Saturday, January 18, 2025
HomeTrending Newsమన ఊరు - మన బడితో మహర్దశ

మన ఊరు – మన బడితో మహర్దశ

Mana Ooru Mana Badi :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తెరిగి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు భాగస్వాములై కలిసికట్టుగా పనిచేస్తూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాదు కలెక్టరేట్ లో బుధవారం మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం అంశాల పై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం నాలు వైపులా వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని, పీ హెచ్ సి లలో కూడా వెంటిలేటర్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇదే తరహాలో ప్రభుత్వ బడులను కూడా మరింతగా బలోపేతం చేసి ప్రజలపై ఆర్ధిక భారాన్ని తగ్గించాలనే గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు – మన బడి పేరుతో మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చి, ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను అమలులోకి తెస్తే ప్రైవేట్ పాఠశాలలకు బదులు అన్ని వర్గాల ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపిస్తారన్నారు. దీని వల్ల ప్రజలపై ఎంతో ఆర్ధిక భారం తగ్గుతుందని, ప్రభుత్వ విద్య పటిష్టం అవుతుందని పేర్కొన్నారు.
ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న ప్రభుత్వ బడులకు విరివిగా విరాళాలు అందించి సర్కారీ బడుల అభ్యున్నతి కోసం తోడ్పడాలని ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్లు, సర్పంచ్ లు, ప్రధానోపాధ్యాయులు పూర్వ విద్యార్థులను, ఇతర దాతలను సంప్రదించి ప్రభుత్వ బడులకు విరాళాలు సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుల్లో మౌలిక వసతులు మెరుగుపడితే విద్యా బోధనా ప్రమాణాలు మెరుగుపడతాయని, ఇది గ్రామీణ విద్యార్థులు చక్కటి భవిష్యత్తును ఏర్పర్చుకునేందుకు దోహదపడుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 26 ,672 పాఠశాలల్లో మన ఊరు మన బడి కింద మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు 7289 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఆషామాషీగా చేపట్టకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, నిర్వహణ కమిటీలను భాగస్వాములు చేస్తూ ఎంతో పకడ్బందీగా అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.
జిల్లాలో మొత్తం 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, తొలి విడతలో ఎవరి ప్రమేయం లేకుండా విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని 407 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. అయితే తొలి విడతలోనే దాదాపు 65 శాతం విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో లక్షా 13 ,877 మంది విద్యార్థులు చదువుతుండగా, వీరిలో తొలి దఫాలోనే 72 ,801 మంది విద్యార్థులకు మౌలిక సదుపాయాలూ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమం అమలవుతున్న బడులలో అన్ని వసతులతో చక్కటి వాతావరణం కల్పించడం ద్వారా కార్పొరేట్ స్కూళ్లను మరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నారు. అవసరమైన చోట మరమ్మతు పనులను చేపడుతూ, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లాబరేటరీ, లైబ్రరీ, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నీచర్, డిజిటల్ విద్యా బోధనకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అవసరమైన పనులను మాత్రమే గుర్తించాలని, అవసరం లేని పనులను ప్రతిపాదిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తొలి విడతలోనే మన ఊరు – మన బడి కార్యక్రమం కింద జిల్లాకు 160 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు సమిష్టిగా పనిచేస్తూ ప్రభుత్వ బడులను బాగు చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.
కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, విద్యా రంగాన్ని పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తూ, అన్ని ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విధంగా తీర్చిదిద్దాలనే కృత నిశ్చయంతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల సర్కారీ బడుల్లో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో విద్య బోధనా ఎంతగానో మెరుగుపడుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సమీక్షా సమావేశంలో నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, ఐ డీ సి ఎం ఎస్ చైర్మన్ మోహన్, జెడ్ పీ టి సి బాజిరెడ్డి జగన్, జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్