Last rituals: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని గౌతమ్ రెడ్డికి కడసారి నివాళులర్పించారు.
ఉదయగిరిలో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ (మెరిట్స్) కాలేజీ ఆవరణలో జరిగిన ఈ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, మేకపాటి కుటుంబ బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.
అంతకుముందు నెల్లూరు నగరంలోని అయన స్వగృహం నుంచి నుండి ఉదయగిరి వరకూ వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాలతో మేకపాటి గౌతం రెడ్డి అంతిమ యాత్ర జరిగింది.
ప్రత్యేక అంబులెన్స్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహం తో పాటు ఆయన తల్లి మణి మంజరి, భార్య శ్రీకీర్తి, కుమారుడు అర్జున్ రెడ్డి, కుమార్తె అనన్య రెడ్డి లు ప్రయాణిస్తుండగా వందలాది వాహనాలు కాన్వాయ్ వెంట ఉదయగిరి వరకూ అనుసరించాయి.
అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్,పేర్ని నాని, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలుపాల్గొన్నారు.
అంతిమ యాత్ర నెల్లూరు నుండి జొన్నవాడ, బుచ్చిరెడ్డి పాలెం, సంగం, నెల్లూరు పాలెంమీదుగా ఉదయగిరి చేరుకుంది.