“మనిషిని నమ్మితే ఏముందిరా ?
మబ్బును నమ్మినా ఫలితముందిరా నాన్నా !
తీవెను పెంచితే పూలిస్తుందిరా!
గోవును పెంచితే పాలిస్తుందిరా!
పామును మొక్కుకుంటే పక్కకు తొలగునురా!
మనిషిని నమ్ముకుంటే పచ్చి విషం దొరుకునురా!
కుడిచిన పొదుగునే పొడిచే వారున్నారు
పెట్టిన చేయినే విరిచే వారున్నారు…
బంధువులని చెప్పుకునే రాబందులు ఉన్నారు…
కవన్నె పులులు ఈ లోకమంతా ఉన్నారు…”
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
రైతుబిడ్డ సినిమా కోసం సినారె రాసిన పాట. సుమారు 50 ఏళ్ళ క్రితం రాసింది. ఇప్పటికీ పరిస్థితులు అలాగే ఉన్నాయంటారు మన్ ప్రీత్ సింగ్. అయితే పైన చెప్పినట్టు మబ్బును కాకుండా పంచభూతాలను నమ్ముకోవాలంటాడీయన. ఇంతకీ ఎవరీ మన్ ప్రీత్? హైదరాబాద్ లో ప్రముఖ పాటరీ నిపుణుడు. తన ఎంఎస్ఎన్ స్టూడియో ద్వారా ఎందరో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. అంతకన్నా మన్ ప్రీత్ గురించి చెప్పుకోవలసిన విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి.
రెండొందల యేళ్ళ క్రితమే పంజాబ్ నుంచి నిజాం దగ్గరకు వచ్చింది మన్ ప్రీత్ కుటుంబం. పసితనం నుంచే జంతువులు, క్రిమికీటకాదులంటే మక్కువ. బొద్దింక మొదలుకొని కోతుల వరకు పెంచేవాడట. కొన్నిసార్లు కరిచేవి కూడా. అయినా పట్టించుకోలేదు. భయం లేదా అంటే ఎందుకని ప్రశ్నిస్తారు. జంతువులకు ఒక చోటే విషముంటుందని, మనిషి మాత్రం నిలువెల్లా విషమని మన్ ప్రీత్ అభిప్రాయం. చిన్నతనం నుంచీ హస్తకళలంటే మక్కువ. 40 ఏళ్లుగా అయన సేకరించిన గవ్వలు చక్కగా ఫ్రేమ్ లో ఒదిగి ఆయన ఇంటిగోడకి అలంకారమయ్యాయి. మడత మంచం నుంచి ఇత్తడి డబ్బాల వరకు మనం మరచిపోయిన వస్తువులు ఎన్నో కోకాపేటలోని ఆయన ఇంట్లో కొలువుదీరాయి. పాటరీపైన మక్కువతో మన్ ప్రీత్ ఢిల్లీ వెళ్లి నేర్చుకున్నారు. తన ఇంటి పై భాగాన్ని స్టూడియోగా మార్చి ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నారు. తన అభిరుచి నెరవేర్చుకోడానికి ఉద్యోగమూ మానేశారు. ఆర్డర్లపై చేయడమే కాకుండా వర్క్ షాప్స్, కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్ డే పార్టీలలో పాటరీ నిర్వహిస్తారు. ఉడతలు, పక్షుల సంరక్షణకు కృషి చేస్తున్నారు. అనేక స్వఛ్చంద సంస్థలతో కలసి పని చేస్తున్నారు. నీరు, విద్యుత్తు వృధా కాకుండా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆయన ఇల్లంతా పచ్చదనంతో కప్పి ఉంటుంది. పాత కాలం తలుపులు, అనేక వస్తువులు అడుగడుగునా కనిపిస్తాయి. జంతువుల పైన ప్రేమతో మాంసాహారం మానేశారు. బ్లు క్రాస్ ప్రేరణతో జంతువుల పాలు వద్దనుకున్నారు. వీగన్ గా మారారు. వాడి పారేసే ప్లాస్టిక్ జోలికి పోరు. తన ఇంటి నిర్మాణంలో ఇసుక వాడలేదు. క్రిమి కీటకాలు రాకుండా జాగ్రత్త పడాలే తప్ప మందులు కొడితే ఆ విషం మనకే తగులుతుంది అంటారు మన్ ప్రీత్. ఆయనకి రాజకీయాలు పట్టవు. తన ఇంటిలో టీవీ కూడా పెట్టుకోలేదు. వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వే. ప్రకృతి, పర్యావరణ సమతుల్యం కోసం ప్రశంసనీయ తోడ్పాటు అందిస్తున్న మన్ ప్రీత్ అడిగిన వారికి ఆ యా విషయాలపై చక్కని సూచనలూ అందిస్తారు. ఇటువంటి వ్యక్తులను కలసినప్పుడు మనకూ పర్యావరణంపై మక్కువ పెరుగుతుంది. ఏదన్నా చెయ్యాలనే స్ఫూర్తి కలుగుతుంది. ఎటువంటి గుర్తింపు కోరుకోకుండా మౌనంగా తనపని చేసుకుపోయే మన్ ప్రీత్ వంటివారు నేటి సమాజానికి చాలా అవసరం.
ఈ కథనం వీడియో లింక్:-
-కె. శోభ
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv