Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనీ కబ్జా- నా కబ్జా

నీ కబ్జా- నా కబ్జా

Tight Fight: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రజలే అత్యంత బలసంపన్నులని రాజనీతి శాస్త్రంలో ఒళ్లు పులకించే, మనసంతా నిండిపోయే పాఠాలు ఎన్నెన్నో ఉంటాయి. వాటిని చదువుకున్నవాళ్లకు ఒకలా అర్థమవుతాయి. వాటి జోలికి వెళ్లనివాళ్లకు ప్రజాస్వామ్యం ఒక బ్రహ్మపదార్థం.

ప్రజాస్వామ్యం బలమయినది అవునో కాదో కానీ…ప్రజాస్వామ్యంలో కొందరు ప్రజాప్రతినితిధులు మాత్రం భీముడు చిన్నబోవాల్సినంత బలమయినవారు. మల్లయోధులు. ముష్టిఘాతాల్లో సిద్ధహస్తులు. తుపాకి కాల్చడంలో నిపుణులు. చెంప చెళ్లుమనిపించడంలో చురుకైనవారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్ టీ వీ గెలుపెవరిది? అని ప్రజల మధ్య బహిరంగ చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రధానంగా ఈ చర్చలో పాల్గొంటారు. ఇది ప్రత్యక్షప్రసారం. దీనికోసం ఎన్ టీ వీ చాలా ఏర్పాట్లు చేసుకుంది. జర్నలిస్టులు, సాంకేతిక సిబ్బంది చాలా మంది సమన్వయంతో పనిచేయాల్సిన కార్యక్రమమిది. అందులో భాగంగా ఒక నియోజకవర్గంలో చర్చ మొదలు కాగానే…అధికార పార్టీ ఎమ్మెల్యే- బి జె పి అభ్యర్థి మధ్య పరస్పరం భూ కబ్జాల చర్చ వచ్చింది. బి జె పి అభ్యర్థి ఏదో చెప్పబోయాడు. అంతే…అధికార పార్టీ ఎమ్మెల్యే బి జె పి నాయకుడి మీదికి లంఘించి పీక పిసికేస్తూంటే…కార్యక్రమాన్ని తెరమీద సమన్వయం చేస్తున్న యాంకర్ ప్రాణాలకు తెగించి వారి మధ్యలోకి వెళ్లి బి జె పి నాయకుడిని అక్షరాలా బతికించాడు. ఈలోపు ప్రేక్షకులు మౌన ప్రేక్షకులుగా కూర్చోలేక…రెండుగా చీలి…హోరా హోరీ తోసుకున్నారు. సుహృద్భావ వాతావరణంలో తన్నుకున్నారు. పరస్పరం కొట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. కార్యక్రమం యుద్ధ సన్నివేశంతో అర్ధాంతరంగా అక్కడికి ఆగిపోయింది.

దెబ్బలు తిన్న బిజెపి నాయకుడు ఆరోపించినట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తండ్రి భూ కబ్జాలకు సమాధానం రాలేదు. ప్రశ్నకు భౌతిక దాడి సమాధానంగా వచ్చింది కాబట్టి…ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించినట్లు అనుకోవాలో? అంగీకరించినట్లు అనుకోవాలో? ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.

దేవుడికన్నా దెబ్బే గురువు అన్నది లోకం అనాదిగా అంగీకరించిన సిద్ధాంతం. బల్ల గుద్ది చెప్పడం; నొక్కి వక్కాణించడం; గట్టిగా చెప్పడం; పదే పదే చెప్పడం లాంటివన్నీ ఓల్డ్ మాడల్ డెమొక్రటిక్ డిబేట్లు. ఇప్పుడు కుర్చీ, బల్లతో కొట్టి చెప్పడం; మొహం పగిలేలా, పళ్ళు ఊడేలా కొట్టి చెప్పడం; మైకు లాగి మొహం పగలగొట్టడం; వంగోబెట్టి వీపు విమానం మోత మోగించడం; సభా మర్యాద దృష్ట్యా చెప్పకూడని నానా బూతులు తిడుతూ చెప్పెత్తి చూపడం; సందర్భాన్ని బట్టి చెప్పుతో కొట్టడం లాంటివి ఆధునిక ప్రజాస్వామిక చర్చల్లో సాధారణం.

రోజులు మారే కొద్దీ ప్రేక్షకులు కూడా ఇవే కోరుకుంటున్నారు. గంటయినా ఎవరు ఎవరినీ కొట్టని ఈ చర్చ ఇంత చప్పగా ఉందేమిటి? అని ప్రేక్షకులు చానెళ్లు మార్చే రోజులు వచ్చేశాయి. డిబేట్లలో ప్రత్యర్థిని పచ్చడి పచ్చడి కింద కొట్టిన నాయకుడిని పార్టీలు గుర్తించి మరింతగా ప్రోత్సహిస్తున్నాయి.

“గెలుపెవరిది?” అన్న ప్రశ్నను రాజకీయనాయకులు ట్రూ స్పిరిట్లో తీసుకున్నట్లున్నారు. వరల్డ్ రెజిలింగ్ ఫెడరేషన్- WWF పోటీల్లో ఇద్దరు మహా యోధులు పరమ భయంకరంగా కొట్టుకుంటూ ఉంటారు. ఎలాగయినా కొట్టుకోవచ్చు. మధ్యలో రిఫరీ ఎముకలు కూడా విరుగుతూ ఉంటాయి. చుట్టూ జనం కేరింతలు. ఈలలు. కేకలు. చప్పట్లు. అవతలివాడు లేవకుండా కొట్టినవాడే విజేత. దీనికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమయిన ఆదరణ.

తెలుగులో WWF మల్లయుద్ధ, ముష్టియుద్ధ పాటీల్లేవని దిగులు పడాల్సిన పనిలేదు. ఎన్నికల వేళ టీ వీ డిబేట్లు ఆన్ చేస్తే చాలు…WWF సిగ్గుతో తలదించుకునే సీన్లు కోకొల్లలు.

చర్చల్లో ప్రత్యర్థి పార్టీల నాయకులు పరస్పరం కొట్టుకోవడంలో ధర్మముందని లోకం కూడా అర్థం చేసుకుంది. ఎన్నికల్లో పార్టీ టికెట్లకోసం పేర్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన వేళ ఒకే పార్టీ నాయకులు పరస్పరం కొట్టుకోవడాన్ని కూడా ఇప్పుడు లోకం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ”  మధ్యప్రదేశ్ లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి విడత అభ్యర్థుల ప్రకటన తరువాత మీడియా కెమెరాల ముందు చెప్పుతో అలసిపోయేదాకా కొట్టుకున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకుల వీడియో” అంటూ వైరల్ అయినది ఇది. ఫ్యాక్ట్ చెక్ లో ఆరా తీస్తే-  అది నిజం కాదని, 2019లో ఉత్తరప్రదేశ్ లో ఒక సమావేశంలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు పరస్పరం చెప్పులతో కొట్టుకున్న లోకోత్తర దృశ్యమని తేలింది. ఎన్నికలకు ముందున్న చేతివాటం గెలిచాక పోదు కదా?

అయినా మనపిచ్చిగానీ…
ప్రజాస్వామ్యమంటేనే బల నిరూపణ. ఎన్నికల్లో భుజబల ప్రదర్శన అందులో అంతర్భాగం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్