లోక్ సభ ఎన్నికల చివరి దశలో కలకత్తా హైకోర్టు తృణముల్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010 తర్వాత 118ముస్లిం కులాలకు జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను ఉన్నత న్యాయస్థానం బుధవారం రద్దు చేసింది. ఎలాంటి సర్వే చేపట్టకుండా 2012లో బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన వెనుకబడిన తరగతుల చట్టం కింద జారీచేసిన ఈ ధ్రువపత్రాలన్నీ చట్టవిరుద్ధమైనవిగా కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినవారిపైన, ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఉన్నవారిపైనా తీర్పు ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సామాజిక వర్గాలను ఓబీసీ జాబితా నుంచి తొలగించేలా వారు (బీజేపీ) ఈ ఆర్డర్ ఇచ్చారని ఆరోపించారు. దీనిని అంగీకరించేది లేదని… ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందన్నారు.
దీది ప్రకటనతో ఇది ఎన్నికల అంశంగా మారనుందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో బిజెపి – తృణముల్ కాంగ్రెస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయ వైరం నెలకొంది. ఈ తరుణంలో న్యాయస్థానం తీర్పును రెండు పార్టీలు ఎన్నికల రణరంగంలో అస్త్రంగా మార్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
కలకత్తా హైకోర్టు తీర్పుతో లోక్ సభ ఎన్నికల చివరి దశలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో లోక్‌సభ ఎన్నికల 6వ దశలో 8 స్థానాలకు ఓటింగ్ మే 25న జరగనుంది. తమ్లుక్, కాంతి, ఘటల్, ఝర్‌గ్రామ్, మెదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్‌లలో ఓటింగ్ జరుగుతుంది.
ఏడో దశలో జూన్ ఒకటో తేదిన పోలింగ్ జరగనుండగా.. ఉత్తర కలకత్తా, దక్షిణ కలకత్తా, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, డమ్ డమ్, బరాసత్, బషీర్‌హట్, జాయ్‌నగర్, మధురాపూర్ లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశలో కొంత గ్రామీణ ప్రాంతాలు ఉన్నా.. ఏడో దశలో పూర్తిగా నగర ఓటర్లే కావటం గమనార్హం.
జాతీయ స్థాయిలో 8 రాష్ట్రాల్లో 58 స్థానాల్లో ఆరో దశలో పోలింగ్ జరగనుండగా.. ఏడో దశలో 57 లోక్ సభ స్థానాల్లో 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. చివరి రెండు దశలపై కలకత్తా హైకోర్టు తీర్పు ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది.
-దేశవేని భాస్కర్