Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపండువెన్నెల్లో పడుకోవద్దు!

పండువెన్నెల్లో పడుకోవద్దు!

Moon May Affect Men’s Sleep More Than Women’s

ఆకాశంలో వెలుగులు చిందించే పున్నమి చంద్రుని చూసి ఆనందించని మనసుండదు. చందమామతో అందమైన బంధం అందరికీ అనుభవమే. చంద్రుడి కళలను బట్టి సముద్రంలో ఆటు పోట్లూ ఉంటాయి. మనుషులపైనా చంద్రుని ప్రభావం తక్కువేం కాదు. ‘చంద్రమా మనసో జాతః’ అనే మంత్రంలో చంద్రుడే మనసుకు అధిపతి అని స్పష్టంగా ఉంది. అందుకే ఎవరన్నా తేడాగా ప్రవర్తిస్తే అమావాస్యా?పౌర్ణమా? అని ఆట పట్టిస్తుంటారు.

ఆనాటి రాముడి నుంచి పిల్లలకు చందమామను చూపించి గోరుముద్దలు తినిపించడం ఆనవాయితీ. కవులను చంద్రుడిలా మరెవరూ ఆకర్షించలేదేమో! చందమామను చూసివద్దామా అనే కైవార తాతయ్య తత్త్వమైనా, పండువెన్నెలనడిగి పాన్పు తేరాదే అనే దేవులపల్లి గీతమైనా…చంద్రునితో అనుబంధం తెలిపేదే. ఆలుమగలు, ప్రేయసీప్రియుల ప్రణయ కలహాల్లో చందమామకు ప్రత్యేక స్థానం. రావోయి చందమామా, మా వింతగాథ వినుమా; మామా! చందమామా! వినరావా మా కథా! అన్నా ఆయన్ని మధ్యవర్తిగా చేసి తగవులు తీర్చమనేవే. ఇంతగా చంద్రుడు మన జీవితాల్లో పెనవేసుకు పోయాడు.

నిద్రపట్టకపోతే ఆరుబయట వెన్నెల కాంతిలో విహరించడం, సముద్ర తీరంలో చంద్రుని చూడాలనుకోవడం, వెన్నెల్లో తాజ్ మహల్ చూడాలనుకోవడమూ సరేసరి. అయితే వెన్నెల రాత్రులు ఎంజాయ్ చేయాలనుకునేవారు ఇప్పుడు కాస్త జాగ్రత్త పడాలేమో! చంద్రుని కళలకు నిద్రకు సంబంధం ఉందని ఒక పరిశోధన వెల్లడించింది.

స్వీడన్ కు చెందిన ఉప్ప్సల యూనివర్సిటీ వారు నిర్వహించిన ఈ రీసెర్చ్ లో సుమారు 800 మంది 21-81 మధ్యవయసువారు పాల్గొన్నారు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వీరిపై చంద్రుని ప్రభావాన్ని పరిశీలించారు. చంద్రుని కాంతి పెరిగే శుక్లపక్షంలో పురుషుల్లో నిద్ర పట్టడం లేదని పరిశోధనలో వెల్లడైంది.

అదే కృష్ణపక్షంరోజుల్లో ఈ సమస్య అంతగా ఉండటం లేదట. మహిళల్లో చూస్తే అంతగా ప్రభావం లేదట. మరి పురుషులపైనే ఈ ప్రత్యేక ప్రేమ ఎందుకో చందమామే చెప్పాలి. అంతవరకూ పండువెన్నెల నడిగి పాన్పు తేకపోవడమే మంచిదేమో!

-కె. శోభ

Also Read:

చైనా యువత పడక ఉద్యమం

Also Read:

ఇకపై వర్చువల్ ప్రాణులు

Also Read:

ఆహా! వండాలిరా మైమరచి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్