మలయాళ సినిమాలకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. దాదాపు మలయాళ సినిమాలలో కొత్తదనం ఉంటుందనీ, సహజత్వానికి దగ్గరగా కథలు .. పాత్రలు ఉంటాయనే నమ్మకం ఇతర భాషలకి చెందిన ఆడియన్స్ కి కూడా అర్థమైపోయింది. అందువలన మలయాళం నుంచి వచ్చే అనువాద సినిమాల పట్ల ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక మమ్ముట్టి .. మోహన్ లాల్ .. ఫహాద్ ఫాజిల్ .. పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారి సినిమాల పట్ల మరింత ఆసక్తిని చూపిస్తున్నారు. అలా మమ్ముట్టి నుంచి వచ్చిన సినిమానే ‘టర్బో’.
మమ్ముట్టి – రాజ్ బి శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ‘టర్బో’ సినిమాకి వైశాఖ్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. మే 23వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. అంజనా జయప్రకాశ్ .. సునీల్ .. కబీర్ దుహాన్ సింగ్ వంటివారు ముఖ్యమైన పాత్రలను పోషించారు. క్రిస్టో సేవియర్ నేపథ్య సంగీతం హైలైట్ గా నిలిచింది.
అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి ‘సోనీలివ్’ లో స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ .. బెంగాలీ .. మరాఠీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథలో కథానాయకుడు ఉపయోగించే వాహనం పేరు టర్బో. హీరో తన స్నేహితుడు ఒక యువతిని ప్రేమిస్తున్నాడని తెలిసి, ఆమెను అతని ఇంటికి తీసుకొచ్చి అప్పగిస్తాడు. అతను చేసిన ఆ ప్రయత్నం ఎలాంటి సమస్యలను సృష్టించిందనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి.