Heart touching: మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన  తాజా చిత్రమే  ‘మేజర్‘. ఇది 26/11 ముంబై తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణత్యాగం చేసిన ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా. మహేశ్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. రేవతి .. మురళీశర్మ .. శోభిత ధూళిపాళ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఓ మధ్య తరగతి  కుటుంబంలో జన్మించిన సందీప్ .. చిన్నప్పటి నుంచి కూడా సోల్జర్ కావాలనే కలలు కంటాడు.తల్లిదండ్రులతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి కూడా అది ఇష్టం ఉండదు. అయినా వాళ్లని ఒప్పించి తాను అనుకున్న మార్గంలోనే ముందుకు వెళతాడు. తన టీమ్ లోని వాళ్లందరికీ స్ఫూర్తినిస్తూ ఎదుగుతూ వచ్చిన సందీప్, హోటల్ తాజ్ పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన ఆపరేషన్లలో ప్రధానమైన పాత్రను పోషిస్తాడు. ప్రాణాలకు తెగించి మరీ ముందుకు వెళతాడు. తాను అనుకున్నది సాధించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు.

అక్కడక్కడా .. అదీ ఫస్టాఫ్ లో కథనం కాస్త స్లోగా అనిపించినప్పటికీ, ఈ సినిమాపై ఆడియన్స్ కి ఉన్న అంచనాలను  దర్శకుడు శశికిరణ్ తిక్కా అందుకున్నాడనే చెప్పాలి. తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో సక్సెస్  అయ్యాడనే అనాలి. ముఖ్యంగా హోటల్ తాజ్ నేపథ్యంలో జరిగే సన్నివేశాలను తెరకెక్కించడంలో ఆయన ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక సహజత్వంతో కూడిన సన్నివేశాలకు అందుకు తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సంభాషణలు .. ఫొటోగ్రఫీ అదనపు బలంగా నిలిచాయి. ‘మేజర్’ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయాడు. ఆయన భార్య పాత్రలో సయీ మంజ్రేకర్ చాలా నిండుగా కనిపించింది. ప్రకాశ్ రాజ్ తో పాటు మిగతా వాళ్లంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ పరంగా కూడా మనసును కదిలించే ఈ సినిమా, నిర్మాణపరమైన విలువలతోను ఆకట్టుకుంటుంది.

Also Read : మేజర్’ ప్రత్యేకత అదే: అడివి శేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *