Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంలెక్కలకందని చదువుల శాస్త్రం

లెక్కలకందని చదువుల శాస్త్రం

ఫలశ్రుతి:-
సనాతన ధర్మంలో అనాదిగా ఫలశ్రుతి చివరలోనే ఉంటుంది. కలికాలంలో ఫలశ్రుతే ముఖ్యం కాబట్టి ముందుకొచ్చినట్లుంది. ఈ కథ ‘పది’కాలాలపాటు ‘పది’లంగా పదే పదే చెప్పుకుని పొందాల్సిన ఫలశ్రుతి ఎందుకయ్యిందో చివరిదాకా చదివితే మీకే అర్థమవుతుంది!

పోతన భాగవతంలో అజామీళోపాఖ్యానం గొప్ప కథ. ఒకానొక సదాచార సంపన్న దంపతులకు లేక లేక అబ్బాయి పుడితే...అజామీళుడు అని పేరు పెట్టి…అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అబ్బాయి గారాబంగా పెరిగి పెద్దవాడవుతాడు. అంతే సంప్రదాయ కుటుంబంలో అమ్మాయిని వెతికి పెళ్లి చేస్తారు. అజామీళుడికి ఇల్లు, ఇల్లాలు ఉందంటే ఉంది…లేదంటే లేదు అన్నట్లు చెడు తిరుగుళ్ళు అలవాటవుతాయి. ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. సప్తమహా వ్యసనాల్లో మునిగితేలుతూ ఉంటాడు. అతడు చేయని పాపం లేదు. ఒక స్త్రీ వ్యామోహంలో పడి ఆమెతోనే ఉంటూ ఇంటికి రావడమే మానేస్తాడు. భార్య, తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా మారడు. కట్టుకున్న భార్య, పిల్లలు ఇక చెప్పి ప్రయోజనం లేదని…వదిలేస్తారు.

వావి వరుసలు మరచి ప్రవర్తించే అజామీళుడికి దాదాపు పది మందికి పైగా పిల్లలు. ఎనభై ఏళ్ల వయసు మీద పడుతుంది. సుఖ వ్యాధులతో పాటు రాని రోగం లేదు. శరీరం పుండై మంచాన పడతాడు. మరి కాసేపట్లో ప్రాణం పోతుందనగా గుమ్మంలో యమభటులు సిద్ధంగా వచ్చి ఉంటారు– నేరుగా నరకానికి తీసుకెళ్లడానికి. ఈలోపు అజామీళుడు ఏదో గొణగడం మొదలు పెడతాడు. ఒక స్త్రీని, ఆమె కూతురిని కూడా అనుభవించిన అజామీళుడికి అక్కడ కూడా పిల్లలుంటారు. ఆ అక్రమ సంతానంలో చివర పుట్టినవాడి పేరు- నారాయణ. “నారాయణ! నారాయణ!” అని పలవరిస్తూ ఆ స్త్రీ గుడిసె మంచమ్మీద తుదిశ్వాస వదులుతాడు.

యమభటులు గుడిసె గుమ్మంలోపల కాలు పెట్టేలోపు విష్ణుదూతలు దిగి వస్తారు. నియమాల ప్రకారం విష్ణుదూతలున్న చోట యమభటులు ఉండడానికి వీల్లేదు.

“స్వాములూ! ఇక్కడికి మీరెందుకొచ్చారు? చిత్రగుప్తులవారి పాపాల చిట్టాలో వీడు చేయని పాపం, నేరం, ఘోరం లేదు. ఆలస్యం చేయకుండా తీసుకెళ్లి…సలసల కాగే నూనెలో కొన్ని యుగాలు వేయించాలి…మీరు పక్కకు తప్పుకుంటే వీడిని తీసుకెళతాం” అంటారు.

“నారాయణ! నారాయణ!” ఎంతమాట? ఇతడిని వైకుంఠానికి తీసుకెళ్లడానికి మేమొచ్చాము…పక్కకు తప్పుకోండి” అంటారు.

విష్ణుదూతల మాటలకు తిరుగులేదు కాబట్టి…యమభటులు పక్కకు తప్పుకుని…నమస్కారం పెట్టి…వట్టిచేతులతో నరకానికి వెళ్లి…జరిగిందంతా యముడికి చెప్తారు.

యముడు విష్ణువు దగ్గర పెద్ద పంచాయతీ పెట్టి…భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో గందరగోళం లేకుండా స్పష్టత తీసుకుంటాడు. జీవితమంతా నానా పాపాలు చేసినా…దైవనామస్మరణ చేస్తూ కన్ను మూసినవారిని యమభటులు తాకడానికి వీల్లేదని…వారి పాద ధూళిని తమలపాకుమీద పెట్టుకుని…యమభటులు పునీతులు కావాలని హుకుం జారీ చేస్తాడు.

జీవితమంతా పాపాలు చేసినవారు చివరి ఘడియల్లో అయినా ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని తలచుకోరని; ఆస్తులు- పంపకాలు; ఐ సీ యూ లో నుండి లేచి ఇంటికెళ్లే మార్గల్లాంటివి; కోకాపేటలో కొన్న ఇంటి బాల్కనీలో కూర్చుని టీ తాగే ఘడియల్లాంటివే ఆలోచిస్తుంటారని విష్ణువు నమ్మకం. అదే ఆయన ధైర్యం.

నిజానికి సాంకేతికంగా అజామీళుడు వైకుంఠవాసుడైన నారాయణుడిని తలచుకోనేలేదు. వావి వరసలు మరచి కన్న సంతానంలో చివరి వాడైన నారాయణ అన్న కొడుకుగురించి పలవరిస్తూ పోయాడు. “ఏ అర్థంలో, ఎవరిని పిలుస్తూ, ఎలా అంటే నాకెందుకు? అది నా పేరే కదా?” అని యముడికి విష్ణువు చాలా స్పష్టంగా చెప్పి ఒప్పించాడు కాబట్టి ఈ విషయంలో మన యుక్తాయుక్త విచక్షణకు, మన సమీక్షలకు విలువ లేదు. విష్ణువాక్యమే వేదం.

ఎగతాళిగా అన్నా; ఆడుకుంటూ అన్నా, పొరపాటున అన్నా, పిల్లల పేర్లుగా పిలిచినా, చివరికి తిట్టుగా అన్నా…దేవుడి పేరు పలికితే చాలు ఆయన శాశ్వత వైకుంఠ స్థానం ఇస్తాడని చెప్పడానికి పరమ భాగవతోత్తముడు శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన భాగవతం కథ ఇది.

అప్పటినుండి ఇప్పటివరకు అజామీళుడిలా నోటితో చెప్పడానికి వీల్లేని నానా పాపాలు చేసి…చనిపోవడానికి ఒక్క సెకను ముందు “నారాయణ” అని నేరుగా వైకుంఠం చేరి విష్ణువు పక్కన ఎంత మంది కూర్చున్నారో మనకు శుకుడు మళ్ళీ కనిపించి చెబితే తప్ప లెక్కలు తేలవు. లేదా అలాంటివారి నోట విన్న పరీక్షిత్తులైనా చెబితే తప్ప మనకు తెలియదు.

పురాణకథల్లో పాత్రలన్నీ ప్రతీకలుగా ఉంటాయి. అందులోనుండి తత్వాన్ని మనం గ్రహించాలి. సారాన్ని పట్టుకోవాలి. నీతిని పిండుకోవాలి. ఎప్పటికప్పుడు మన రోజువారీ వ్యవహారాలకు వాటిని అన్వయించుకోవాలి.

అలా ఏడు పగళ్లు, ఏడు రాత్రుళ్ళు భాగవతం విని తరించిన పరీక్షిత్తు పాతకథను- ఆధునిక మహారాష్ట్రలో పది పరీక్షలకు అన్వయించుకుంటే పది సెకన్లలోనే మనకు అనంతమైన జ్ఞానం, మోక్షం సిద్ధిస్తాయి.

మహారాష్ట్రలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇకపై సైన్స్, లెక్కల్లో నూటికి ఇరవై మార్కులే వచ్చినా పాస్ అయినట్లే పరిగణించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల ముంగిట మహారాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి- ఎస్ సి ఈ ఆర్ టి సిఫారసు చేసింది. బహుశా ఎన్నికలయ్యాక వచ్చే ప్రభుత్వం ఏదైనా ఈ సిఫారసును ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

అజామీళుడి విషయంలో విష్ణువు అన్నదే మహారాష్ట్ర ఎస్ సి ఈ ఆర్ టీ కూడా అంటున్నట్లుగా ఇక్కడ మనం ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, అలౌకిక, పారమార్థిక, తాత్విక, ప్రతీకాత్మక కోణంలో అన్వయించుకోవాలి.

పిల్లలు చదివితే ఏమి? చదవకపోతే ఏమి? లెక్కలు, సైన్స్ పుస్తకాలు తెరిస్తే ఏమి? తెరవకపోతే ఏమి? ఒక్క ముక్క వస్తే ఏమి? రాకపోతే ఏమి? ఎన్నో వ్యయప్రయాసలకోర్చి…లోకాన్ని క్షమించి వారొచ్చి పరీక్ష హాల్లో కూర్చున్నందుకైనా పాస్ చేయాలి కదా? ప్రశ్నపత్రం తీసుకున్నందుకైనా పాస్ చేయాలి కదా? ఆన్సర్ షీట్లో ఏదో ఒకటి రాసినందుకైనా పాస్ చేయాలి కదా?

నూటికి ముప్పయ్ అయిదు మార్కులొస్తేనే పాస్ ఏమిటి? ప్రజాస్వామిక దేశంలో ఇదెంత తలదించుకునే విషయం? ఏం? లెక్కలు, సైన్సులో నూటికి ఇరవై వస్తే చాలదా? కుదరదంటే చెప్పండి పదికి తగ్గిస్తాం. ఇంకా కష్టమంటారా? అయిదు? ఓకేనా! అది కూడా కష్టమా? సరే…పరీక్ష హాల్ కు వచ్చి వెళ్ళమనండి. పాస్ చేస్తాము. ఇప్పుడు ఓకేనా?

ఆ గట్టెక్కిన మహాభాగవత పురాణ అజామీళుడు నవ్వుకుంటున్నాడు…ఈ ఆధునిక మహారాష్ట్ర పది గట్టెక్కించే బాగోతాన్ని చూసి!

భరత వాక్యం:-
పది వైతరణి గట్టెక్కే ఈ గ్రేస్ మార్కుల విద్యా పరిశోధన మండలి సిఫారసు కరుణ ఆధునిక పరీక్షల ప్రహసన నాటకంలో కేవలం నాందీవాచకమే. పరీక్షలకే తెరపడే భరతవాక్యం ఎంతో దూరంలో లేదు.

చదివినవారిని శిక్షించి…చదవనివారిని రక్షించాల్సిన ఎనిమిదికాళ్ళ కలిధర్మంలో రాయని పరీక్షలన్నీ పాసయి…రాసిన పరీక్షలే ఫెయిలవుతాయి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్