Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకరోనా దెబ్బకు కంపెనీల్లో ఓదార్పు నిపుణులు!

కరోనా దెబ్బకు కంపెనీల్లో ఓదార్పు నిపుణులు!

వినడానికి ఇబ్బందిగా ఉన్నా వినకతప్పనివి ఎన్నో వినాల్సిన రోజులొచ్చాయి. ఆసుపత్రులు, పరీక్షలు, మందులు, క్వారంటైన్ లు, ఐ సి యూ లు, వెంటిలేటర్లు, మరణాలు రోజువారి మాటలయ్యాయి. ఎవరింట్లో ఎవరు పోయారో? ఎవరింట్లో ఎవరున్నారో? పరామర్శించాల్సిన కాలమొచ్చింది. అన్ని రుతువులను మింగి కూర్చున్న కనికరం లేని కలికాల కరోనా రుతువే సాగుతోంది. నిన్న మాట్లాడిన మనిషి నేడు లేడు. మొన్న నలుగురు కూర్చుని నవ్విన ఇంట్లో నేడు ఒంటరి కన్నీటి ధారలు. చెట్టంత ఎదిగి నీడనివ్వాల్సిన మనిషి నిలువ నీడలేకుండా పోయాడు. అయినవారి కడచూపులను కూడా కరోనా నిర్దయగా రద్దు చేసింది. అంతిమ సంస్కారాలు కూడా సంస్కార రహితంగా బూడిదవుతున్నా చేయగలిగింది లేదు.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత, మరణాలు, బాధలతో దేశానికి ఊపిరాడడం లేదు. దిగమింగుకోలేని బాధ గొంతును నొక్కేస్తోంది. గుండెలు బరువెక్కుతున్నాయి. కన్ను తెరిచినా, మూసినా కరోనా ముళ్ల బంతే గింగిరాలు తిరుగుతూ కనబడుతోంది.

పెద్ద పెద్ద కంపెనీల కార్యాలయాల్లో వందల, వేల మంది పనిచేస్తూ ఉంటారు. అలాంటి చోట్ల పది మంది కలిస్తే ఒక కరోనా మరణమో, కరోనా కష్టమో నష్టమో మాట్లాడకతప్పని విషయమవుతోంది. దాంతో ఉద్యోగులు డీలా పడిపోతున్నారు. ప్రత్యేకించి కరోనాతో అయినవారిని కోల్పోయిన ఉద్యోగులను ఓదార్చడానికి కార్పొరేట్ కంపెనీలు ఓదార్పు నిపుణులను సంప్రదిస్తున్నాయి. ఎన్ టి పి సి, డాబర్, సియెట్, పే టీ ఎం, డెలాయిట్, హెచ్ సి ఎల్ లాంటి పెద్ద కంపెనీలు ఓదార్పు నిపుణులను తమ కార్యాలయాలకు పిలిపించి- ఉద్యోగులకు సాంత్వన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి, భయాలను తగ్గించడానికి శాస్త్రీయమయిన ప్రయత్నాలు చేస్తున్నాయి. బృందంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఓదార్పు నిపుణుల సేవలను ఏర్పాటు చేస్తున్నాయి. మంచిదే.

“అనిర్వేదః శ్రియో మూలమనిర్వేదః పరం సుఖమ్; అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః”

నిర్వేదం లేకపోవడమే సర్వ సంపదలకు మూలం. నిర్వేదం లేకపోవడమే సర్వసుఖాలకూ కారణం. నిర్వేదం లేకపోవడమే సమస్త కార్య విజయసాధనకు మూలం.

వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుడు ఎంత వెతికినా సీతమ్మ కనపడకపోవడంతో మొదట నిర్వేదానికి లోనై, వెంటనే తనను తాను ఓదార్చుకుని, తనకు తాను ధైర్యం చెప్పుకుని- మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో సీతాన్వేషణకు బయలుదేరే ముందు అన్న మాటలివి. మనం హనుమంతుడిని పూజిస్తాం. కానీ- హనుమ ఏమి చెప్పాడో వినం. ఇప్పుడు మానసిక ధైర్యమే శ్రీరామ రక్ష.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్