మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో 2024 ఎన్నికలను ఎదుర్కునేందుకు ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే తలపడుతున్నారు. ఇందిరాగాంధీ, బాగారెడ్డి, కెసిఆర్, అలే నరేంద్ర, విజయశాంతి తదితర మహామహులు ప్రాతినిధ్యం వహించిన స్థానంలో సరికొత్త ప్రత్యర్థులు తలపడుతున్నారు. బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్ బరిలో ఉన్నారు.
మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మెదక్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, పటాన్ చెరువు, సంగారెడ్డి, నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మెదక్ మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. మాజీ సిఎం కెసిఆర్, హరీష్ రావుల నియోజకవర్గాలు ఇందులోనే ఉన్నాయి. నియోజకవర్గంలో సుమారు 16 లక్షల ఓటర్లు ఉన్నారు.
మెదక్ స్థానంపై పూర్తిస్థాయిలో పట్టు ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరపున పార్టీ శ్రేణుల్ని సమన్వయము చేస్తున్నారు. 2004 నుంచి అభ్యర్థులు ఎవరైనా వరుసగా బీఆర్ఎస్ పార్టీనే జయకేతనం ఎగురవేస్తోంది. పార్టీకి పెట్టని కోటగా ఉన్న మెదక్ లో గులాబీ జెండా ఎగురవేసేందుకు హరీష్ రావు మంత్రాంగం నడిపిస్తున్నారు.
బిజెపి నుంచి పోటీ చేస్తున్న రఘునందన్ రావుకు నియోజకవర్గంలో విరివిగా పరిచయాలు ఉన్నాయి. న్యాయవాదిగా ఈ ప్రాంతంలో సుపరిచితుడైన రఘునందన్ రావు కమలం నేతలను కలుపుకొని ప్రచారంలో నిమగ్నం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఎండలు దండిగా ఉండటంతో ఉదయమే టిఫిన్ బైటక్ నిర్వహిస్తూ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు అధికార పార్టీ నేతల అండతో ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో ముదిరాజ్ కులం ఓట్లు అధికంగా ఉన్నాయని.. వాటిని కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ నీలం మధుకు టికెట్ ఇచ్చిందని వినికిడి. దానికి తోడు బిజెపి, బీఆర్ఎస్ అభ్యర్థులు అగ్రవర్ణాలు కావటం.. తమ అభ్యర్థి బిసి అయినందున కలసివస్తుందని మరో అంచనా.
మెదక్ సీటు తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రస్తుతం నీలం మధు గెలుపు కోసం ప్రచారంలో నిమగ్నం అయ్యారు. మెదక్ సీటు కోసం విజయశాంతి ప్రయత్నించినా ఆ తర్వాత ఆమె పేరు వినిపించలేదు. ప్రచారంలో కనిపించటం లేదు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు బలంగా ఉన్నా శాసనసభ ఎన్నికల్లో ఓటమితో కొంత నిరాశ ఆవరించింది. పార్టీ శ్రేణులతో పరిచయం లేని ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపిగా ఉన్నపుడు కార్యకర్తలతో కలివిడిగా ఉండేవారు. జిల్లా కలెక్టర్ గా చేసిన వెంకట్రామిరెడ్డి పట్ల ప్రజల్లో అంతగా సానుకూలత కనిపించటం లేదు.
మెదక్ లో ప్రధానంగా పోటీ బిజెపి- బీఆర్ఎస్ ల మధ్య కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2004 నుంచి ఎన్నికల సరళి పరిశీలిస్తే మెదక్ నుంచి బలహీనమైన అభ్యర్థులే కాంగ్రెస్ తరపున పోటీకి నిలబెడుతున్నారని చర్చ జరుగుతోంది. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి రెండో స్థానం దక్కటం గమనార్హం.
20 ఏళ్ళుగా మెదక్ ఖిల్లాపై ఎగురుతున్న గులాబీ జెండాను దించేసి కమలం జెండా ఎగురవేసేందుకు బిజెపి నేతలు వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డి నాన్ లోకల్ వ్యక్తి అని, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శలు గుప్పిస్తున్నారట. దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు.. మెదక్ లో ఎలా చెల్లుతాడో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు.
గతంలో ఆలె నరేంద్ర ఒకసారి బిజెపి నుంచి మరోసారి బీఆర్ఎస్ నుంచి ఎంపిగా గెలిచారు. నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, పటాన్ చెరువు నియోజకవర్గాల్లో బిజెపి క్యాడర్ బలంగా ఉంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉన్నా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలు కనుక ఓటర్లు కాంగ్రెస్, కమలం పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
-దేశవేని భాస్కర్