Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రజాస్వామ్యం పలాయనం చిత్తగించింది!

ప్రజాస్వామ్యం పలాయనం చిత్తగించింది!

వ్యక్తిస్వామ్యం, ప్రజాస్వామ్యం అన్న మాటలున్నట్లు తోపులాటస్వామ్యం అన్న మాట వాడుకలో లేదు కానీ…ప్రజాప్రతినిధుల స్వభావంలో, పనితీరులో మాత్రం ప్రబలంగా ఉంటుంది. కొట్టొచ్చినట్లుగా కాకుండా కొట్టడానికే వచ్చినట్లు స్పష్టంగా కనపడుతుంటుంది!

తోపులాట తెలుగు; స్వామ్యం సంస్కృతం కాబట్టి ఇది దుష్టసమాసమవుతుందని వ్యాకరణవేత్తల ఛాందస చర్చకు ఈరోజుల్లో విలువలేదు. అంతటి ఎన్ టీ ఆరే మహా సంస్కృతం; నాడు తెలుగు కలిపి “మహానాడు” అని దుష్టసమాసాన్ని శిష్టప్రయోగం చేసి తెలుగు జాతికి ఇచ్చి వెళ్ళాక ఇప్పుడు దుష్టప్రయోగాల గురించి అనుకునేవారెవరు?

అయినా తోపులాటలో ఉన్నదే కండబలం; మొరటుతనం; దూకుడు; బలప్రదర్శన అయినప్పుడు దుష్ట-శిష్ట చర్చకు ఆస్కారం ఉండదు. కొంచెం డొంకతిరుగుడుగా ఉన్నా ముందు ఒక కల్పితకథలోకి వెళ్ళి తరువాత అసలు విషయంలోకి వెళదాం.

సునిశితమయిన హాస్యంతో గుండెలు మెలిపెట్టే విషయాలను చెప్పడంలో చెయి తిరిగిన రచయిత జి ఆర్ మహర్షి దాదాపు దశాబ్దం క్రితం ప్రజాస్వామ్యం మీద ఒక వ్యంగ్య వ్యాఖ్య రాశారు. అందులో- సాధారణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉంటుంది. సభలు, ర్యాలీలు, మైకులు, నినాదాలు, పొగడ్తలు, తిట్లతో ఊరూ వాడా ఊగిపోతూ ఉంది. ఒక ఊరి పక్కన అడవిలో జంతువులకు ఈ ఎన్నికల హడావుడి అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటిదంతా అని ఆరా తీస్తాయి. ప్రజాస్వామ్య సంవిధానంలో ఎన్నికలు కీలకం అని తెలిసి అడవిలో “ఆటవిక పాలన” అన్న నింద తొలగించుకోవాలంటే ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని జంతువులన్నీ ఏకగ్రీవంగా అంగీకారానికి వస్తాయి.

సింహం మొదలు చీమ దాకా దేన్నీ వదలకుండా ఓటరు నమోదు జరుగుతుంది. గుంట నక్క రిటర్నింగ్ అధికారిగా ఒకానొక శుభ ముహూర్తాన పోలింగ్ జరుగుతుంది. ఏనుగు నుండి పిపీలికం దాకా అన్నీ క్యూలో నిలుచుని ఓట్లు వేశాయి. నిర్ణయించిన ముహూర్తానికి పోలింగ్ ఫలితాలు ప్రకటించడమే ఇక తరువాయి.

విప్పిన బ్యాలెట్ బాక్సులతో పాటు అన్నీ కలిసి సింహం గుహ దగ్గరికి వెళతాయి. సరిగ్గా అదే సమయానికి సింహం నిద్రపోతూ ఉంటుంది. నిద్ర పూర్తయి నెమ్మదిగా సింహం కళ్లు తెరిచి…ఏమిటి మొత్తం అంతా కట్టకట్టుకుని వచ్చారు? అని అడుగుతుంది. ఏమీ లేదు మహారాజా! మొన్న పోలింగ్ జరిగింది కదా? మీరు అనుమతిస్తే ఫలితాలు ప్రకటిస్తాం…అని భయ భక్తులతో తగ్గు స్వరంతో మనవి చేసుకున్నాయి. అలాగే ప్రకటించండి…ఎలాగూ అడవికి నేనే కదా రాజును? అని సింహం ఆవులిస్తూ చెప్పింది.

“సింహం ఆవులించి నిద్ర లేచింది…ప్రజాస్వామ్యం పలాయనం చిత్తగించింది” అని ముగించారు జి ఆర్ మహర్షి.

ఇందులో అంతరార్థం ఏమిటో వివరించాల్సిన పనిలేదు. అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత.

ఈ కథ కల్పితం, జరగలేదు అనుకుని కొట్టిపారేయకండి. తేలిగ్గా తీసుకోకండి. తాజాగా పార్లమెంటు మకరద్వారం దగ్గర అధికార- ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల తోపులాటను ఈ కల్పిత కథకు అన్వయించుకోవాలి!

మకరం అంటే మొసలి. అంతటి ప్రజాస్వామ్య దేవాలయ ప్రధాన ద్వారానికి పశుబల పరిభాషే ఉందని నిట్టూర్చాల్సిన పనిలేదు. మొసలి గజేంద్రుడిని పట్టుకుంటే వెయ్యేళ్ళు ఏడ్చి ఏడ్చి చివరకు ఏడవలేక మూర్ఛపోతుంటే అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చి కాపాడాడు. అది గజేంద్ర మోక్షణం అయ్యింది. దేశాన్ని పట్టుకున్న దరిద్రాలను తుంచివేయడానికి చట్టాలు చేసే చోటు కాబట్టి ఇది ప్రజాస్వామ్య మోక్షణం అవుతుంది. అందుకోసం ప్రతీకాత్మకంగా మకరద్వారం పెట్టి ఉంటారనుకుంటే సరి!
ఎంతటి మొసళ్ళయినా నీళ్ళల్లో ఉంటేనే బలం. పార్లమెంటు కొత్త భవనం ముఖద్వారం దగ్గర ఉంటే…ఈగక్కూడా లోకువే!

బాధ్యతగల ఎం పీ ల తోపులాటలు, తొక్కిసలాటలు, ఎముకలు విరగడాలు, కాలు బెణకడాలు చూసి పార్లమెంటు మకరద్వారంలో మొసలి మొసలి కన్నీళ్ళు కాకుండా నిజం కన్నీళ్ళే కార్చింది. కానీ మొసలి కన్నీళ్ళను లోకం సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల వాటికి కన్నీటిగా గుర్తింపు దక్కదు- అంతే!

ఒకపనిని సవ్యంగా చేయలేనప్పుడు, ఒక చర్చను హుందాగా కొనసాగించలేనప్పుడు విసుక్కుని, కోప్పడి, చిందరవందర చేసి వెళ్ళిపోయే సందర్భాల్లో “శేషం కోపేన పూరయేత్” అని సంస్కృతంలో అద్భుతమైన మాట.

పార్లమెంటు లోపల చర్చ. ఆ చర్చలోకి అంబేద్కర్ వచ్చాడు. ఆ సందర్భంలో అంబేద్కర్ ను హోం మంత్రి అమిత్ షా అవమానించారని ప్రతిపక్షాలు; బతికి ఉన్నప్పుడు అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ తరువాత ఆయన భజన చేస్తోందని బీ జె పి విమర్శించుకున్నాయి. పార్లమెంటును దాటి ప్రకంపనలకు ఆస్కారమున్న విషయం కాబట్టి అధికార-ప్రతిపక్ష సభ్యులు “శేషం కోపేన పూరయేత్” మార్గాన్ని ఎంచుకున్నారు.

ఎవరు ఎవరిని తోశారు?
ఎవరు ఎవరికి మోకాలు అడ్డు పెట్టారు?
ఎవరి మోకాలి చిప్ప విరిగింది?
ఎవరి తుంటి ఎముకలో పగుళ్ళు వచ్చాయి?
రక్తం ఎన్ని చుక్కలు కారింది?
అన్నవి ఇప్పుడు గంభీరమైన ప్రజాస్వామిక చర్చలు.

సహజంగా అంబేద్కర్ అంశం పక్కకుపోయి…సభ్యుల తుంటి ఎముకల హెయిర్ లైన్ ఫ్రాక్చర్, నుదుటి రక్తం బొట్ల కాటన్ బ్యాండేజ్ కట్ల అంశం చర్చకు వస్తుంది. అలాగే వచ్చింది కూడా.

అక్కడ జి ఆర్ మహర్షి కల్పిత కథలో-
గుహ సింహద్వారం దగ్గర సింహం ఆవులించి నిద్రలేస్తే…ప్రజాస్వామ్యం భయంకొద్దీ పలాయనం చిత్తగించింది!

ఇక్కడ నిజజీవితంలో నిండుసభ మకరద్వారం దగ్గర ప్రజాస్వామ్యం ప్రజాస్వామిక వాతావరణంలో చర్చించుకోలేక ఎముకలు విరగ్గొట్టుకుని…బాధతో పలాయనం చిత్తగిస్తోంది!

దేశమా! సిగ్గుపడు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్