Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఉద్యోగమో రామచంద్రా!

ఉద్యోగమో రామచంద్రా!

శంకరమంచి సత్యం అమరావతి కథల్లో పాత్రలన్నీ మన మధ్య రోజూ తిరిగేవే. ఆ పాత్రల చేత ఆయన చెప్పించే తాత్వికత మనల్ను ఆలోచింపచేస్తుంది. సమాధానాలు చెప్పండని ప్రశ్నిస్తుంది. గొప్ప గొప్ప ఆదర్శాల మాటున దాగిన నీలి నీడలను పట్టిస్తుంది.

“ఎవరా పోయేది?” అన్నది అమరావతి కథల్లో ఒక కథ. ఒక సంసారి ఏ పనీ చేయడు. ఒళ్లు ఒంచి పనిచేసే రకం కాదు. మాయమాటలు చెప్పి జనం మీద పడి బతకడం అలవాటు చేసుకుంటాడు. భార్య, పిల్లల అవసరాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో…ఒక శుభ ముహూర్తాన సన్యాసి వేషం వేస్తాడు. ఊరి గుడి మెట్లమీద ముందు వరుసలో కూర్చుంటాడు. మెట్లమీద మిగతావారు అడుక్కు తినే భిక్షగాళ్లు. ఇతడు మాత్రం జ్ఞానిగా సుఖాలను పరిత్యజించిన సన్యాసిగా ఫోజు కొడుతూ ఉంటాడు. లోకం నమ్మడంతో బొట్టు పెద్దది చేసి, ఇంకో రెండు రుద్రాక్ష మాలలు మెడలో పెంచాడు.

గుడిలోకి వెళ్లి బయటికి వచ్చే భక్తులెవరయినా అతడి బొచ్చెలో భిక్ష వేయకపోతే…

ఎవరా పోయేది? అని గడ్డం దువ్వుకుంటూ వారెవరో తెలియనట్లుగా నటిస్తాడు. మొన్ననే వరి కోతల్లో ఊరు ఊరంతా ధాన్యంతో నిండింది…పిల్లా పాపలతో హాయిగా ఉన్నా…గింజ విదల్చరు…పాపం గాక పుణ్యమెలా వస్తుంది? అని ఇరికిస్తాడు. ఆ వెళ్లబోయినవాడు వెనక్కు వచ్చి…దానం చేసి వెళతాడు. ఎప్పుడయినా ఒక రోజు ఎంతసేపయినా భిక్ష దొరక్కపోతే…ఆ రోజు దొరికిన ఒకడికే లిస్ట్ చెప్పి…ఒక అర మూట బియ్యం, ఉప్పు, పప్పు, నూనె, కూరలు ఇంటికి పంపు అని ఆదేశించే స్థాయికి సన్యాసి కాలక్రమంలో ఎదుగుతాడు.

పూర్వాశ్రమంలో సంసారిని గుర్తించని భార్యా పిల్లలు…సన్యాసి అయ్యాక ఆర్జన పెరగడంతో చక్కటి సంసారిగా గుర్తించి గౌరవిస్తారు. ఇలా సన్యాసి సంసారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుండగా మాంద్యం మొదలవుతుంది.

ఒక మధ్యాహ్నం వేళ సన్యాసి ఎర్రటి ఎండకు నీరసించిపోతాడు. మూడు గంటలు దాటినా ఎవరూ ఏమీ దానం చేయలేదు. తినడానికి ఒక పండయినా దొరకలేదు. ఇక లాభం లేదు…ఇంటికెళ్లి భోంచేయకపోతే స్పృహ తప్పేలా ఉంది అనుకుని కాళ్లీడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు. నేరుగా వంటింట్లోకి వెళితే గిన్నెలన్నీ ఖాళీ. భార్యా పిల్లలు ఎప్పటిలా మధ్యాహ్నం భోంచేసి కునుకు తీస్తున్నారు. అన్నమో రామచంద్రా! అని అరుస్తాడు. ఏమిటండీ ఈ విడ్డూరం? ఎప్పుడు లేనిది…మూడు గంటలప్పుడు వచ్చి అన్నం అన్నం అని అడుక్కుంటున్నారు. మాకు ఓపిక లేదు. వండుకుని తినండి అని భార్య సగౌరవంగా స్పష్టంగా చెబుతుంది.

ఛీ…
వీళ్లకోసమా ఇన్నేళ్లుగా నేను లోకాన్ని వంచిస్తున్నది? అని ఉత్తరీయం దులుపుకుని…నిజంగా హిమాలయాలకు వెళ్లిపోతాడు. ఇక రాడు. హిమాలయాల్లో ఎవరా పోయేది? అని ఎవరినీ అడగాల్సిన అవసరం సన్యాసికి రాలేదు. కథ సమాప్తం.

భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు భిక్షగా ప్రసాదించమని శంకరాచార్యులు భగవంతుడిని వేడుకుంటాడు. లేదా మనల్ను అలా ప్రార్థించాలని జగద్గురువుగా ఆదేశించాడు.

వైరాగ్యాలను మన సనాతన ధర్మం శాస్త్రీయంగా విభజించి, విశ్లేషించింది. ఆ వివరాలు ఇక్కడ అనవసరం. ఆ లిస్టులో లేని వైరాగ్యం ఒకటి కరోనా దయతో కొత్తగా చేరింది. అది- ఉద్యోగ వైరాగ్యం. జ్ఞానం ఒక క్రమ పద్ధతిలో అంచెలంచెలుగా కలుగుతుంది. వైరాగ్యం ఒక్క క్షణంలో కలుగుతుంది. ఆ క్షణం ఎవరికి ఎప్పుడు అన్నది ఎవరూ చెప్పలేరు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలిగించిన వైరాగ్యాలు లెక్క లేనన్ని. అందులో ఉద్యోగ వైరాగ్యం ఒకటి. అమెరికా, యూరోప్ దేశాల్లో “ది గ్రేట్ రిజిగ్నేషన్” మొదలయ్యింది. అంటే లక్షల, కోట్ల మంది ప్రయివేటు ఉద్యోగులు మనసు విరిగి తమ ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే ఈ సంఖ్య ఇప్పటికి 43 లక్షలు దాటింది. మిగతా దేశాల రాజీనామాలను కలుపుకుంటే సంఖ్య కోట్లలోకి వెళుతోంది.

కారణాలు:

  1. ఉద్యోగం శాశ్వతం కాదని అవగాహన కలగడం.
  2. కుటుంబం విలువ తెలిసిరావడం.
  3. రోగాలబారిన పడే నైట్ డ్యూటీలు, ప్రమాదకర ఉద్యోగాల కంటే మెరుగయిన ఉద్యోగాలు వెతుక్కోవడం.
  4. ఒక పెను సంక్షోభం వచ్చినప్పుడు తమ కంపెనీ అండగా నిలబడదు అని ఆత్మ జ్ఞానం కలగడం.
  5. ఎంత ఆరోగ్యవంతులయినా ప్రకృతి ముందు తలవంచాల్సిందే అని ఎరుక కలగడం.
  6. ఆరోగ్య బీమా క్లైముల్లో ఇబ్బందులు, మోసాలు లాంటి ఇతరేతర మరికొన్ని కారణాలు.

జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షామ్ దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ! అని శంకరాచార్యుల ప్రార్థన. వైరాగ్యం భిక్ష పెట్టు తల్లీ! అని అన్నపూర్ణా దేవిని ప్రార్థించడంలో లాజిక్ ఏమిటి? అని కొంతమందికి సందేహం ఉండేది. ఆరోగ్యంగా నిలబడడానికి అన్నం కావాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైరాగ్యం కూడా కలగాలి అన్నది ఇందులో లాజిక్. కాటికి కాళ్లు చాచిన వేళ వైరాగ్యం కలిగినా ఒకటే…కలగకపోయినా ఒకటే.

ఇంతకూ-

మనసు విరిగి వైరాగ్యంతో రాజీనామాలు చేస్తున్న ఇన్ని కోట్ల మంది ఉద్యోగులకు మళ్లీ తగిన ఉద్యోగాలు దొరకాలని ఏ శంకరాచార్యుడు ఉద్యోగ భిక్షా స్తోత్రం రాయాలి?

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్