Monday, January 27, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశిథిలాలనుండి శిఖరాలకు- 2

శిథిలాలనుండి శిఖరాలకు- 2

“ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారుచేస్తాయి” అని అంటారు జర్మనికి చెందిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ కాని “ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులకు తానిచ్చే ప్రతిస్పందనలే తయారుచేస్తాయి” అని నా అనుభవాల ద్వారా, నా జీవితంతో చేసిన ప్రయోగాల ద్వారా తెలుసుకున్న సత్యం. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులకు, ఎదుర్కునే సంఘటనలకు వేర్వేరు ప్రతిస్పందనలు ఇస్తే, వేర్వేరు ఫలితాలు కలుగుతాయి. మనం ఎటువంటి ఫలితాలను ఆశిస్తామో అందుకు తగిన విధంగా స్పందించడం ద్వారా జీవితాన్ని కోరుకున్న విధంగా మలచుకోవచ్చు. అయితే ఒకవ్యక్తి తన చుట్టూ ఉన్న పరిస్థితులకు, ఎదుర్కునే సంఘటనలకు ఇచ్చే ప్రతిస్పందనలు, ఆ వ్యక్తి ఆలోచనా సరళి మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషికి జీవితం పట్ల ఒక దృక్పథాన్ని ఏర్పరిచి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దేది, జీవన గమనాన్ని నిర్దేశించి జీవితాన్ని తీర్చిదిద్దేది ఆలోచనలే. ఒకరి జీవితం సమాజం నిర్దేశించిన ప్రమాణాల మేరకు విజయవంతమైనా లేదా పతనమైనా అది ఆ వ్యక్తి తన ఆలోచనలను అమలు చేసి వాటి ద్వారా పొందిన ఫలితమే. అందువల్ల జీవితంలో జయాపజయాలకు, ఉత్థాన పతనాలకు, పేదరికానికి లేదా సిరిసంపదలతో తులతూగడానికి ఇలా అన్నింటికీ ఆ వ్యక్తి ఆలోచనలే మూలమవుతాయని చెప్పవచ్చు. “మీరు ఏమి ఆలోచిస్తారో అదే అవుతారు. కాబట్టి మీరు ఏమి ఆలోచిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి” అని అంటారు స్వామీ వివేకానంద. మనుషులు పుట్టిన దేశాలు, అక్కడి వాతావరణం, వారి పూర్వీకులను బట్టి రూపు రేఖలు, ఎత్తు, రంగు, శరీర సౌష్టవం వంటి వాటిలో కొద్దిపాటి తేడాలున్నప్పటికీ మనుషులందరి శరీరాలు, అవి నిర్వర్తించే విధులు ఒకేలా ఉంటాయి. కానీ విభిన్నంగా ఉండేవి మన ఆలోచనా పద్ధతులు మాత్రమే. ఆలోచనలకి రూపం ఉండదు కాని జీవితాన్ని రూపుదిద్దేవి ఆలోచనలే.

నా తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులే. నాన్న లారీ డ్రైవర్, అమ్మ వ్యవసాయ కూలీ. వీరి నలుగురి సంతానంలో మొదటి వాడిగా, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో చదువుకుంటూ, పదవ తరగతి పరీక్షలో ఫెయిల్ అయితే ఒక లారీ డ్రైవర్ గానో, ఒక దుకాణంలో సేల్స్ బాయ్ గానో లేదా ఏదైనా ఒక పరిశ్రమలో కార్మికుడుగానో మిగిలిపోవాల్సిన నేను, భిన్నంగా ఆలోచించడం వలనే ఈరోజున ఒక ఎంట్రప్రెన్యూర్ గా మారాను. నేను పుట్టిన నేపథ్యం, పెరిగిన వాతావరణానికి భిన్నంగా అభివృద్ధి చెందడంలో నా శ్రమకన్నా… నా ఆలోచనా విధానానిదే ప్రధాన పాత్ర.

ప్రపంచంలో అనేక కోట్లమంది పేదరికంలో పుట్టి, పేదలుగానే జీవించి, పేదలుగానే మరణిస్తున్నారు. ఆ కోట్ల మంది పేదల్లో నేను ఒకడిగా పుట్టాను. ఆ తర్వాత నేను పెరిగిన వాతావరణం, బాల్యంలో నా అనుభవాలు, చదివిన పుస్తకాలు, కలిసిన మనుషుల ద్వారా నేను తెలుసుకున్న విషయాలు, అనుభవించిన పరిస్థితుల నుంచి నాకు అలవడిన ఆలోచనా సరళి, వాటి ద్వారా అలవరచుకున్న జీవన విధానం, జీవితం పట్ల నా వైఖరి, డబ్బు సంపాదించడం గురించి, జీవితంలో ఆర్థికంగా అభివృద్ధి సాధించడం గురించి నేను నేర్చుకున్న విషయాలన్నింటినీ సామాన్యుల ఆర్ధిక పాఠశాల (School of Financial Education for Commoners) అనే సీరీస్ లో మొదటి పుస్తకంగా “ఆలోచన మారితే జీవితం మారుతుంది” అనే ఈ పుస్తక రూపంలో మీ ముందుకు తెస్తున్నాను. నిజానికి నేను ఈ పుస్తకాన్ని ఇంకొంత కాలం తర్వాత రాయాలి అనుకున్నప్పటికీ, కోవిడ్-19 ద్వారా ఏర్పడిన అనిశ్చిత సామాజిక పరిస్థితుల దృష్ట్యా, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువమందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడే పూర్తి చేశాను.

ప్రాథమికంగా నా స్వీయ అనుభవాల సారంశమైన ఈ పుస్తకం నేను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న సమస్యలు వాటికి పరిష్కారాలు, పైకి కనబడని సమాజ తీరుతెన్నులు, జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన విజయ సూత్రాలు వంటివి వివరిస్తూ ‘ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఎలా చేయాలి’ అనే పద్ధతులను వివరిస్తూ సాగే దిక్సూచి వంటిది. ఈ పుస్తకం ద్వారా మీరు జీవితం పట్ల సానుకూల దృక్పథం, ఆలోచనలో స్పష్టత, కఠిన పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకునే నేర్పు, అడ్డంకులను అధిగమించే మానసిక దృఢత్వం, ఆలోచనా విధానం మార్చుకుని పరిణతి సాధించడం వంటి ఉపయుక్తమైన విషయాలను తెలుసుకుంటారు. తద్వారా జీవితంలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రణాళికా రచన, విశ్లేషణా సామర్థ్యం, భవిష్యత్తును అంచనా వేయగల శక్తి మెరుగుపడి జీవితంలో ఆర్థిక స్వేచ్ఛను, డబ్బుతో కొలవలేని ఆత్మ బలాన్ని పొందుతారు. ఈ పుస్తకం ఎందరో విజేతల స్వానుభావాల ఆధారంగా నేను నేర్చుకున్న మెలకువలను మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం.

నాలుగు దశాబ్దాల నా జీవిత అనుభవాలు, నేను నేర్చుకున్న జీవిత పాఠాలు, స్కూళ్లు కాలేజీలలో నేర్పని ఆర్థిక అక్షరాస్యతను, జీవన సాఫల్య సూత్రాలు, వివిధ శాస్త్రాల ద్వారా పెంపొందించుకున్న నా ప్రాపంచిక జ్ఞానాన్నంత అందరి మంచి కోరి రాస్తున్నాను. ఈ పుస్తకం ద్వారా నేను నేరుగా మీతో మాట్లాడుతాను. నా రాతలు మీలో కొందరిని మోటివేట్ చేయవచ్చు, కొందరిని భావోద్వేగానికి గురిచేయవచ్చు, కొందరి మనసును కలత పరచవచ్చు, కొందరికి కోపం తెప్పించవచ్చు, కొన్ని వివాదాస్పదం కూడా అవ్వొచ్చు. కాని తమ ఆలోచనలను మార్చుకుని జీవితంలో పురోగతి సాధించడానికి సిద్ధంగా ఉన్నవారందరికీ ఈ పుస్తకం జీవితం పట్ల సానుకూల దృక్పథం కల్పించడంలో దోహద పడుతుందని, డబ్బును సంపాదించాలని, ఐశ్వర్యంతో పాటు అంతకన్నా విలువైన ఆరోగ్యంతో ఆనందంగా జీవితం గడపాలి అనుకునే వారికి ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

-నాగరాజు మున్నూరు
99489 35484

(“ఆలోచన మారితే జీవితం మారుతుంది” పుస్తకానికి రచయిత పరిచయ వాక్యాలివి. ఏ నేపథ్యంలో ఏమి ఆశించి రచయిత ఈ పుస్తకం రాశాడో తెలియడానికి ఆ మాటలు యథాతథంగా. రేపటి నుండి అందులో ఎవరైనా నేర్చుకోదగ్గ పాఠాలు కొన్ని వరుసగా)

రేపు:-
శిథిలాలనుండి శిఖరాలకు- 3
“చిన్న వయసుకే ఎన్నెన్ని గాయాలో?”

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

న్యూస్