Thursday, March 28, 2024
HomeTrending Newsవినాయక చవితిపై రాజకీయం వద్దు: వెల్లంపల్లి

వినాయక చవితిపై రాజకీయం వద్దు: వెల్లంపల్లి

వినాయక చవితి ఉత్సవాలపై బిజెపి కావాలనే రాజకీయం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి మతాలను అంటగట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. కోవిడ్ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలనే తాము పాటిస్తున్నామని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం 20 మందితోనే వినాయక చవితి పూజలు జరుపుకోవాలని నిన్న సెప్టెంబర్ 5న ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. కేరళతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మూడో దశ కేసులు పెరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కుంభ మేళా విషయంలో ఏమి జరిగిందో ఆలోచించాలన్నారు.

కరోనా నియంత్రణలో, అందరికీ వ్యాక్సిన్ అందించడంలో జగన్ ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని, ఇలాంటి సమయంలో కరోనా వ్యాప్తి చెందాలని మీ ఉద్దేశమా అంటూ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజును వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.  వినాయక చవితి అందరి పండుగ అని, ముస్లిం లు కూడా ఈ ఉత్సవాలు జరుపుతారని, మతం పేరుతో రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విషయంలోనే కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని, అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మతం అంటగట్టడం సమంజసం కాదన్నారు.

పండుగను అందరూ కుటుంబ సమేతంగా చక్కగా జరుపుకోవచ్చని, అయితే పెద్ద పెద్ద విగ్రహాలు, ఎక్కువ మంది జనం,  భారీ ఊరేగింపులు, డిజేలు లాంటివి వద్దని సూచించామని, అదికూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే ఉత్తర్వులు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వం ఏవో ఆంక్షలు పెట్టిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ధర్నాలు చేయడం సరైంది కాదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలు మార్చాలంటూ ఢిల్లీ వెళ్లి ఆ శాఖ కార్యదర్శిని సంప్రదించాలని బిజెపి నేతలకు సవాల్ విసిరారు. హిందువులను రెచ్చగొట్టే విధంగా మత రాజకీయాలు చేయవద్దని బిజెపి నేతలకు సూచించారు.

ప్రతి ఆదివారం చర్చిలకు లేని ఆంక్షలు, రంజాన్, బక్రీద్, మొహరం పండుగలకు లేని ఆంక్షలు  వినాయకచవితి పండుగకు మాత్రమే విధించడాన్ని నిరసిస్తూ నేడు అన్ని జిల్ల్లల్లోని కలెక్టరేట్ల వద్ద  ధర్నా కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుఇచ్చింది. దీనిపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్