అన్నమయ్య, పురందరదాసులాంటి వాగ్గేయకారులు మాట్లాడినదంతా భక్తి పారవశ్య సాహిత్యమే. ప్రతి మాటా ఒక కీర్తనే. ప్రతి కీర్తన ఒక మహాగ్రంథంతో సమానం. సామాన్యులు భజనగా పాడుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు అర్థం తెలుసుకుని పొంగిపోవచ్చు. అర్థాన్ని ఆచరణలో పట్టుకున్నవారు అద్వైత సిద్ధి పొందవచ్చు. తమ జీవితకాలంలో అన్నమయ్య, పురందరదాసులు ఎన్ని వేల కీర్తనలు రాశారో లెక్కే లేదు. వారు సృష్టించిన భక్తి సాహిత్య సముద్రాల్లో కాలగతిలో మనకు దొరికింది చెంబుడో మహా అయితే బిందెడో అయి ఉంటుంది. అంతే.
పండితులకే పరిమితమైన సంస్కృత పదబంధుర కీర్తనల ఇనుపసంకెళ్లను తెంచి...అత్యంత సరళమైన కన్నడలో దాస సాహిత్యాన్ని సృష్టించిన పురందరదాసు కంటే సరళమైన భాషను ఇంకో యుగం గడచినా ఎవరూ సృష్టించలేరు. మన పదకవితా పితామహుడు అన్నమయ్యను గురువుగా భావించి ఆయన మార్గాన్నే అనుసరించినవాడు పురందరదాసు. అన్నమయ్య(1408-1503); పురందరదాసు(1484-1564) మనకెలాగో అలా ఉత్తరాదిలో మీరాబాయి(1498- 1546). అన్నమయ్య, పురందరదాసు ఇరవై ఏళ్లకే సకల శాస్త్రాలు చదువుకుని భక్తిమార్గం పట్టినవారు. మీరా జీవితం నేర్పిన పాఠాల్లో నుండి వైరాగ్యంతో భక్తిమార్గం పట్టింది.
రాజవంశంలో పుట్టిన మీరాను మేవాడ్ యువరాజు భోజరాజ్ కిచ్చి 1516లో పెళ్లి చేశారు. మీరాకు పెళ్లంటేనే ఇష్టం లేదు. అయినా బలవంతంగా పెళ్ళికి ఒప్పించారు. మొఘలులతో యుద్ధాలతో మేవాడ్ అట్టుడుకుతున్న కాలమది. రాజవంశంలో మూతిమీద మీసం మొలిచిన ప్రతి యువకుడు ముందుండి మేవాడ్ సేనలను నడిపించాల్సిన కాలమది. అలా పెళ్లయిన కొన్నాళ్లకే మీరా భర్త కదనరంగంలోకి దూకక తప్పలేదు. భోజరాజ్ పెళ్లయిన రెండేళ్లకే 1518లో యుద్ధంలో తీవ్రంగా గాయపడి…మంచాన పడి…1521లో కన్నుమూశాడు. అప్పటికి మీరా వయసు పట్టుమని పాతికేళ్లు కూడా నిండలేదు. భర్త సోదరుడు బావ రాజయ్యాడు. కొంతకాలానికి ఆయన కూడా మొఘలులతో యుద్ధంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
అక్కడినుండి మీరాకు కష్టాలు చెప్పి రావడం మొదలయ్యాయి. ఆరోజుల్లో వైధవ్యం పొందిన స్త్రీమీద విధించే ఆంక్షలన్నీ ఆమెమీద విధించారు. అత్తమామలు మీరాను చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడిని విష్ణువు రక్షించినట్లు ఆమెను కృష్ణుడే రక్షించాడని ఇప్పటికీ రాజస్థాన్ జానపద గాథల్లో చెప్పుకుంటున్నారు. మీరా మెడలో పాము వేస్తే పూలదండ అయ్యేదని; నీటిలో ముంచితే తేలేదని…ఇలా ఆమె గురించి ఇప్పటికీ రాజస్థాన్ మైమరచి చెప్పుకుంటోంది. ఆమెగురించి విన్న మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రశంసాపూర్వకంగా తాన్ సేన్ తో ఒక ముత్యాల హారాన్ని కానుకగా పంపినట్లు చరిత్రలో రాశారు. (అక్బర్ కు లేని గొప్పదనాన్ని ఆపాదించడానికి ఎవరో ఈ ముత్యాల హారం కానుక కల్పితగాథను సృష్టించారని కొందరంటారు).
అయినవారి హింసలు భరించలేక మీరా ఎవరికీ చెప్పకుండా మేవాడ్ వదిలి కాలినడకన ద్వారక చేరుకుంది. ఇక ఆమెకు కృష్ణుడే సర్వస్వం. కృష్ణుడినే భర్తగా భావించి పదాల పూలతో కవితల మాలలల్లి కృష్ణుడి మెడలో వేసి మైమరచిపోయేది. కృష్ణుడే మైమరచి విన్న భజనలవి. అనతికాలంలోనే మీరా భజనలు ఉత్తరభారతమంతా ప్రతిధ్వనించాయి. మీరా తుదిశ్వాసవరకు కృష్ణగానం చేస్తూ చివరికి కృష్ణుడిలోనే ఐక్యమైపోయింది.
భారతీయ భజనలకు మీరా ఒక చుక్కాని అయ్యింది. ఆమె రాసి…పాడినవి కొన్నే అయినా ఆమెలానే రాసి ఆమె పేరిటే ఎన్నెన్నో భజనలను ప్రచారంలో పెట్టారని సంగీతజ్ఞుల విశ్లేషణ.
వేమన విషయంలో కూడా ఇలాగే జరిగిందని ప్రఖ్యాత సంగీత, సాహిత్య విమర్శకుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ నిరూపించారు. అయితే…అది వేమనను గౌరవించడమే కానీ తక్కువ చేసినట్లు కాదని అంటారాయన. ఎంతగానో నచ్చితేనే కదా అలాగే రాయడానికి ప్రయత్నిస్తారు? అంటూ చాలా లోతైన విశ్లేషణ చేశారు. అలాగే అచ్చు మీరాలా భజనలు రాసి…పాడడం ద్వారా ఆమె విలువ పెరిగిందే కానీ తగ్గలేదు. తగ్గదు.
రేపు:-
“చలో ఉదయ్ పూర్”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు