Tuesday, January 28, 2025

నివాళి

మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి, ప్రధాని కావడానికి ముందు ఎక్కడెక్కడ ఏయే ఉద్యోగాలు చేశారు? విద్యార్థిగా ఎక్కడెక్కడ చదివారు? ఏ స్థాయి విద్యార్థులకు ఎక్కడెక్కడ అధ్యాపకుడిగా పాఠాలు చెప్పారు? అన్నది చదువుకున్నవారు, సామాజిక స్పృహ ఉన్నవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.

ఎందుకంటే ఈరోజుల్లో సింహాసనం ఎక్కగానే-
బిల్ గేట్స్ కు మైక్రోసాఫ్ట్ పెట్టమని నేనే చెప్పాను;
సత్య నాదెళ్ళను అమెరికాకు నేనే పంపించాను;
మౌస్ కనుక్కున్నది నేనే;
సెల్ ఫోన్ కనుక్కున్నది నేనే;
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ఇంటెలిజెన్స్ నేర్పింది నేనే;
హైదరాబాద్ నగరాన్ని కట్టించింది నేనే;
శంకరాచార్యులు కనకధారాస్తవం రాయలేక         బుర్ర గోక్కుంటూ ఉంటే…ఎలా రాయాలో చెప్పింది నేనే…లాంటి ఎన్నెన్నో విషయాలను కళ్ళార్పకుండా చెప్పగలిగే రాజకీయ నాయకులున్నప్పుడు నోరు విప్పి ఏనాడూ తన గురించి తాను గట్టిగా రెండు మాటలు కూడా చెప్పుకోని మన్మోహన్ సింగ్ గురించి నాలుగు మాటలు చెప్పుకోవడం భారతీయులుగా మన బాధ్యత.

ఒక వరుసలో క్లుప్తంగా కనీసం పదిహేను, ఇరవై పేరాలు రాసినా ఇంకా రాయాల్సింది మిగిలిపోయే విద్యా, ఉద్యోగ చరిత్ర మన్మోహన్ సింగ్ ది. కేంబ్రిడ్జ్ మొదలు భారత రిజర్వ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితి దాకా ఆయన విజ్ఞానం, సేవలు ఎలా విస్తరించాయో సామాజిక మాధ్యమాల నిండా ఉంది. అదంతా చెబితే చర్విత చర్వణమవుతుంది. ఆసక్తి ఉన్నవారు వెతుక్కోవచ్చు.

  • రెండు పర్యాయాలు కలిపి పదేళ్ళపాటు ప్రధానిగా పనిచేసినా…ఆయన పిల్లలెవరో, ఎలా ఉంటారో, ఏమి చేస్తుంటారో ప్రపంచానికి తెలియకపోవడంలోనే ఉంది మన్మోహన్ సింగ్ గొప్పతనం.
  • దేశాన్ని కుదిపేసే ఏవేవో అవినీతి కేసులు యు పి ఏ హయాములో 2004-2014 మధ్య పదేళ్ళలో బయటపడి ఉండవచ్చు. ఎక్కడా ఎవరూ ప్రధానిగా మన్మోహన్ సింగ్ అవినీతికి పాల్పడ్డారు అని అనకపోవడంలోనే ఉంది ఆయన గొప్పతనం.
  • ఏనాడూ రాజకీయాల్లో లేని వ్యక్తిని ఒకానొక ఆర్థిక సంక్షోభ సమయంలో ఏకంగా దేశ ఆర్థిక మంత్రిగా ప్రధాని పి వీ ఆయన్ను ఎంచుకోవడంలోనే ఉంది ఆయన గొప్పతనం.

  • ఆర్థిక సరళీకరణలతో ప్రపంచం ముందు భారత్ ను నిలబెట్టడంలో, భారత్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, పరుగులు పెట్టించడంలోనే ఉంది ఆయన గొప్పతనం.
  • చదువు- సంస్కారం కలగలిసినవారు రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ లా ఉండాలని దేశం కోరుకోవడంలోనే ఉంది ఆయన గొప్పతనం.
  • చేసిన పని మాట్లాడాలి కానీ…నోరు కాదు మాట్లాడాల్సింది అని అనడానికి పరిశీలకులు మన్మోహన్ సింగ్ ను ఉదాహరణగా చెప్పడంలోనే ఉంది ఆయన గొప్పతనం.
  • I do not believe that I have been a weak Prime Minister. I honestly believe that history will be kinder to me than the contemporary media or for that matter the Opposition in Parliament… Given the political compulsions, I have done the best I could do(నేనొక బలహీనమైన ప్రధానమంత్రిని అనుకోవడం లేదు. ప్రస్తుత మీడియా, ప్రతిపక్షాలతో పోలిస్తే…చరిత్ర నన్ను కొంత అర్థం చేసుకుంటుందనే అనుకుంటున్నాను. నాముందున్న పరిస్థితులు, రాజకీయ అనివార్యతల పరిమితుల్లో నేను చేయగలిగినంత మంచి చేశాను)” అన్న మన్మోహన్ సింగ్ మాటల మధ్య ఆయన్ను చూడగలిగితే తెలుస్తుంది ఆ గొప్పతనం.
  • భారత ఆర్థిక పునాదుల్లో, సౌధంలో, వికాసంలో, వైభవంలో మన్మోహన్ సింగ్ పేరు నిలిచి ఉంటుంది. ఆయన పేరు ప్రతిష్ఠలు కోరుకోకపోవచ్చు. ఆ కీర్తి ఆయనకు ఇవ్వకపోతే మనమే ఎప్పటికీ చేసిన మేలు మరచిన కృతఘ్నులమై పడి ఉంటాము.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్