Tuesday, September 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఓవైపు ఒలింపిక్స్ పతకాలు! మరోవైపు గురుశిష్యుల విభేదాలు!

ఓవైపు ఒలింపిక్స్ పతకాలు! మరోవైపు గురుశిష్యుల విభేదాలు!

పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారతీయ మహిళగా మనూభాకర్ ఇప్పుడో సంచలనం. వార్తల్లో వైరల్. సాధారణంగా క్రీడాకారులతో పాటు.. వారి కోచెస్ ఎవరూ అనే చర్చ కూడా వస్తుంటుంది. ఈ క్రమంలో ప్యారిస్ ఒలింపిక్స్ లో మనూ విజయం వెనుకున్న కోచ్ ఎవరనే చర్చ నుంచి.. ఇప్పుడు కోచ్ రాణాకు, తన శిష్యురాలైన మనూకు మధ్య గతంలో నెలకొన్న వివాదంపైకి ఆ చర్చ కాస్తా మళ్లింది. మరి వారిద్దరినీ ఓ కుదుపు కుదిపేసిన ఆ వివాదమేంటి..?

రాణా వర్సెస్ భాకర్ మధ్య అసలేం జరిగింది..?
మొట్టమొదటిసారి 2018 కామన్ వెల్త్ గేమ్స్ కంటే ముందు జస్పాల్ రాణాతో మనూభాకర్ కు గురు, శిష్యుల బంధమేర్పడింది. అదే భాకర్ షూటింగ్ కెరీర్ లో ఓ కీలక ములుపు కూడా. అలా 16 ఏళ్ల ప్రాయంలోనే గోల్డ్ మెడల్ సాధించిన మహిళా షూటర్ గా మనూభాకర్ వార్తల్లోకెక్కింది. కోచ్ గా రాణాతో మనూభాకర్ శిష్యబంధం మరింత బలపడింది.

2019లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన వరల్డ్ కప్ గేమ్స్ లో.. మనూభాకర్, సౌరభ్ చౌదరీతో కలిసి సాధించిన ఐదు బంగారు పతకాలు భాకర్ లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అయితే అదే సమయంలో మనూభాకర్ కు.. తన కోచ్ జస్పాల్ రాణాతో విభేదాలూ మొదలయ్యాయి.

ఒకేసారి పదిమీటర్ల పిస్టల్ షూటింగ్ తో పాటు.. మిక్స్ డ్ డబుల్స్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ.. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ కూ సిద్ధమవ్వడమంటే… ఓ యంగ్ షూటర్ కు అయ్యే పని కాదనేది కోచ్ జస్పాల్ రాణా నిశ్చితాభిప్రాయం. కానీ, దాన్ని మనూభాకర్ అంగీకరించలేకపోయింది. జస్పాల్ రాణా శిష్యురాలిగా వైదొలిగింది. అయితే, అదే సమయంలో మనూభాకర్ తీవ్ర మానసిక ఒత్తిడికీ గురైంది. తన కోచ్ అన్న మాటలతో… విభేదాలేర్పడ్డాక తనపైన తనకే నమ్మకం లేనంతగా ఒక దశలో కృంగిపోయింది.

కోచ్ జస్పాల్ కు ఘాటైన సందేశం!
2021 వరకూ కూడా ఆ విభేదాలు కోచ్ రాణాకూ, శిష్యురాలైన భాకర్ కూ మధ్య అంతర్గతంగానే కొనసాగాయి. ఆ సమయంలో ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ కోసం న్యూఢిల్లీలో మార్చ్ 21, 2021లో జరుగుతున్న వరల్డ్ కప్ సమయంలో అవి తారాస్థాయికి చేరి డ్రమటిక్ గా మారాయి. తన కోచ్ తన పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి తట్టుకోలేక కోపంతో మనూభాకర్ తన అసంతృప్తిని చాటుతూ ఫోన్ లో రాణాకు ఓ సందేశాన్ని కూడా పంపింది.

ఇంతకీ ఏంటా సందేశం..?
ఇప్పుడు మీకు సంతోషమేనా…? అభినందనలంటూ ఇంగ్లీష్ లో టైప్ చేసి పంపిన ఆ మెస్సేజ్ రాణాను ఒకింత అసహనానికి గురిచేసింది.

కోచ్ చర్యతో మరో టర్న్ తీసుకున్న ఎపిసోడ్!
అయితే, ఆ డ్రామా అక్కడితో ఆగిపోలేదు. ఆరోజు జరిగిన 10 మీటర్ల షూటింగ్ లో చింకీ యాదవ్ గోల్డ్ మెడల్, మనూభాకర్ కాంస్య పతకం సాధించారు. అదిగో అప్పుడు కోచ్ జస్పాల్ రాణా మనూభాకర్ తనకు పంపిన సందేశాన్ని తన టీషర్ట్ పై బాహాటంగా వెనుక వీపువైపు డిస్ ప్లే చేయడం మరింత నాటకీయ పరిణామాలకు దారితీసింది.

ఆ పరిణామం మనూభాకర్ కంటే కూడా భారత్ తరపున సుమారు 600 జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధించిన షూటర్ గా.. కామన్ వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారుడిగా… తీవ్ర జ్వరంలోనూ స్వర్ణాన్ని ముద్దాడిన యోధుడిగా… షూటింగ్ పై తనకున్న అంకితభావంతో ఏర్పాటు చేసిన డెహ్రూడూన్ లోని జస్పాల్ రాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నాలజీ నిర్వాహకుడిగా.. మనూభాకర్ వంటి అప్ కమింగ్ షూటర్స్ కు కోచింగ్ ఇస్తున్న కోచ్ గా రాణాకే మైనస్ గా మారింది. దాంతో తన కోచ్ పదవే పోయింది. దాంతో రాణా గత మూడేళ్ల నుంచీ ప్యారిస్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న పట్టణంలో ఓ నిరుద్యోగిగా కాలాన్ని గడుపుతున్నాడు జస్పాల్ రాణా.

టోక్యో పరాజయం తర్వాత మనూలో పరివర్తన!
కానీ, మనూభాకర్ లో వచ్చిన పరివర్తన కారణంగా… గత 3 ఏళ్లుగా ఓ నిరుద్యోగిగా ఇబ్బంది పడుతున్న రాణానే మళ్లీ తన కోచ్ గా ఉండాలని భావించింది. ఎందుకంటే గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో మనూభాకర్ సరైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఆ పరాజయం ఆమెను వెంటాడింది. దాంతో జరిగిందేదో జరిగిపోయిందనుకుని.. మళ్లీ గురువు జస్పాల్ రాణాను సంప్రదించింది. అందుకు ఆయనా ఒప్పుకున్నాడు. అలా ప్యారిస్ ఒలింపిక్స్ పిస్టల్ షూటింగ్ కు మళ్లీ రాణానే గురువయ్యాడు మనూభాకర్ కి.

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సమయంలో కూడా తననే గమనిస్తున్న కోచ్ వైపు ఓ లుక్కేసిన మనూ.. ఆ తర్వాత తన కోచ్ ను చూశాక సమకూరిన ధైర్యంతో తాను గురి తప్పకుండా లక్ష్యం వైపు దృష్టి సారించింది. స్వర్ణమో, రజతమో రాలేదన్న ఓ బెంగ ఉండవచ్చుగాక.. కానీ, తనకు కోచ్ తో ఏర్పడ్డ విభేదాల తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లిన మనూ… మళ్లీ తిరిగి పుంజుకుని కాంస్యాన్ని సాధించింది. వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో పాటు.. డబుల్స్ లో కూడా కాంస్యాన్ని సాధించి.. విశ్వక్రీడల్లో షూటింగ్ విభాగంలో మొట్టమొదటగా రెండు కాంస్యాలందుకున్న భారతీయ మహిళా షూటర్ గా చరిత్ర సృష్టించింది.

తమ మధ్య నెలకొన్న వివాదాన్ని రివీల్ చేసిన రాణా!
ప్యారిస్ లో మనూభాకర్ సాధించిన విజయాలపై తన సంతృప్తిని వ్యక్తం చేసిన జస్పాల్ రాణా.. తన శిష్యురాలికి అభినందనలూ తెలిపాడు. తన శిష్యురాలిగా మనూభాకర్ గెలుపు జస్పాల్ రాణాలోనూ ఆనందానికి కారణమైనా.. ఇప్పుడు రాణా ఇండియాకు తిరిగి రావాలనుకుంటున్నాడు. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగా లేకపోవడం.. గత మూడేళ్లుగా తనకు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచిగానీ.. లేదా, ఏ ఇతర ఎజెన్సీల నుంచిగానీ జస్పాల్ రాణాకు నెలవారీ జీతం కూడా అందని పరిస్థితుల్లో తన లైఫ్ స్టోరీని RevSportz అనే పత్రికతో పంచుకున్నారాయన.

మనూభాకర్ విజయం ఇప్పుడు జస్పాల్ రాణాకు ఆనందినిచ్చినా.. ఆ విజయం వెనుక తన ప్రోద్భలం, ప్రోత్సాహమున్నా… ఇప్పుడు తను మాత్రం కేవలం మనూభాకర్ వ్యక్తిగత కోచే తప్ప… క్రీడావిభాగంలో ఎలాంటి ఉపాధి లేని ఓ నిరుద్యోగి.

వివాదం నుంచి విజయం వైపుకు!
పాయింట్ బ్లాంక్ లో ఏర్పడ్డ విభేదాలు.. గురుశిష్యుల జీవితాలనే మార్చేశాయి. అయితే, ఈగోస్ ను పక్కనబెట్టి మనూభాకర్ మళ్లీ తన వ్యక్తిగత కోచ్ గా జస్పాల్ రాణాను ఎంచుకోవడమే ఆమె మొదటి విజయం. కాగా ఇప్పుడు ఒలింపిక్స్ లో సాధించిన పతకాలు మన దేశం తరపున ఆమె కెరీర్ లోనే అత్యున్నతం.

మొత్తంగా ఇద్దరు గురుశిష్యులు లక్ష్యం కోసం చేసిన ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులెదుర్కొన్నా అంతిమంగా దేశం పేరును నిలబెట్టిన సక్సెస్ స్టోరీ ఇది.

ఇప్పుడు కావల్సిందల్లా జస్పాల్ రాణాను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు తిరిగి సమున్నతంగా గౌరవించాలి. మరింత మంది మనూభాకర్లు తయారుకావాలి. మనూ మరింత ముందుకెళ్లి స్వర్ణాలను ముద్దాడాలి.

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్