మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం : మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల ముందు నుంచి ప్రచారం మొదలుపెట్టడంతో ఈసారి ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరగనున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను అని తెలియజేస్తూ.. ఓ లేఖ విడుదల చేశారు. ఆ లేఖ మీ కోసం…

నమస్కారం..
‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలూ బాగా తెలుసు.. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు మేమెంతో రుణపడి ఉన్నాము. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

మా నాన్నగారు ‘మా’ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, వారి నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శకాలు అయ్యాయి. గతంలో ‘మా’ అసోసియేషన్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను పనిచేసినప్పుడు ‘మా’ బిల్డింగ్ ఫండ్ కి నా కుటుంబం తరుపున ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25% అందిస్తానని మాట ఇచ్చాను. బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేసాను. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలుచేశాను. ‘మా’ అసోసియేషన్ వ్యవహారలన్నిటినీ అతిదగ్గరగా జాగ్రత్తగా పరిశీలించిన నాకు ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. ‘మా’ సభ్యులలో కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా వుంటాము, అందుబాటులో ఉంటాము. ‘మా’ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా నా సేవలను సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను.

పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తూ… మీ ఆశీస్సులు కోరే..

– విష్ణు మంచు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *