Thursday, February 22, 2024
Homeసినిమాఅందం-అభినయం కలబోత

అందం-అభినయం కలబోత

Queen of Telugu cinema:  అనగనగా ఒక అందమైన రాజకుమారి. ఆమె తన చెలికత్తెలతో కలిసి ఉద్యాన వనాల్లో విహరిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే వేటకి అటుగా వచ్చిన ఓ యువరాజు ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్దుడవుతాడు. ఆమె కూడా ఆయనను ఓరకంట చూస్తూ మనసు పారేసుకుంటుంది. ఇక ఆయన గురించిన కలలతోనే కాలం గడుపుతూ ఉంటుంది. ఆయన గురించిన ఊహలని ఊపిరిగా చేసుకుని జీవిస్తూ ఉంటుంది. అలాంటి ఒక రాజకుమారి పేరు చెప్పగానే అందరి  కనులముందు మెదిలే కథానాయికనే కృష్ణకుమారి.

అప్పట్లో కథానాయికగా ఒక అవకాశాన్ని అందుకోవడం చాలా కష్టమైన విషయం. కానీ అలాంటి అవకాశం కృష్ణకుమారిని వెతుక్కుంటూ వచ్చింది .. అదీ ఆమె సినిమా థియేటర్లో సినిమా చూస్తూ ఉండగా. కృష్ణకుమారి తన తల్లితో కలిసి ‘స్వప్న సుందరి’ సినిమాకి వెళ్లారు. ఆ సినిమాకి వచ్చిన దర్శకుడు సౌందరరాజన్ కూతురు ఆమెను చూశారు. ‘నవ్వితే నవరత్నాలు’ సినిమాలో కథానాయిక కోసం వాళ్లు వెతుకుతున్నారు. ఆ సినిమాలో కథానాయికగా కృష్ణ కుమారి అయితే బాగుంటుందని ఆమె భావించి పరిచయం చేసుకున్నారు.

Krishna Kumari

ఆ మరుసటి రోజున సౌందరరాజన్ తన కూతురును వెంటబెట్టుకుని కృష్ణకుమారి ఇంటికి వచ్చి తన సినిమాలో ఆమె నటించడానికిగాను ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారు. అలా ఆమె ‘నవ్వితే నవరత్నాలు’ సినిమాను అంగీకరించారు. ఆ సినిమాలో కొత్త కథానాయిక చేయనుందనే ఫొటో పేపర్లో రాగానే కృష్ణ కుమారి 14 సినిమాలకి బుక్ అయ్యారు. ముందుగా ఆమె కెమెరా ముందుకు వెళ్లింది మాత్రం ‘మంత్రదండం’ సినిమా కోసం. ఆ తరువాత నుంచి ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.

ఒక వైపున సావిత్రి .. మరో వైపున జమున తమదైన జోరు చూపుతున్న సమయంలో, కృష్ణకుమారి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ ఇద్దరి తరువాత స్థానం తనదేనని చెప్పుకునేలా చేశారు. విశాలమైన కళ్లు .. సన్నజాజి మొగ్గలాంటి నాసిక .. మనసులపై మంత్రం వేసే నవ్వుతో ఆమె కట్టిపడేశారు .. అజంతా శిల్పంవంటి అమ్మాయి అనిపించుకున్నారు. తన తరువాత వచ్చిన కథానాయికలు తనని దాటి వెళ్లలేనంత క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. పల్లెపిల్లగా పరికిణీలో  కనిపించడంలోను .. పట్నం పిల్లగా మోడ్రన్ డ్రెస్సుల్లో పొగరు చూపడంలోను ఆమె తనదైన ముద్రవేశారు.

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కాంతారావు .. జగ్గయ్య .. చలం .. వంటి కథానాయకుల సరసన ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. ఎన్టీఆర్ సరసన చేసిన ‘గుడిగంటలు’ ..  ఏఎన్నార్ జోడీగా చేసిన ‘పెళ్లికానుక’ ఆమె కెరియర్లో ప్రత్యేకమైన సినిమాలుగా కనిపిస్తాయి. కాంతారావు సరసన అత్యధిక జానపదాలు చేసిన నాయిక ఆమెనే. కృష్ణకుమారి ఎవరి సరసన నటించినా ఆ హీరోకి తగిన జోడీ అన్నట్టుగానే కనిపించేవారు. ప్రేమ .. విరహం .. వియోగంతో కూడిన పాత్రలను అద్భుతంగా ఆవిష్కరించేవారు. అందం పరంగా .. అభినయం పరంగా ఆమెకి వంక బెట్టడం అసాధ్యమనే అప్పటి పత్రికలు రాశాయి.

ఆణిముత్యాల వంటి పాటలు పడటం కూడా ఆమె అదృష్టంగానే చెప్పుకోవాలి. ఏమని పాడెదనో ఈ వేళ (భార్యభర్తలు) ..   ఊహలు గుసగుసలాడే (బందిపోటు) .. నా కంటిపాపలో నిలిచిపోరా (వాగ్దానం) ..  దాచాలంటే దాగదులే (లక్షాధికారి) ఈ మౌనం .. ఈ బిడియం (డాక్టర్ చక్రవర్తి) పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు (జమీందార్) వలపు తేనె పాట (అభిమానం) ఇలా ఎన్నో మధురమైన పాటలకి ఆమె అందమైన అభినయం తోడు కావడంతో అవి మరింత అందంగా .. ఆహ్లాదంగా అనిపిస్తాయి. అనుభూతి పరిమాళన్ని వెదజల్లుతూనే ఉంటాయి.

ఇలా తెరపై అందానికి నిర్వచనమై నిలిచిన కృష్ణకుమారి, పాతికేళ్ల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించారు. తెలుగు సినిమా పరిశ్రమకి రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీఆర్ – ఎన్నార్ లతో కలిసి అత్యధిక చిత్రాలలో అలరించారు. 150  చిత్రాలకు పైగా నటించిన ఆమెను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. ఇప్పటికీ టీవీలో కృష్ణకుమారి సినిమా వస్తుందంటే ఛానల్ మార్చకుండా .. కదలకుండా చూసేవారు చాలామంది ఉన్నారు. తెలుగు తెరను ఎంతమంది కథానాయికలు ప్రభావితం చేసినా, అందాల రాకుమారి కృష్ణకుమారినే అని చెప్పాలి. ఈ రోజున ఆమె జయంతి .. ఈ  సందర్భంగా మనసారా ఒకసారి ఆమెను స్మరించుకుందాం.

— పెద్దింటి గోపీకృష్ణ

ఇవి కూడా చదవండి : సౌందర్యానికి నిర్వచనం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్