ఐక్యరాజ్యసమితిలో తమిళంలో మాట్లాడి తమిళుల మనసు గెలుస్తారని ఆశిస్తున్నాము. తమిళం అయ్యాక మలయాళం, అదయ్యాక కన్నడ కూడా నేర్చుకుని ఐక్యరాజ్యసమితిలో ఆ భాషల్లో కూడా మాట్లాడి వారి మనసులు కూడా గెలవగలరు. లిపిలేని తుళుతోపాటు అన్ని దక్షిణ భారత భాషలు అయ్యాక…ఆఖర్లో ఆఖర అయినా అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న మా తెలుగు నేర్చుకోగలరు. తెలుగులో కూడా ఐక్యరాజ్యసమితిలో మాట్లాడగలరు.

మీరేదైనా అనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టరని మాకు తెలుసు.

తెలుగువాళ్లమే అయినా తెలుగులో మాట్లాడితే నోరంతా తెగుళ్ళ పురుగులు పడతాయని భయపడే మాకు; అందమైన తెలుగు మాటలను అంతకంటే అందమైన తెలుగు అక్షరాల్లో రాస్తే హత్యానేరం కింద పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారని తెలుగును ఇంగ్లిష్ అక్షరాల్లో రాసే మాకు మిమ్మల్ని తెలుగు నేర్చుకుని…ఐక్యరాజ్యసమితిలో తెలుగులో మాట్లాడాల్సిందిగా అభ్యర్థించే అధికారం లేదని మాత్రం దయచేసి అనకండి. మీ పెద్ద మనసు అలా అనదన్న ధైర్యంతోనే చొరవగా ఇలా అడుగుతున్నాము.

తమిళం కంటే తెలుగు నేర్చుకోవడం ఇంకా సులభం అన్న విషయం మాత్రం మీ దృష్టికి తెస్తున్నాము.

మీనుండి సానుకూలమైన తెలుగు ఒప్పుకోలు వస్తుందని ఆశిస్తూ…

ఇట్లు,
సగటు తెలుగు అభిమాని,

(తెలుగులో సంతకం)
తేదీ:-
———————-

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్