Saturday, November 23, 2024
HomeTrending Newsఆటా(ATA)లో అహం జబ్బు

ఆటా(ATA)లో అహం జబ్బు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ గత జులై నెలలో 17వ మహాసభలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొత్త కమిటీ, అధ్యక్షుడి ఎన్నికలు మాత్రం అత్యంత ఆసక్తికి రేకిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 30 ఏళ్ల ఆటా చరిత్ర బ్రష్టు పట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఓ వైపు మంచు తుఫాను చలి దడ పుట్టిస్తుంటే, ఆటా ఎన్నికలు మాత్రం అమెరికా తెలుగు వారిలో వేడిని రగిలిస్తున్నాయి.

అమెరికాలోని తెలుగు వారిని ఒక తాటి మీదకు తేవటం, సామాజిక, సేవా, సాంస్కృతిక రంగాల్లో పాల్గొనేలా చేయటం కోసం 30 ఏళ్ల కిందట ఆటా ఆవిర్భవించింది. అయితే దశల వారీగా అక్కడ తెలుగు వారిలోనూ రాజకీయాలు, వ్యక్తి గత స్వార్థాలు, పదవుల వ్యామోహం, కుల, ప్రాంతీయ తత్వాలతో చీలికలు రావటం, కొత్త సంఘాలు ఏర్పడటం జరుగుతూ వస్తున్నాయి.

తాజాగా .. తొలి తెలుగు సంఘంగా అమెరికాలో చెరగని ముద్ర వేసిన ఆటాలో మరో ముసలం మొదలైంది. దొడ్డి దారిన పదవులు పొందాలి, డబ్బు ప్రభావంతో అందలాలు ఎక్కాలనే తాపత్రయంతో కొందరు తాజా ఎన్నికలను భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇది ఆటా ప్రతిష్టకు తీవ్రమైన భంగకరం అనే చర్చ జరుగుతోంది.

వివరాలలోకి వెళితే… ఆటా (ATA) లో ప్యాట్రన్, గ్రాండ్ ప్యాట్రన్ మరియు లైఫ్ కేటగిరీ అనే మూడు రకాల బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తో మొత్తం 31 మంది ఉంటారు. ఆటా సభ్యత్వం ఉన్నవారు ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ని వోట్ ద్వారా ఎన్నుకుంటారు. అనంతరం ఈ 31 మంది సింపుల్ మెజారిటీ తో ఆటా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 16 లేదా 15 మంది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees) ని 4 సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నుకుంటారు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఇండియాలో సాధారణ ఓటర్లు ఒక రాష్ట్ర ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే, అనంతరం ఆ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే విధంగా ఉంటుంది.

ఈసారి ఆటా ఎన్నికల్లో ప్యాట్రన్ (Patron) కేటగిరీలో 3, గ్రాండ్ ప్యాట్రన్ (Grand Patron) కేటగిరీలో 3 మరియు లైఫ్ (Life) కేటగిరీలో 10 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్యాట్రన్ కేటగిరీలో దాదాపు 500 ఓటర్లు, గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో సుమారు 200 ఓటర్లు మరియు లైఫ్ కేటగిరీలో 12 వేల ఓటర్ల వరకు ఉన్నట్లు సమాచారం.
ఎలాగైనా ఈసారి ఆటా అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కి ముందే ఒక మనీ పవర్ ఉన్న వ్యక్తి, ఆయనకు వంత పాడుతున్నవారు పెద్ద ఎత్తున డబ్బులిచ్చి మరీ వేలల్లో ఆటాలో కొత్త సభ్యుల్ని చేర్పించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తతంగం వెనుక ఆటా ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకునే ఒక మాజీ అధ్యక్షుడు, ఒక వ్యవస్థాపక సభ్యుడు, మరికొందరు పదవీ వ్యామోహులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

దీంతో మొదటి నుంచీ ఆటా అభివృద్దికి, ఔన్నత్యానికి పాటుపడిన వారిలో ఆందోళన మొదలైంది. మనీ పవర్ తో ఆటా పదవులను పొందేవాళ్లు ఏ మేరకు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారనే చర్చ అమెరికా తెలుగువాళ్లలో జోరుగా సాగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆటా అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందనే ఆందోళన సీనియర్ ఆటా సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత ఎలక్షన్ 30 సంవత్సరాల ఆటా చరిత్ర (ATA History) లోనే ఖర్చుతో కూడిన అతి పెద్ద ఎలక్షన్ అంటున్నారు అమెరికాలోని తెలుగువారు. డబ్బులిచ్చి ఆటాలో సభ్యులను చేర్పించే సంస్కృతి కూడా ఆటా చరిత్రలో మొట్ట మొదటిసారి అనే విమర్శలు వస్తున్నాయి.

బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే సభ్యులందరికీ పోస్ట్ లో బ్యాలెట్ పేపర్ ను పోస్టులో ఆటా ఎన్నికల కార్యవర్గం పంపింది. జనవరి ఆరులోగా ఈ బ్యాలెట్ పేపర్లలో ఓటు వేసి సభ్యులు తిగిరి పంపాల్సి ఉంటుంది.

ఆటా గౌరవం పెరిగేలా, ప్రతిష్ట మసకబారకుండా కొత్త సభ్యులను ఎన్నుకోవాలని సంప్రదాయ ఆటా మాజీ కార్యవర్గ సభ్యులు, యాక్టివ్ మెంబెర్స్ గా గతం నుంచీ పాల్గొంటున్నవారు కోరుతున్నారు. అమెరికా గడ్డపైన తెలుగువారి గౌరవం కోల్పోకుండా ఈ ఎన్నికలు జరగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటూ ఓటింగ్ లో పాల్గొనే వారు, భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు గుర్తించాలని విజ్జప్తి చేన్తున్నారు.

Also Read : ఆటా తదుపరి అధ్యక్షులెవరు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్