దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఉత్తరాఖండ్ లో బీజేపీ, ఒడిశాలో బీజేడీ, కేరళలో యూడీఎఫ్ అభ్యర్ధులు విజయాలు నమోదుచేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఒడిశాలో అధికార పార్టీల అభ్యర్ధులే విజయం సాధించగా.. కేరళలో ప్రతిపక్ష యూడీఎఫ్ కు విజయం దక్కింది.

ఉత్తరాఖండ్‌లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి, సీఎం పుష్కర్ సింగ్ ధామీ 55 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2022లో ఈ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. చంపావత్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లా కింద ఉంది. 2022లో భారతీయ జనతా పార్టీకి చెందిన కైలాష్ గహ్తోరి 5304 ఓట్ల తేడాతో భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన హేమేష్ ఖార్క్వాల్‌ను ఓడించి సీటును గెలుచుకున్నారు. కేరళలోని త్రిక్కకర అసెంబ్లీ ఉపఎన్నికల్లో యూడీఎఫ్ అభ్యర్ధి ఉమా థామస్ 12 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎల్డీఎఫ్ అభ్యర్ధి జో జోసఫ్ ఓటమి చెందారు.

ఒడిశాలోని బ్రజరాజ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రాధారాణి పాండేపై బీజేడీ అభ్యర్ధి అలకా మొహంతి 10248 ఓట్లతో గెలిచారు. 2019లో ఈ నియోజకవర్గం బిజూ జనతాదళ్‌ గెలిచింది. ఒడిశా రాష్ట్రంలోని జార్సుగూడ జిల్లా పరిధిలోని బ్రజరాజ్‌నగర్.2019లో బిజూ జనతాదళ్‌కు చెందిన కిషోర్ కుమార్ మొహంతి 11634 ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీకి చెందిన రాధారాణి పాండాపై విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *