హైదరాబాద్ నగరం మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ మరియు ఎయిర్పోర్ట్ మెట్రో వ్యవస్థపైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు మెట్రో రైల్ భవన్ లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారితో పాటు పలువురు శాఖధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతకంతకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారిడార్లలో మరిన్ని అదనపు కోచ్ లని పెంచాలని సూచించారు. మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ పైన దృష్టి సారించి మరిన్ని ఫీడర్ సర్వీస్ లను ప్రారంభిస్తే ప్రస్తుతం ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.
ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ వే పైన ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పలు ఆదేశాలను జారీ చేశారు. జిఎంఆర్ ఆధ్వర్యంలోని ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు వెంటనే 48 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో కోసం కేటాయించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన భూమిని వెంటనే మెట్రో వర్గాలకి అందించాలన్నారు. మెట్రో విస్తరణ ప్రణాళికల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంత్రి కేటీఆర్ కోరారు. లకిడికపూల్ నుంచి బిహెచ్ఇఎల్, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకి విస్తరించాలనుకుంటున్న మెట్రో మార్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయల అంచనా వ్యయంలో కొంత ఆర్థిక సహాయాన్ని ఇప్పటికే అడిగామని తెలిపారు.
మెట్రో లైన్ ని భారీగా విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాలలో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక రిపోర్టులను, తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టలను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ విస్తరణలో భాగంగా మెట్రో స్టేషన్లతో పాటు భారీ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ జాగాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాలకు చెందిన కలెక్టర్లను ఆదేశించారు.
ఈ సమావేశం అనంతరం ఎమ్ఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్ కి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను చేపట్టామని త్వరలోనే కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు మెట్రో అధికారులు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నుమా వరకు ఉన్న ప్రస్తుత ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ను శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులకు సూచించారు.