దేశంలో కరోనా వైరస్ కేసులు మరోసారి భారీగా పెరిగాయి. ముందురోజు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా 40శాతం మేర పెరిగాయి. అంతకుముందు రోజు 30,549 కేసులు నమోదు కాగా.. తాజాగా 42 వేలకుపైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మృతుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. నిన్న 500కిపైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
తాజాగా 42,625 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.17 కోట్లకు చేరాయి. నిన్న 562 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,25,757 మంది మహమ్మారికి బలయ్యారు. ఇటీవల క్రియాశీల కేసులు మళ్లీ నాలుగు లక్షల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం 4,10,353 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతానికి పెరిగింది.
తాజాగా 36,668 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.09 కోట్లకు చేరగా.. ఆ రేటు 97.37 శాతంగా ఉంది. నిన్న 18,47,518 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 47 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అలాగే నిన్న 62.53లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 48 కోట్ల మార్కును దాటింది.