Wednesday, April 2, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకండిటెక్టివ్ మేనమామలు

డిటెక్టివ్ మేనమామలు

సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. సరైన సంబంధం దొరకడం కష్టం. దొరికినది సరైన సంబంధం అవునో కాదో తేల్చుకోవడం మరో కష్టం.

ఇదివరకు పెళ్ళి చూపుల్లో అమ్మాయి గొంతు వినడానికి పాట పాడమనేవారు. కాలు వంకర లేదని రుజువు చేసుకోవడానికి నడవమనేవారు. వంట వచ్చో లేదో ఏదో ఒక రకంగా కనుక్కునేవారు. కుట్లు అల్లికల్లాంటివేమైనా వచ్చా? అని అడిగేవారు. ముగ్గులు వేయగలవా? కళ్ళాపి చల్లగలవా? అని అడిగిన కాలాలు కూడా ఉన్నాయి.

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

అబ్బాయికయితే జీతం, ఉద్యోగభద్రత, ఇతరేతర అలవాట్ల గురించి ఆరా తీసేవారు. సాధారణంగా నేను సిగరెట్టు తాగుతాను, సాయంత్రం మందు తాగుతాను, వారాంతాల్లో జూదమాడతాను- అని మెదడున్న ఏ పెళ్ళికొడుకూ తన అలవాట్లను ఓపెన్ గా చెప్పుకోడు. పెళ్ళికూతురి మేనమామ పెద్ద డిటెక్టివ్ అవతారమెత్తి పెళ్ళికొడుకు గతచరిత్రను కనుక్కునేవాడు.

ఇప్పుడు అంత శ్రమ పడాల్సిన పనిలేదు. చాపమీద కూర్చునే పెళ్ళి చూపుల కాలాలు పోయాయి. సమానత్వం అన్నిటా వచ్చింది కాబట్టి అవసరమైతే అబ్బాయే చాపమీద కూర్చుని తనకేవేవి వచ్చో, ఏవేవి రావో చెప్పుంటున్నాడు. చెప్పుకోవాలి కూడా. తప్పులేదు.

చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు అత్యంత పారదర్శకంగా వారి వారి అలవాట్లను సామాజిక మాధ్యమాల్లోనే పెట్టుకుంటున్నారు కాబట్టి మేనమామలు డిటెక్టివ్ అవతారం ఎత్తాల్సిన పనే లేదు. ఏయే వేళల్లో ఏయే బ్రాండ్లు పుచ్చుకుంటారో కూడా ఫోటోలు, వీడియోలతోపాటు అన్ని సాక్ష్యాలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి.

ఈమధ్య నా స్నేహితుడు ఒకాయన వాళ్ళబ్బాయికి నాకు తెలిసిన ఒక అమ్మాయి సంబంధం చూడమని అడిగాడు. దానికేమి భాగ్యం? అని సరే అన్నాను. కట్ చేస్తే…ఆ అమ్మాయి ఫేస్ బుక్కులో వారాంతాల్లో సంచరించే పబ్బుల్లో ఆనందించే వీడియోలను చూసి…అబ్బాయి జడుసుకుని…ప్రస్తుతానికి తనకు పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదన్నట్లుగా నాకు చెప్పీ చెప్పనట్లు ఏదో చెప్పాడు. ఆ అమ్మాయి పారదర్శక ఆధునిక జీవన విధానాన్ని అభినందించాలో! ఆ అబ్బాయి నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోమని అడగాలో! తెలియక నేను మౌనంగా ఉండిపోయాను.

పెళ్ళి సంబంధానికి ప్రాతిపదికలు, కొలమానాలు, చెక్ లిస్టులు మారిపోయాయి. పూర్వమెప్పుడో పడవల్లో ప్రయాణించే రోజుల ప్రమాణాలు పోయి…రాకెట్ యుగానికి తగినట్లు ఇప్పుడు కొత్త కొత్త ప్రమాణాలు వచ్చాయి. రావాలి కూడా.

మహారాష్ట్రలో ఒక ఊళ్ళో పెళ్ళిచూపుల పర్వం దిగ్విజయంగా పూర్తయ్యింది. దాదాపుగా పెళ్ళి సంబంధం ఖరారు కూడా అయ్యేదే. ఈలోపు అబ్బాయి సిబిల్ స్కోర్ చూడాల్సిందేనని అమ్మాయి మేనమామ పట్టుబట్టాడు. (బ్యాంకులు అప్పులివ్వడానికి ప్రాతిపదికగా తీసుకునే కొలమానాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్- సిబిల్- స్కోర్ అంటారు) అబ్బాయి నిలువెల్లా వణికిపోయాడు. అబ్బాయి అనుకున్నంతా జరిగింది. అమ్మాయి మేనమామ పరిశోధనలో పెళ్ళికొడుకుకు సిబిల్ స్కోర్ పరీక్షలో కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. దాంతో పెళ్ళిసంబంధం క్యాన్సిల్ అయ్యింది.

Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv

ఫలశ్రుతి:-
అబ్బాయిలూ! అమ్మాయిలూ!
ఐ ఐ టీ జె ఈ ఈ అడ్వాన్స్ సంగతి తరువాత. ముందు ఎంతో కొంత అడ్వాన్సులు తీసుకుని సిబిల్ స్కోర్ అడ్వాంటేజ్ పెంచుకోండి- పెళ్ళి కావాలనుకుంటే!
లేదా డిటెక్టివ్ మేనమామల్లేని సంబంధాలనైనా వెతుక్కోండి!
లేదా…పదిరూపాయలు అప్పయినా చేయలేనివారు రేపు పప్పు కూడు ఎలా తింటారన్న మేనమామల హృదయ వైశాల్యాన్ని, తపనను సహృదయంతో అర్థమైనా చేసుకోండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్