Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏది ప్రామాణిక భాష?

ఏది ప్రామాణిక భాష?

జర్నలిజం భాష భాషలో అంతర్భాగమే కానీ- ప్రామాణిక భాష పేరుతో దానికదిగా ఒక ప్రత్యేకమైన భాష కాదు. కాకూడదు. కాకపోతే క్యాజువల్ గా మాట్లాడే భాషకు, రాసే భాషకు కొంత తేడా ఉంటుంది. అద్భుతంగా మాట్లాడేవారు ఒక్క వాక్యం కూడా తప్పుల్లేకుండా రాయకపోవచ్చు. ప్రాణం లేచివచ్చేలా అద్భుతంగా రాసేవారు అంతే అద్భుతంగా మాట్లాడకపోవచ్చు. మాట్లాడే భాషలో వాక్య నిర్మాణం అడ్డ దిడ్డంగా ఉన్నా, కర్త కర్మ క్రియా పదాల అన్వయం తికమకగా ఉన్నా– సందర్భాన్ని బట్టి అర్థమయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మాటలే అవసరం లేకుండా ఊఁ …ఉహూఁ…అన్న నిఘంటువులకెక్కని శబ్దాలు కూడా భావ ప్రసారం చేయగలవు. కానీ రాసే భాషకు ఒక పద్ధతి, నిర్మాణం, శైలి, మొదటి నుండి చివరిదాకా చదివించే గుణం…ఇలా ఇంకా సవాలక్ష లక్షణాలుండాలి. అయితే ప్రామాణిక భాష పేరుతో మీడియా చాలాసార్లు కృతకభాషను సృష్టిస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుండవచ్చు.

మీడియా రచన కత్తిమీద సాము. అక్షరాలు కలిపి చదువుకునే అతి సాధారణ చదువరికీ అర్థం కావాలి. అదే రాత అసాధారణ పండితుడినీ మెప్పించాలి. మీడియా రచనలో హెడ్డింగ్ పెట్టడం ఒక విద్య. ఒక సృజనాత్మక కళ. నిరంతర సాధన.

సాధారణంగా తెలుగు సంపూర్ణ వాక్యం క్రియా పదంతో ముగుస్తుంది.
ఉదాహరణకు-
“ఎన్నికల ఫలితాలను ప్రకటించారు”.
“కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది”.
అన్న వాక్యాలు హెడ్డింగుగా ఉండాలంటే నామ్నీకరణం జరగాలి. హెడ్డింగులో సాధారణంగా క్రియాపదం ఉండకూడదు.
“ఎన్నికల ఫలితాల ప్రకటన”
“కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం”
అవుతాయి.

హెడ్డింగు ఆకర్షణీయంగా ఉండాలి. వార్త మొత్తాన్ని ప్రతిబింబించాలి. ప్రాసతో ఉండాలి. పాట, పద్యం, సామెత, పాపులర్ మాటతో ముడిపెట్టాలి. రెండు మూడు పదాలకు మించకుండా ఉండాలి. ఆసక్తి పుట్టించాలి. ఇలా హెడ్డింగుకు ఆదర్శాలు, నియమాలు చాలా ఉన్నాయి. పాటించేవారు పాటిస్తారు. లేనివారు లేదు.

తెలుగు పత్రికల్లో మంచి శీర్షికలు రావడంలేదు- అని అచ్చ తెలుగులో చెబితే- ఏ డ్రామా కంపెనీ భాష ఇది? అని అడిగేరోజులొచ్చాయి. ఈమధ్య పేపర్లలో మంచి హెడ్డింగులు కనపడ్డంలేదు అంటే టక్కున అందరికి అర్థమవుతుంది. మాతృభాషతోపాటు పితృ భాషకూడా తెలుగే అయిన నలుగురు ఎక్కడన్నా కలిస్తే పొరపాటునకూడా తెలుగులో మాట్లాడకూడదని మనకు ఎవరో పెట్టిన శాపం. అసలు ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదట తెలుగు ప్రస్తావనగా మనం గర్వంగా చెప్పుకునే సందర్భమే శాపానికి సంబంధించినది. శాపానికి గురయిన జాతుల లిస్టులో తెలుగువారుకూడా ఉన్నారు. కాబట్టి తెలుగువారు తెలుగులో మాట్లాడకపోవడం జాతిగా మనలోపం కాదని, ఎవరో ఎందుకో శపిస్తే మన భాషాభిమానం మట్టికొట్టుకుపోయిందనుకుంటే సమయానుకూలంగా ఉంటుంది. అయినా ప్రస్తుతం మన చర్చ మీడియాలో వార్తల హెడ్డింగుల మీద కాబట్టి శాపాలు, పాపాల సంగతి మళ్ళెప్పుడయినా చూద్దాం.

మీడియాలో హెడ్డింగులు అంటే ప్రధానంగా ప్రింట్ మీడియానే పరిగణనలోకి తీసుకోవాలి. మళ్లీ మళ్లీ చదవాలనిపించే, ఒక్కసారి చూడగానే జీవితాంతం గుర్తుండిపోయేలాంటి హెడ్డింగులు పెట్టగలిగిన జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు. కానీ, రకరకాల పరిమితులు, పాలసీలు, ఇష్టాయిష్టాల వల్ల హెడ్డింగులు పెట్టేవారి చేతులు కట్టే శారు. హెడ్డింగ్ చూడగానే వార్త చదవాలనిపించేంత ఆసక్తిగా, వార్త సారం మొత్తం హెడ్డింగులో ప్రతిబింబించేలా, కవితాత్మకంగా, యతి ప్రాసలతో, చమత్కారంగా, తీయతేనియల తెలుగును పిండినట్లుగా రాయగలిగిన సమర్థులు చాలా మంది ఉన్నారు. కానీ, వారికి ఆ స్వేచ్ఛ, సమయం ఇవ్వడంలేదు. అయినా –  ఇన్ని ఇబ్బందులు, పరిమితుల మధ్య ఇప్పటికీ అప్పుడప్పుడూ మెరుపులాంటి శీర్షికలు పెట్టగలిగినవారున్నందుకు సంతోషించాలి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్