Massive Encounter On The Chhattisgarh Border :
ఛత్తీస్‌గడ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఈ రోజు వేకువ జామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ సరిహద్దుల్లోని కుంట ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపురంకు సమీపంలోని అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. చర్ల మండలానికి 25 కి.మీ. దూరంలో కుర్ణవల్లి – పెసర్లపాడు అటవీప్రాంతంలో 6 గం. నుంచి 7.30 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు, చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుకావటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, సుక్మా డీఆర్జీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు బస్తర్ పరిధి ఐజీ పి.సుందర్రాజ్ తెలిపారు. ఘటనా ప్రాంతంలో 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉన్నట్లు వెల్లడించారు.
Also Read : మావోల చెరలో మాజీ సర్పంచ్