మనసు శరీరంలో ఒక అవయవం కాదు. ఎద భాగంలో మనసు ఉన్నట్లు అనుకుంటారు కానీ…మానసిక శాస్త్రం మనసుకు మెదడే ఆధారం అని శాస్త్రీయంగా నిరూపించింది. మెదడులో ఆలోచనలు స్పందనగా గుండె లయలో మార్పులు తెస్తుంది కాబట్టి గుండెలో మనసు ఉందని అనుకుని ఉంటారు. గుండెకు మనసు ఉంది కానీ…గుండెలో మనసు లేదు. ఇంతకంటే లోతుగా వెళితే ఇది వైద్యశాస్త్ర పాఠం అవుతుంది.
కళ్లు చెవులు ఇతర ఇంద్రియాలు ఇచ్చిన ఇన్ పుట్స్ ను మెదడు భద్రపరుచుకుంటుంది. ఆ ఇన్ పుట్స్ ను వాడేప్పుడు మన బుద్ధి పని చేస్తుంది. బుద్ధి కూడా మనసు కాదు. కంప్యూటర్ లో ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ లాంటిది మనసు. మెదడు నుండి ప్రసారమయ్యే ఆలోచనల్లోనే మనసు ఉంటుంది.
ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ను ఒకరు తయారు చేసి ఇన్స్టాల్ చేయాలి. మన మనసు సాఫ్ట్ వేర్ ను మనమే తయారు చేసుకుంటాం. ఇష్టాయిష్టాలు, ప్రేమ – ద్వేషం ; కోపతాపాలను మనమే లోపలికి వేసి వాటిని పెంచి పోషించుకుంటూ ఉంటాం.
మనం తీసుకునే ఆహారంలో పదహారో వంతు భాగం మనసుకు వెళుతుందంటారు. అంటే అవయవమే కాని మనసుకు ఆహారం ఎందుకు ? అన్న సందేహం రావచ్చు. ఫ్యాన్ ఉంది – కరెంట్ ఉంటేనే తిరుగుతుంది. కార్ ఉంది – పెట్రోల్ , డీజిల్ పోస్తేనే కదులుతుంది. అలాగే ప్రాణం ఉంది. కానీ ఆ ప్రాణానికి ఉన్న చైతన్య స్వభావం ఏర్పడడానికి, ఆ స్వభావం ఆరోగ్యంగా ఉండడానికి మనసుకు చక్కటి ఆలోచనలు ఆహారంగా వెళ్లాలి.
“మనసులోని మర్మమును తెలుసుకో!”
అని త్యాగయ్య పిలుపు భక్తి-వేదాంతాలకు సంబంధించినదే అయినా….లౌకిక అర్థంలో కూడా అన్వయించుకుని మనసును, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరముంది.
మానసిక ఆరోగ్యం మీద ఇన్నాళ్ళకు భారతీయులకు శ్రద్ధ పెరిగింది. దాంతో మెంటల్ హెల్త్ వ్యాపారం మీద పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. మానసిక వైద్యం కోసం సైకియాట్రిస్టులు, కౌన్సిలింగ్ కోసం సైకాలజిస్ట్ ల దగ్గరికెళుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెంటల్ హెల్త్, వెల్ నెస్ సెంటర్లకు డిమాండు పెరుగుతోంది. హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలు కూడా మెంటల్ హెల్త్ రంగం మీద దృష్టి పెట్టాయి. తెలంగాణాలో అన్ని ఆసుపత్రుల్లో సైకాలజిస్టుల సేవలు అందుబాటులో ఉండేలా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ప్రయత్నిస్తోంది.
ఇన్నాళ్లూ శరీరం మీద మనసు పెట్టారు. ఇప్పుడు మనసుమీద కొంచెం మనసు పెడుతున్నారు. మంచిదే. లేకుంటే మనసు మనసులో ఉండని మానసిక సమస్యలతో సతమతమవుతారు.
కొస మరక:-
కౌన్సిలింగ్ కోసం లెక్కలేనన్ని యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. యాపుల ద్వారా అయినా, ప్రత్యక్షంగా కౌన్సిలర్ల దగ్గరికైనా వస్తున్న కేసుల్లో అత్యధిక భాగం వైవాహిక సమస్యలు, ప్రేమలు- రిలేషన్షిప్ సమస్యలే ఉంటున్నాయట.
“మనోరోగానికి మందు లేదు” అని సామెత. ఇప్పుడు దాన్ని “మనోరోగానికి మందు ఉంది” అని మార్చుకోవాలి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు