సుడాన్ లో మిలిటరీ తిరుగుబాటు మొదలైంది. రాజధాని ఖార్తూమ్ లో దేశ ప్రధానమంత్రి అబ్దల్లః హందోక్ ని సోమవారం గృహనిర్భందం చేసిన మిలిటరీ బలగాలు నలుగురు మంత్రుల్ని అరెస్టు చేశారు. దేశమంతటా మిలిటరీ అనుకూల వర్గాలు – ప్రజాస్వామ్యవాదుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఖార్తూమ్ కు వచ్చే అన్ని రహదారులని మిలిటరీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఖార్తూమ్, ఓండుర్మన్, న్యాల, ఎడ్ ద్యుఐమ్ సహా వివిధ నగరాల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని ప్రజలు ప్రదర్శనలు చేస్తున్నారు.
దేశ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ 30 ఏళ్ల అరాచక పాలన అంతమొందించినపుడు ప్రజలు మిలిటరీని అభినందించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, దిగజారిన జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని ఆశపడ్డా అల్ బషీర్ గద్దె దిగాక మిలిటరీ ఏలుబడిలో ఉన్న సుడాన్ లో రాజకీయ అస్థిరత నెలకొంది. ఏడాదిపాటు పాలన చక్కదిద్ది ఎన్నికలు నిర్వహించి పౌర ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తామని మాట ఇచ్చిన మిలిటరీ ఆ దిశగా ఏనాడు చర్యలు చేపట్టలేదు. 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడు మిలిటరీ తిరుగుబాటు చేయటం సుడానీలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జనరల్ అబ్దేల్ ఫత్తః అల్ బుర్హాన్ ఆగడాలు పెరిగాయని ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మిలిటరీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించటంతో పాటు కాల్పులు కూడా జరిపారని స్పుత్నిక్, అరబ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రధానమంత్రితో సహా ఇతర బందీల్ని వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి కోరింది. లేదంటే సుడాన్ మిలిటరీ ప్రభుత్వంపై ఆంక్షలు విధించాల్సి వస్తుందని యుఎన్ హెచ్చరించింది.