Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకుక్కలకు మొబైల్ బ్యూటీ పార్లర్లు

కుక్కలకు మొబైల్ బ్యూటీ పార్లర్లు

కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.

వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది.

అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండుకుక్కల వాళ్ల ఇల్లు అని కుక్కగుర్తుగా పనిమనుషులు, సెక్యూరిటీవారు చెప్పుకుంటూ ఉంటారు.

అలాంటి శునకాలకు ప్రత్యేకంగా బ్యూటీ పార్లర్లు ఏనాటినుండో ఉన్నాయి. “కుక్క తోకను ఊపితే పర్లేదు కానీ…తోకే కుక్కను ఊపితే ప్రమాదం” అని మనుషులు ఎందుకంటారో కుక్కలకు తెలియకపోయినా… తోకే కుక్కను ఊపే రోజులు కాబట్టి ఆ బ్యూటీ పార్లర్లే కుక్కల దగ్గరికొచ్చి సేవలు చేసి వెళుతున్నాయి. సంపన్న శునకం బిజీగా ఉంటే కిక్కురుమనకుండా వేచి ఉంటున్నాయి. కుక్కలకు బొచ్చు కత్తిరించడం;
గోళ్ళు తీయడం;
ఫేషియల్;
రంగులు వేయడం;
ఆవిరి స్నానాలు;
పరిమళభరిత ఎకో ఫ్రెండ్లి స్కిన్ ఫ్రెండ్లి ఆర్గానిక్ స్నానాలు;
తళతళలాడేలా పళ్ళు తోమడం;
నిగనిగలాడే అందమైన మెడ గొలుసులు వేయడం;
రుతువునుబట్టి బట్టలు కుట్టి తొడగడం;
యజమానులతో మ్యాచింగ్ డ్రెస్సులు తొడగడం…
లాంటి కుక్కల మేకోవర్ కు మొబైల్ సర్వీసులు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి.

మన కుక్కగారికి ఫార్మల్ గా మేకప్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోగానే ఆ మొబైల్ వ్యాన్ మన ఇంటిముందు వచ్చి వాలుతుంది. తాపీగా తోక ఊపుకుంటూ కుక్కగారు ఆ వ్యాన్ మెట్లెక్కితే చాలు…నఖశిఖపర్యంతం తనను తానే గుర్తుపట్టలేనంతగా కుక్క అందగిస్తుంది.

నిజమే.
“ఇంటిని చూడు- ఇల్లాలిని చూడు” అన్న సామెతకు కాలం చెల్లింది!
“కుక్కును చూడు- ఇంటిని చూడు” అన్నది కదా ఆధునిక శునక ప్రమాణోపమానం!

ఇది ఆధునిక సంచార శునక సౌందర్యలహరి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్