Wednesday, April 2, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనూటికో...కోటికో ఒక్కరు

నూటికో…కోటికో ఒక్కరు

పురాణ ప్రవచనకారులు అనేక ఉదాహరణలు చెప్పక తప్పదు. అసలు కథ మన మనసుల్లో బలంగా నాటుకోవాలంటే ఎన్నెన్నో కథలతో చెప్పాల్సిందే. అలా అనాదిగా చెబుతున్న ఒకానొక గొప్ప కథ ఇది.

ఒక ఊళ్లో అనేక ప్రాకారాలతో పెద్ద గుడి. గుడికి వెళ్లే దారిలో వీధి పొడవునా అటు ఇటు భిక్షగాళ్లు అడుక్కుతింటూ ఉంటారు. రోజూ ఉదయాన్నే ఒక ఏనుగును గుడి ప్రధాన ద్వారం దగ్గరికి మావటివాడు తీసుకొచ్చే ముందు భిక్షగాళ్లందరూ లేచి…పక్కకు వెళతారు. ఏనుగుకు పూజ అయి వెనక్కు వెళ్లిపోయాక మళ్లీ ఎక్కడివాళ్లక్కడే కూర్చుంటూ ఉంటారు. ఇది రోజూ జరిగే అలవాటైన తంతే.

ఒకరోజు ఒక భిక్షగాడు లేచి సర్దుకునేలోపు ఏనుగు దగ్గరికి వచ్చేస్తోంది. ఎవరైనా డబ్బిస్తే పరచుకున్న గోనె సంచి కింద పెట్టుకోవడం భిక్షగాళ్ల అలవాటు. త్వరగా బయటపడాలన్న కంగారులో గోనె సంచిని గోడ మీద వేసి…భిక్షగాడు పక్కకు వచ్చాడు. అందులో ఇరుక్కున్న ఒక పావలా బిళ్ల గోడకు ఊడిన ఇటుకల మధ్యలో పడింది. ఆ ఇటుకల మధ్య ఉన్న కప్ప నోట్లో ఆ పావలా బిళ్ల పడింది. అదిప్పుడు కొత్తగా నోట్లో వచ్చి పడ్డ కలిమితో బలిసిన కప్ప అయ్యింది. వెంటనే వీధి మధ్యకు వచ్చి బెకబెక బదులు పకపక నవ్వుతూ నిలుచుంది.

మహా మహా భిక్షగాళ్లే లేచి వెళ్లిపోయారు. నువ్వు కూడా పక్కకు జరుగు. కావాలంటే ఏనుగు వెళ్లిపోయాక నడిరోడ్డుమీద నాలుగు కాళ్లతో నాట్యం చేద్దువు కానీ…అని మావటివాడు పెద్దమనసుతో కప్ప బాగుకోరి నయనా భయానా చెప్పి చూశాడు.

పో పోవోయ్!
నేనిప్పుడు ఇదివరకటి నిరుపేద కప్పను అనుకున్నావా? మా కప్పల జాతిలో ఎవరికీ ఎప్పటికీ దొరకని పావలా బిళ్ల తనంతట తానే వచ్చి నా నోట్లో పడింది…తొక్కలో ఏనుగయితే ఏంటి? నువ్వయితే ఏంటి? పెద్ద చెప్పొచ్చావ్! పో పో! పని చూసుకోపో! అని ధనమదంతో, నడమంత్రపు సిరి బలంతో బలంగా చెప్పింది. ఈలోపు ఏనుగు బలమైన కాలు కప్పమీద పడడం, కప్ప చావడం జరిగిపోయాయి. మళ్లీ పావలా బిళ్ల భిక్షగాడికే చేరింది.

నీతి ఏమిటయ్యా అంటే-
“ఎంతటి నోరులేని కప్పకయినా డబ్బు కళ్లజూడగానే నోరు లేస్తుంది. నడమంత్రపు సిరిలా డబ్బు, అధికారం, హోదా రాగానే ఎవరైనా పెద్దా చిన్నా మరచిపోతారు. తమ స్థాయి ఏమిటో తెలుసుకోలేరు. చివరికి కాలమనే ఏనుగు కాలుకింద ఈ కథలో కప్పలా పడి…నలిగి…నామరూపాలు లేకుండా పోతారు”- అని.

అధికార, పార్టీ పదవుల్లో ఉన్న ఆఫ్టరాల్ వార్డ్ మెంబర్ కు కూడా బస్సంత కారు, కొండొకచో కాన్వాయ్, కుడి ఎడమల బాడీ గార్డులు ఉండే కాలమిది. వైట్ అండ్ వైట్ కాటన్ డ్రస్ రాజకీయాలకు యూనిఫార్మ్ అని ఎవరూ నిర్ణయించకపోయినా, రాజ్యంగంలో ఎక్కడా రాయకపోయినా ఎందుకో ఒక విహిత ధర్మంగా పాటిస్తూ ఉంటారు. గుండీలు ఉన్నా ఎందుకో కొందరు పొట్టవరకు విప్పుకునే తిరుగుతూ ఉంటారు. కొందరికి పది వేళ్ళకు పన్నెండు ఉంగరాలు, మెడలో బంగారు పెద్ద గొలుసు వేలాడుతూ ఉంటుంది. “అన్న మాట్లాడతాడట” అని ఈ చెమ్చాకు ఇంకొక చెమ్చా ముందు ఫోన్ కలిపి అవతలివాడిని ఫోన్లో బాగా వెయిట్ చేయించి తరువాత అన్నకు ఫోన్ ఇస్తుంటాడు. ఈ అన్న కారు కదిలితే సైరన్ ఎందుకు మోగుతుందో ఎవరికీ తెలియదు. అన్న టోల్ గేట్లో టోల్ ఎందుకు కట్టడో ఎవరికీ అంతుపట్టదు. అన్నకు ఎందరు ఆగర్భ శత్రువులు ఉండి ప్రభుత్వ ఖర్చుతో అంతమంది సాయుధ రక్షకులు కవచంలా ఉంటారో అర్థం కాదు. అన్న అన్నం తింటే పూటకు మహా అయితే వెయ్యి రూపాయలు ఖర్చు కావాలి. కానీ అన్న డ్రయివర్ మొదలు అందరూ తినాలి కాబట్టి ప్రోటోకాల్ శాఖకు పూటకు లక్ష ఖర్చు వస్తూ ఉంటుంది.

అన్న, అన్న ఫ్యామిలీ తిరుమలకు వెళితే వెంకన్న నిలువెల్లా వణికిపోయి ఎల్ వన్ తొలి దర్శనమివ్వాలి. అన్న రైలెక్కితే మిగతా ప్రయాణికులకు నరకం కనపడాలి. అన్న విమానం ఎక్కితే మిగతా ప్రయాణికుల మానం పోవాలి. అన్న రోడ్డెక్కితే మిగతా వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోవాలి.

అన్న పుట్టినరోజు అయితే…ఊళ్ళో పెళ్ళయితే ఎవరికో హడావుడి అయినట్లు ఊరు ఊరంతా ఫ్లెక్సీలు లేవాలి. బాజాలు మోగాలి. పటాకులు కాల్చాలి. కార్యకర్తలు రక్తదానాలు చేయాలి. అన్న మెడలో గజమాలలు వేయాలి. పత్రికల్లో అన్న కీర్తనలతో ప్రకటనలు ఇవ్వాలి. అన్న ఆసుపత్రికి వెళితే రోగుల గుండెలు ఆగాలి. అన్న పెళ్ళికి వెళితే పందిట్లో తొక్కిసలాట జరగాలి. అన్న విదేశం వెళ్ళొస్తే ఎయిర్ పోర్ట్ లో స్వాగత సత్కారాలు ధూమ్ ధామ్ గా జరగాలి. అన్న భార్య, అన్న పిల్లలక్కూడా ప్రభుత్వ తుపాకులు తోడు వెళ్ళాలి. అన్నకు సొంతంగా పదిళ్లు, ఇరవై కార్లు ఉన్నా ప్రభుత్వానివే వాడుకోవాలి.

(“అన్న” అని ఉన్న ప్రతిచోట మీ అనుభవాన్ని, పరిశీలనను బట్టి “అక్క” అని కూడా పెట్టుకుని పెద్ద మనసుతో అన్వయించుకోగలరు. వారేమీ చిన్నబుచ్చుకోరు!)

అలాంటిది-
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల కొత్త ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏమిటి ఇంత సింపుల్ గా ఉన్నారు?
ఇంత నిరాడంబరంగా ఉన్నారు?
పార్టీ బాధ్యురాలిగా తొలిసారి హైదరాబాద్ కు విమానంలో కాకుండా రైల్లో వచ్చారు?
తన బ్యాగ్ తనే భుజాన వేసుకుని…ఇదివరకటివాళ్ళు దిగినట్లు ఏడు నక్షత్రాల హోటళ్ళలో కాకుండా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో దిగారు?
బొకేలు వద్దన్నారు?
శాలువలు వద్దన్నారు?
ఫ్లెక్సీలు కట్టదన్నారు?
కాన్వాయ్ లు రావద్దన్నారు?
రోడ్డు దాటి గాంధీ భవన్ కు ఆటోలో వెళ్ళబోయారు?

సమకాలీన రాజకీయాల్లో చాలా అరుదైన విషయమిది. ఏ రంగంలో వారైనా ఆదర్శంగా తీసుకుని…అనుసరించదగ్గ విషయమిది. ఆమె నిరాడంబరతను చూసి పట్టుమని పదిమంది రాజకీయనాయకులు ఫాలో అయినా చాలు- ప్రత్యేకించి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.

కొస బాధ:-
“కథలో నడమంత్రపు కప్పకు గర్వభంగమయ్యింది కానీ…వాస్తవంలో ప్రస్తుత రాజకీయ నడమంత్రపు సిరులకు, డాబుకు, దర్పానికి గర్వభంగమయ్యే కాలమా ఇది?”- అని సామాన్యుల నిరాశ. నిట్టూర్పు. నిస్పృహ. నైరాశ్యం. నిర్వేదం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్