Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనా పిల్లలను చూడాలంటే!

నా పిల్లలను చూడాలంటే!

Utmost Care: హాయ్ హితులారా! సన్నిహితులారా!…మీకో విన్నపం (ఇదే నా శాసనం అనుకున్నా పర్వాలేదు). నేను తల్లిని కాబోతున్నానని తెలిసి నప్పటినుంచి మీరందరూ పాపాయి పుట్టగానే వచ్చి చూడాలని, ముద్దులాడాలని అనుకుంటున్నారు కదూ! మీ అభిమానాన్ని నేను కాదనడం లేదు కానీ మీ రాకకు నా షరతులు కొన్ని వర్తిస్తాయి. అవి తెలుసుకుని ఇష్టమైతేనే రండి. ఇంతకీ అవేమిటంటారా?

1 . దయచేసి పాపాయిని ముద్దు పెట్టుకోవద్దు
2 .చెప్పాపెట్టకుండా రావద్దు (పిల్ల పుట్టిన అలసటలోనో, ప్రసూతి వైరాగ్యంలోనో ఉండే నేను అంత వెంటనే నలుగురినీ కలిసేందుకు సిద్ధంగా ఉండకపోవచ్చు)
3 . మాకు పాపాయి పుట్టిందని మేము చెప్పేవరకు దయచేసి మీరు అందరికీ చెప్పకండి (సోషల్ మీడియాలో కూడా)
4 . మేము తప్ప పాపాయి ఫోటోలు మీరెవరూ తీయకూడదు. ఎక్కడా పోస్ట్ చెయ్యకూడదు
5 . ఏమాత్రం ఆరోగ్యం బాగాలేకపోయినా రావద్దు (చిన్నపాటి దగ్గయినా సరే)

6 . పాపాయిని ఎత్తుకునేముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి (అంతకుముందు ఏమేమి ముట్టుకున్నారో ఏంటో)
7 . ఈ తొమ్మిదినెలల్లో నాతో మాట్లాడకుండా, కనీసం ఎలా ఉన్నానో అడగకుండా ఉంటే మాత్రం పాపాయిని చూస్తానని అడగకండి
8 . మీరు ఎత్తుకున్నప్పుడు పాపాయి ఏడిస్తే వెంటనే నాకో, వాళ్ళ నాన్నకో ఇచ్చేయండి (పాపాయి ఏడిస్తే చూస్తూ భరించడం నా వల్ల కాదబ్బా)

ఏంటిది అనుకుంటున్నారా? ఎంతో మంది తల్లుల్ని చూశాం గానీ ఇంత విడ్డూరం లేదని విసుక్కుంటున్నారా? అయినా డోంట్ కేర్ అంటోంది మైసీ క్రామ్ప్టన్ అనే లండన్ మహిళ. టోటె బాగ్స్ వ్యాపారం చేసే ఈమె అనేక మంది తల్లుల్ని చూసింది. తను తల్లయినప్పటినుంచి టిక్ టాక్ వీడియోలతో విశేషాలు పంచుకుంటోంది. అలా వచ్చిన ఐడియా నే ఇది. తన పాపాయికి సంబంధించి పై షరతులతో రిలీజ్ చేసిన టిక్ టాక్ వీడియో బాగా వైరల్ అయింది. కొంతమంది మరీ ఓవర్ యాక్షన్ అన్నా , ఎక్కువ శాతం తల్లులు సమర్థించారు.

అవునుమరి, ప్రతి తల్లికీ మాతృత్వం అపురూపమే. పొత్తిళ్లలోని పాపాయిని చూడటానికి ఎవరు వచ్చినా భయంగానే ఉంటుంది. వాళ్ళు శుభ్రంగా ఉన్నారో లేదో, పాపాయికి వారినుంచి హాని కలుగుతుందేమో అని తల్లడిల్లిపోయేదే తల్లి మనసు. ఇక ఎవరన్నా పాపాయిని ముద్దు పెట్టుకుంటే మరింత బాధగా ఉంటుంది. చాలామంది వారిస్తారు కూడా. అందుకే పాతకాలం నుంచీ మనవాళ్ళు ఎన్నో పద్ధతులు పాటించేవారు. బాలింత దగ్గరకు వెళ్లాలన్నా, పసివారిని ముట్టుకోవాలన్నా చాలా ఆలోచించేవారు. అసలు పదకొండురోజులవరకు ఎవరిని కలవనిచ్చేవారు కాదు. తల్లికి, పిల్లకు కూడా ఆహారం, స్నానం, పథ్యం విషయాల్లో ఎన్నో ఆంక్షలు. సరే, కాలం మారిపోయింది పెద్దవాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు లేరు. అసలు చెప్పేవాళ్ళే లేరు. అయినా తల్లికి ఒకరు చెప్పక్కరలేదు. ప్రపంచంలో ఏ తల్లి కైనా బిడ్డ క్షేమమే ముఖ్యం. అదే ఇక్కడ మైసీ చేసింది. అందుకే ఆమె వీడియో తల్లుల ప్రశంసలు అందుకుంటోంది.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్