synonym of versatility: కృషి .. పట్టుదల ఉంటే, సాహసాలు .. ప్రయోగాలు చేయడానికి వెనుకాడని ధైర్యం ఉంటే, వీలైనన్ని విజయాలను సాధించవచ్చు అని నిరూపించినవారిలో మోహన్ బాబు ఒకరు. ఒక గమ్యాన్ని నిర్ణయించుకున్న తరువాత .. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకున్న తరువాత .. ఇక వెన్ను చూపకుండా ఉంటే విజేతగా నిలబడొచ్చు అని ప్రయత్న పూర్వకంగా నిరూపించినవారిలో మోహన్ బాబు ఒకరు. ఎక్కడో చిత్తూరు జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన ప్రయాణం చూస్తే, ఆయన కార్యదీక్ష ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది.
అప్పట్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడంత తేలిక కాదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా అవకాశాన్ని సంపాదించుకున్నా నిలదొక్కుకోవడం మరింత కష్టం. అలాంటి పరిస్థితుల్లో ముందుగా రోజు గడవడానికి ఇబ్బంది లేకుండా ఒక చిన్నపాటి ఉద్యోగం చూసుకుని .. ఆ తరువాత సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు వేసినప్పటికీ, ‘స్వర్గం నరకం’ సినిమాతో హీరో అనిపించుకున్నారు. దాసరి దర్శకత్వం వహించిన ఆ సినిమాతోనే భక్తవత్సలం నాయుడు కాస్తా మోహన్ బాబుగా మారిపోయారు.
అప్పుడున్న పరిస్థితుల్లో హీరోగా తనని తాను నిరూపించుకోవడం మోహన్ బాబుకి అసాధ్యమైంది. బరిలో హేమాహేమీలు ఉన్నారు. అందువలన ఆయన విలన్ వేషాల వైపు .. కామెడీ విలన్ వేషాల వైపు వెళ్లారు. ఎవరూ ఎదురులేని రూట్ కావడంతో ఆయనకి తిరుగులేకుండా పోయింది. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆయన దూసుకుపోయారు. ఒకానొక దశలో మోహన్ బాబు లేని సినిమా అంటూ ఉండేది కాదు. అలా ఆయన తన ప్రభ కొనసాగుతూ ఉండగానే హీరోగా టర్న్ తీసుకోవాలని అనుకున్నారు. విలన్ గా ఆ స్థాయిలో రాణించిన తనని హీరోగా పెట్టి ఎవరు రిస్క్ చేస్తారు. అందువలన తానే నిర్మాతగా మారారు. ఆ సినిమా ఫ్లాప్ అయితే అప్పటివరకూ తాను సంపాదించిందంతా పోతుందని తెలుసు… అయినా ఆయన రిస్క్ చేశారు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలి ప్రయత్నంగా చేసిన ‘అల్లుడు గారు’ వసూళ్ల వర్షం కురిపించింది. మోహన్ బాబు అప్పటివరకూ పెద్ద విలన్ అనే విషయాన్ని మరిచిపోయి ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు. అంతే మోహన్ బాబు ఇకపై తాను హీరోను మాత్రమే అని ఫిక్స్ అయ్యారు. వరుస సినిమాలతో హీరోగానూ .. నిర్మాతగాను దూసుకుపోయారు. ఆ క్రమంలో ‘అసెంబ్లీ రౌడీ’ .. ‘అల్లరి మొగుడు’ .. ‘రౌడీగారి పెళ్ళాం’ .. ‘బ్రహ్మ’ .. ‘పెదరాయుడు’ సినిమాలు హీరోగా ఆయన క్రేజ్ అందనంత ఎత్తుకు తీసుకుని వెళ్లాయి.
విలన్ పాత్రలకి పెట్టింది పేరు అనిపించుకున్నవారు హీరోగా ఇంతటి సుదీర్ఘ కాలం మెప్పించడమనేది మోహన్ బాబుకు మాత్రమే సాధ్యమైంది. నటుడిగా .. నిర్మాతగా తనని తాను నిరూపించుకున్న మోహన్ బాబు, రాజకీయాలలోను .. విద్యా రంగంలోను తనదైన ముద్రవేశారు .. ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాల సంఖ్యను కూడా తగ్గించుకున్నారు. తన స్థాయికి తగిన పాత్రలు వస్తే చేస్తున్నారు .. లేదంటే లేదు. కానీ మోహన్ బాబు అభిమానులు మాత్రం ఆయన వరుస సినిమాలు చేయాలనే కోరుకుంటున్నారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.
(మోహన్ బాబు బర్త్ డే స్పెషల్)
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read : అందం-అభినయం కలబోత