కులాల మధ్య వత్యసాలు చూపకుండా బీసీలోని అన్ని కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బెస్త కార్పొరేషన్ సమావేశంలో చెల్లుబోయిన పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకం రెడ్డి నారాయణ మూర్తి, బెస్త కార్పొరేషన్ చైర్మన్ టి.సుధారాణి, డైరెక్టర్లు, రాష్ట్ర బెస్త సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చెల్లుబోయిన మత్లాదుతూ మత్స్యకారులను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారని, వారిలో ఎవరికీ అన్యాయం జరగకుండా వారి ప్రాంతాల్లో పిలుస్తోన్న పేర్ల ఆధారంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. కులం పేరు కూడా చెప్పుకోవడానికి భయపడే కులాలను గుర్తించి, పార్టీ ఆఫీస్ లో సమావేశాలు నిర్వహించి భరోసా కల్పించిన పార్టీ వైసిపి పార్టీ అని చెల్లుబోయిన చెప్పారు.
వైసిపి ప్రభుత్వం రాకముందు బలహీనవర్గాలు రాష్ట్రంలో బలహీనంగానే ఉన్నాయని, ఎన్నికలకు ముందు బలహీనవర్గాల వెనుకబాటుతనంపై బీసీల అధ్యయన కమిటీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని అయన గుర్తు చేశారు. ఆ అధ్యయన కమిటీ ద్వారా సుమారు సంవత్సరం పాటు బీసీల వెనుకబాటుతనానికి గల కారణాలను జగన్మోహన్ రెడ్డి అన్వేషించారన్నారు. బీసీలు సామజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా చేయూత అందించడమే సియం జగన్ ఆశయమని మంత్రి పేర్కొన్నారు.