Saturday, April 20, 2024
HomeTrending News120 గంటల సోదాలు.. 257 కోట్ల స్వాధీనం

120 గంటల సోదాలు.. 257 కోట్ల స్వాధీనం

Money Laundering Case :

ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన కాన్పుర్‌ సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్‌ జైన్‌ ఇంట్లో జీఎస్‌టీ, ఐటీ అధికారుల సోదాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దాదాపు 120 గంటల పాటు కొనసాగిన ఈ తనిఖీల్లో రూ.257కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు ఖరీదైన ఆస్తుల పత్రాలను కూడా గుర్తించారు. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడిన పీయూష్‌ జైన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
కాన్పూర్‌కు చెందిన పర్ఫ్యూమ్‌ వ్యాపారి పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గత గురువారం జీఎస్‌టీ, ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. తనిఖీల్లో భాగంగా పీయూష్‌ ఇంట్లోని రెండు బీరువాల్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ డబ్బును లెక్కించేందుకే దాదాపు నాలుగు రోజులు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా రూ.257కోట్ల నగదును గుర్తించారు. దీంతో పాటు 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి ఆభరణాలను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఇక, సోదాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లో 4, కన్నౌజ్‌లో 7, ముంబయిలో 2, దిల్లీలో ఒక ఆస్తికి చెందిన పత్రాలను గుర్తించారు. మరో రెండు ఆస్తులు దుబాయిలో ఉన్నట్లు తేలింది. కన్నౌజ్‌లో పీయూష్‌ జైన్‌ పూర్వీకుల ఇంట్లో 18 లాకర్లను అధికారులు గుర్తించారు. మరో 500 తాళాలు కూడా దొరికాయట. ఆ లాకర్లను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత గురువారం నుంచి మొదలైన ఈ సోదాలు.. ఆదివారం వరకు సాగాయి. దాదాపు 50 గంటల పాటు పీయూష్‌ జైన్‌ను అధికారులు విచారించారు. అనంతరం నిన్న సాయంత్రం అతడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడి పీయూష్‌ ఈ మొత్తాన్ని కూడబెట్టినట్లు గుర్తించారు. పన్ను ఎగవేత మొత్తంగా రూ. 1000కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పీయూష్‌ ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలుగా పేర్చిన ఫొటోలు ఇటీవల వైరల్‌ అయిన విషయం తెలిసిందే.
పీయూష్‌ జైన్‌ సమాజ్‌వాదీ పార్టీ నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ‘సమాజ్‌వాదీ సెంట్‌’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన సుగంధ ద్రవ్యాన్ని ఈయన కంపెనీలోనే తయారు చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ పరిణామాలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఉదంతం నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీపై అధికార భాజపా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.

Also Read : బాబు సిఎం కావడం చారిత్రక అవసరం

RELATED ARTICLES

Most Popular

న్యూస్