Friday, March 29, 2024
HomeTrending Newsరాబోయేది బీజేపీ ప్రభుత్వమే

రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో మార్పు వచ్చేంత వరకు తాను పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 10వ రోజు మోమిన్ పేట నుండి పాదయాత్ర ప్రారంభించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ పాదయాత్రలో మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శ ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగప్ప, సింగాయపల్లి గోపి, వివిధ మోర్చాల రాష్ట్ర నాయకులతో కలిసి నడుస్తున్నారు.


మోమిన్ పేట నుండి సరిగ్గా ఒక కిలోమీటర్ నడిచిన తరువాత యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, రాష్ట్ర నాయకులు సింగాయపల్లి గోపి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పాదయత్ర 100 కి.మీలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 100 కేజీల కేక్ ను బండి సంజయ్ చేత కట్ చేయించారు. బెలూన్లు ఎగరేసి, పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

భారతీయ జనతా పార్టీ చేపట్టిన పాదయాత్రను వికారాబాద్ ప్రజలు ఆశీర్వదించారు. తెలంగాణలో మార్పు వచ్చే వరకు పాదయాత్ర కొనసాగిస్తా. వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర విజయవంతమైంది. జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు ప్రత్యేకించి మాజీ మంత్రి చంద్రశేఖర్ లను అభినందిస్తున్న. సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. పోలీసు సమస్యలు పరిష్కారం కావాలంటే బీజేపీకి అండగా ఉండాలి. బీజేపీ కార్యకర్తలంతా యూనిఫాం వేసుకోని పోలీసులే. సీఎం రిటైర్డ్ పోలీసులను లెఫ్ట్ – రైట్ పెట్టుకుని రూల్ చేస్తూ కొందరు పోలీసులకు, కార్యకర్తలకు మధ్య బేధాభిప్రాయాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో కుటుంబ పాలన, అవినీతి పాలన, నియంతృత్వ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి గద్దె దింపడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్న అని బండి సంజయ్ తెలిపారు.


అనంతరం బండి సంజయ్ అక్కడి నుండి ముందుకు సాగారు. మేకవనంపల్లి సమీపంలో గుడారాల్లో జీవనం సాగిస్తున్న వారివద్దకు వెళ్లారు. గుడారాల్లోని వారందరితో కలిసి కూర్చుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘‘మాది పాలమూరు జిల్లా. ఇట్లనే సంచార జీవితం చేస్తున్నం. గ్యాస్ పొయ్యి రిపేర్ చేసుకుని తిరుగుతున్నం. మాకు తింటానికి తిండి లేదు. ఉండటానికి ఇల్లు లేదు. బతకడానికి సొమ్ము లేదు. పిల్లలకు స్కూళ్లు లేవు. అందుకే పిల్లలను మా దగ్గరకే తీసుకొచ్చినం. స్కూళ్లుంటే మా అమ్మనాన్న దగ్గర ఉంచుతం. ఇంటి దగ్గరుంటే తిండికి కష్టమైతదని సంచార జీవనం సాగిస్తున్నం. మాకు ఫించన్ కూడా ఇస్తలేరు. డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇస్తలేరు. బుక్కెడు బువ్వ పెట్టడమే కష్టమైంది. ఏదైనా దారి చూపించండి’’సారూ అని గుడారాల్లోని పేదలు కోరారు. వెంటనే స్పందించిన బండి సంజయ్ వారికి కొంత ఆర్దిక సాయం చేశారు. కేసీఆర్ పాలనలో పేదలు సహా అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని స్వయంగా తెలుసుకుని ప్రభుత్వంపై పోరాడేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు.


‘పేదల కోసం నరేంద్ర మోదీ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నరు. వేసుకున్నారా?’ అని అడిగితే….ఇంకా తీసుకోలేదని వారు బదులిచ్చారు. వెంటనే బండి సంజయ్ ‘నరేంద్ర మోదీ పేదల కోసం పని చేస్తున్నరు. మీరందరూ తీసుకోవాలి’’అని సూచించారు. అనంతరం పాదయాత్ర కొనసాగించిన బండి సంజయ్ దారిలో ఉపాధి హామీలో మొక్కలు నాటుతున్న పెంటయ్య, కంసమ్మలతో మాట్లాడారు. పలువురు రైతులతో సంభాషించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను అండగా ఉంటానని, రైతు సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందని హామీ ఇస్తూ ముందుకు సాగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్