వీరమరణం అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో అస్త్ర సన్యాసం చేసి, పోరాటం చేతగాక మాట్లాడినట్లు ఉందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. మీరు నన్ను గెలిపిస్తారా అంటూ అభిమానులను అడగడం విచిత్రంగా ఉందన్నారు. బాబు మనకు వెయ్యికోట్లు డబ్బులిస్తానన్నారని, అందుకే అభిమానులు రెండు జెండాలు పట్టుకొని తిరగడానికి సిద్ధంగా ఉండాలంటూ తన అభిమానులకు నేరుగా చెబితే బాగుండేదని, దానికి ఈ డొంక తిరుగుడు ఎందుకని సీదిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ యవ్వారం పండుగ పూట పగటి వేషగాళ్ళు గ్రామాల్లో తిరిగినట్లు అనిపించిందన్నారు. అభిమానుల లక్ష్యాన్ని,ఆశయాన్ని, ఆలోచనలను పవన్ బాబు చంద్రబాబుకు తాకట్టు పెట్టాడని, ఈ విషయాన్ని యువకులు గమనించాలని సూచించారు. సిఎం జగన్ సింహం లాంటివారని, నీలాంటి గ్రామ సింహాలకు బెదిరే వ్యక్తీ కాదని, ఎంత మొరిగినా, ఏం చేసినా జగన్ ను ఏమీ చేయలేరని పవన్ ను ఉద్దేశించి అప్పలరాజు స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన 2014లో జరిగిందని ఆ తర్వాత ఐదేళ్ళు చంద్రబాబు సిఎంగా ఉన్నారని.. అప్పుడు చంద్రబాబుకు స్నేహితుడిగానో, ఉంపుడు గత్తెగానో ఉన్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు, 2019 నుంచే అంటూ పవన్ ఎందుకు మాట్లాడుతున్నారని సీదిరి ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు వైఎస్, చంద్రబాబుల హయంలో ఏం జరిగిందనేది మాట్లాడాల్సి ఉందని అన్నారు.
లోకేష్ పాదయాత్రకు యువ గళం అని పేరు పెడితే, పవన్ సభకు యువ శక్తి అని పేరు పెట్టారని ఈ రెండూ టిడిపి ఆఫీసులో పెట్టిన పేర్లు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి, ఆయన ఏం చెబితే అది మాట్లాడేపే మెంట్ గాళ్ళు లా జనసేన, సిపిఐ, ఉత్తరాంధ్ర చర్చా వేదిక వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. మత్స్యకారుల వలసల గురించి అసలు పవన్ కు ఏం తెలుసన్నారు. తమ పాలనకు ముందు గతంలో రాష్ట్రంలో రెండో ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయని, ఈ ఐదేళ్ళలో తొమ్మిది హార్బర్లు మంజూరు చేశామని వివరించారు. జగన్ మీద పవన్ కు అసూయ ఉందని, అందుకే ఈ రకంగా మాట్లాడుతున్నారని సీదిరి ధ్వజమెత్తారు.