Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశునక- వానర యుద్ధం

శునక- వానర యుద్ధం

Dogs killing mistery:
పాపం!
మహారాష్ట్రలో బీడ్ జిల్లా మజల్ గావ్ గ్రామం చుట్టుపక్కల కుక్కలకు చచ్చే చావొచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో శునక జాతి తుడిచిపెట్టుకుపోయేంతగా ప్రమాదంలో పడింది. కుక్క పిల్లలను భగవంతుడు కూడా కాపాడలేకపోతున్నాడు. కుక్క పిల్లలకు సింహ స్వప్నమయ్యింది అడవి సింహాలయితే…ఆటవిక న్యాయమే కదా! అని సరిపెట్టుకోవచ్చు. వెంటపడి కుక్కపిల్లల ఉసురు తీస్తున్నది అక్షరాలా కోతులు. అటవీ, పోలీసు, రెవిన్యూ, పంచాయతీ రాజ్ శాఖలన్నీ కట్టగట్టుకుని ప్రయత్నిస్తున్నా కుక్కలపై కోతుల పగ ప్రతీకారం ఆవగింజంత కూడా తగ్గడం లేదు. మధ్యలో పసిపిల్లల మీద కోతులు దాడులు చేస్తున్నాయి. ఈ వానర- శునక వైరానికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది కత్తులకు కుత్తుకలు తెగిపడే బోయపాటి అఖండ సినిమాకంటే ఒళ్లు గగుర్పొడిచేది.

ఇదీ ఫ్లాష్ బ్యాక్:-

కట్ చేస్తే…
ఒక రోజు మిట్ట మధ్యాహ్నం మజల్ గావ్ వీధిలో కోతి మూక ఎప్పటిలా కోతి చేష్ఠలు చేస్తోంది. ఈలోపు తల్లి ఒడిలో నుండి ఒక కోతి పిల్ల వీధిలోకి ఎగిరింది. అక్కడే లోకాభిరామాయణంలో భౌ భౌ అని మాట్లాడుకుంటున్న కుక్కలను కెలికింది. అంతే…జాతి వైరం పడగ విప్పింది. కుక్కలు మూకుమ్మడిగా దాడిచేసి కోతి పిల్లను చంపేశాయి. పెద్ద కోతుల కళ్ల ముందే ఈ ఘోరం జరిగిపోయింది.

వెంటనే బీడ్ జిల్లా అఖిల వానర సంఘాల ఐక్యవేదిక అత్యవసర సమావేశం ఏర్పాటయ్యింది. పిల్ల కోతి మృతికి రెండు నిముషాలు మౌనం పాటించి…వానర సమావేశం భీషణ ప్రతిజ్ఞ చేసింది. వెనకటికి పురాణంలో సర్పయాగం చేసినట్లు…ఇప్పుడు శునక యాగం చేయడానికి రోజులు కావు. “కన్నుకు కన్ను. కాలుకు కాలు. చేయికి చేయి…చావుకు చావు” అన్నది ఆధునిక సిద్ధాంతం. మన అల్లారు కోతి పిల్లను చంపిన కుక్కలకు కుక్కచావు అంటే ఏమిటో తెలియజేద్దాం. ఎక్కడ కుక్క పిల్ల దొరికినా గుంపుగా దాడి చేసి…ఎత్తయిన చెట్టు మీదికో…భవనం మీదికో తీసుకెళ్లి…అంతెత్తు నుండి పడేద్దాం…ఒక్క కుక్క పిల్లనూ వదలద్దు.

ఈ ప్రతిజ్ఞకు యావత్ వానరాలు కట్టలు తెగిన పగతో కిచ కిచ అని మద్దతు తెలిపాయి. అంతే ఆ క్షణం నుండి ఇప్పటికి పగతో రగులుతున్న కోతుల చేతిలో 350 కుక్క పిల్లలు చనిపోయాయి. దేశంలో ఇదో పెద్ద వార్త అయి కూర్చుంది.

రామరాజ్యంలో
సర్వ ప్రాణులకు న్యాయం
——————–
ప్రస్తుత కలియుగం మహారాష్ట్ర నుండి…త్రేతాయుగం అయోధ్యకు వెళదాం.

వాల్మీకి రామాయణం ఉత్తర కాండలో రామ రాజ్య వైభోగం విస్తారంగా ఉటుంది . యుగయుగాలకు రామరాజ్యమే ఆదర్శం . అలాంటి పాలన కావాలంటే దేవుడే దిగి రావాలి . అలా దేవుడే దిగి వచ్చిన పాలన అది .

రాముడి గుణాలను వర్ణించే ప్రతి సందర్భంలో వాల్మీకి సర్వ భూత హితే రతః – అని ఒక మాట చెబుతుంటాడు . మనుషులతోపాటు అన్ని ప్రాణుల బాగు కోరుకునే రాముడు – అని అర్థం .

రాముడు అడవికి వెళుతున్నప్పుడు రాముడితో పాటు వెళ్ళడానికి తమ వేళ్ళు అడ్డు అని చెట్లు బాధపడి కొమ్మలను రాముడి వైపు తిప్పి విలపించాయట . ఇక ఆవులయితే దూడలకు పాలివ్వలేదట .

రామ రాజ్యం అంతా సుభిక్షం . ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా ఏదయినా సమస్య చెప్పుకోవడానికి రోజూ ఉదయం రాముడు కొంత సమయం కేటాయించేవాడు . అయితే ఆ సమయంలో రాముడు లక్ష్మణుడిని ఎవరయినా వచ్చారేమో చూడు అని అడగడం – తెరతీసి చూసి ఎవరూ లేరని చెప్పడం పరిపాటి అయిపోయింది . అంటే అన్నీ సవ్యంగా ఉన్నాయి కాబట్టి రాజుకు ఫిర్యాదు చేయాల్సిన అవసరమే ఎవరికీ రాలేదు .

ఒక రోజు ఉదయాన్నే తల మీద గాయంతో నెత్తురోడుతున్న కుక్క ఒకటి రాముడి న్యాయం కోసం వేచి చూస్తూ ఉండడంతో లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు . ఏమిటి నీ సమస్య రాముడు రమ్మంటున్నాడు లోపలికి రా – అంటాడు . యజ్ఞ యాగాలు జరిగేచోట , విప్రుల , రాజుల ఇళ్లలోకి నేను రాకూడదు – రాజునే బయటికి రమ్మను అంటుంది కుక్క .

మొత్తం మీద కుక్కను ధర్మ పరిషత్ లో ప్రవేశ పెట్టారు . తనను అకారణంగా ఒక భిక్షువు కొట్టాడు అన్నది కుక్క ఫిర్యాదు . ధర్మ విచారణలో యతులు , ఋషులు , భిక్షువుల మొదటి తప్పును క్షమించాలి అని తేలింది . రాముడు ఆ మాటే చెప్పి సభ ముగించబోయాడు . ఈ లోపు భిక్షువు అన్నాడు – నేను చేసిన తప్పుకు ఈ జన్మలోనే రాజ దండనతో విముక్తి కలుగుతుంది . మీరు తగిన శిక్ష వేయకపోతే రాజధర్మాన్ని పాటించని పాపంలో మీరుపడతారు – అది నాకు ఇష్టం లేదు అంటాడు . రాముడు కుక్కనే అడిగాడు – నీ అభిప్రాయం చెప్పు అని .
ఆ కుక్క ఒక శిక్ష లాంటి పదవి ఏదో ఇవ్వమంటుంది – అదంతా పెద్ద కథ . భిక్షువు , కుక్క న్యాయం జరిగిందని ఎవరిదారిన వాళ్లు వెళ్ళిపోతారు .

నదులు , చెట్లు , జంతువులకు కూడా రామ రాజ్యంలో న్యాయం జరిగింది . మనదిప్పుడు సమసమాజం . రామరాజ్యంతో పోల్చుకోగలమా ?
గెలిచేదంతా న్యాయమే అని చెప్పగలమా ?

ఇప్పుడు మనుషులతో పాటు సర్వప్రాణులను రక్షించడానికి ఏ దేవుడు దిగి రావాలి ?

మహారాష్ట్ర బీడ్ జిల్లా మజల్ గావ్ ఊరిమధ్య అయోధ్య పంచాయతీ పెట్టి కోతులకు- కుక్కలకు రాజీ కుదర్చడానికి ఏ రాముడు దిగిరావాలి?

– పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సోఫా సహిత సర్పం

RELATED ARTICLES

Most Popular

న్యూస్