Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకరోనా కళ్యాణాలకు పి పి ఈ కిట్లే పెళ్లి బట్టలు!

కరోనా కళ్యాణాలకు పి పి ఈ కిట్లే పెళ్లి బట్టలు!

సరిగ్గా పోయిన సంవత్సరం ఇదేవేళకు కరోనాను తరిమి కొట్టడానికి బాల్కనీల్లో చప్పట్లు కొట్టారు. కొవ్వొత్తులు వెలిగించారు. కంచాల మీద గరిటెలతో కొట్టారు. అదిగో…ఇదిగో…అన్న వ్యాక్సిన్లు రానే వచ్చాయి. కరోనా తగ్గకపోగా సెకండ్ వేవ్ ఈడ్చి కొడుతోంది. ఇప్పుడు బాల్కనీల్లో చప్పట్లు, కొవ్వొత్తులు, కంచాల మీద గరిటెలు పనిచేయవు అని చప్పట్లకు, కొవ్వొత్తులకు, గరిటెలకు జ్ఞానోదయమయ్యింది. ఇప్పుడు మూతికి ఒక మాస్కు కాదు- మూడు మాస్కులు పెట్టుకుంటే మంచిదంటున్నారు. లాక్ డౌన్ చేస్తే చెప్పరాని ఇబ్బందులున్నాయి కాబట్టి- లాక్ డౌన్ పెట్టే పరిస్థితి తీసుకురాకండని ప్రభుత్వాలు అభ్యర్థిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో అన్ని కళలు, కలలు సాకారమయ్యేది ఎన్నికలతోనే కాబట్టి ఇబ్బడి ముబ్బడిగా ఎన్నికలు పెట్టారు. కరోనా కూడా ప్రతి ఓటరును పలకరించి, కౌగిలించుకుంది. ప్రజాస్వామ్యం నిలిచి గెలిచింది. ఓటరు ఓడిపోయాడు.

 

ఇప్పటికి కరోనాతో సహజీవనానికి ఏడాది అయ్యింది. హీనపక్షం ఇంకో రెండేళ్లయినా కరోనా ఉంటుందట. ఆ తరువాత అయినా పోతుందని బల్లగుద్ది చెప్పగల ధీరులు ఇప్పటికయితే లేరు. కొన్నాళ్లు ఆగిన పెళ్లి మేళతాళాలు మళ్లీ మోగుతున్నాయి. వధూవరుల్లో ఎవరికో ఒకరికి కరోనా వచ్చినా షాదీ కరోనా…ఆగే చలోనా…అని పి పి ఈ కిట్లు వేసుకుని తాళి కట్టించుకుంటున్నారు. లేదా కడుతున్నారు. వధూవరులు ఇద్దరికీ కరోనా ఉంటే…ఆ ఆదర్శ దాంపత్యానికి పి పి ఈ కిట్ల నీలం వస్త్రాలే పెళ్లి బట్టలు. కరోనా దగ్గులు, తుమ్ములే మేళ తాళాలు. శానిటైజర్ జల్లులే పన్నీటి చిలకరింపులు. సి, డి, జింక్ విటమిన్ బిళ్లలే తాంబూలాలు. డాక్టరే పురోహితుడు. ఆక్సీ మీటరే అరుంధతీ తార. క్వారెంటైనే కాశీ యాత్ర. ఆవిరి పొగలే అక్షతలు. కషాయమే వెల్కమ్ డ్రింక్.

“కరోనాతో సహజీవనం” అంటే ఏమిటో అనుకున్నారు మొదట్లో. ఇప్పుడు కరోనాతోనే కళ్యాణాలు కూడా జరుగుతున్నాయి. చేతన్, చేన్, తోడన్, తోన్, వలనన్, కంటెన్…కంటే కరోనా అన్ని విభక్తులను గట్టిగా పట్టుకుంది. నిజానికి ఇప్పుడు భాషలో ఏ విభక్తికీ విలువ లేదు. ఎందుకంటే అన్ని విభక్తులూ కరోనాలో లయిస్తాయి కాబట్టి!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్