Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ముంబై అదే తీరు- ఎనిమిదో ఓటమి

ఐపీఎల్: ముంబై అదే తీరు- ఎనిమిదో ఓటమి

No victory for MI: ఈ ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ జట్టుకు అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటికే వరుసగా ఏడు పరాజయాలు మూటగట్టుకుని ఒక్క విజయం కోసం పరితపిస్తున్న ఆ జట్టుకు నేటి ఎనిమిదో మ్యాచ్ లో కూడా ఆశాభంగమే ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో రెండో సెంచరీ నమోదు చేసి లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ (103-నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వాంఖేడే స్టేడియంలో జరిగిన ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో 25 పరుగులకు తొలి వికెట్ (డికాక్-10) కోల్పోయింది.  రెండో వికెట్ కు మనీష్ పాండే – కెప్టెన్ రాహుల్ 58 పరుగులు చేశారు, మనీష్­-­22 పరుగులు చేసి ఔట్ కాగా, ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోనిస్ డకౌట్ కాగా, క్రునాల్ పాండ్యా కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా-10; అయుష్ బదోనీ-14 పరుగులు చేశారు. ఓ వైపు సహచరులంతా త్వరగా ఔటవుతున్నా రాహుల్ మాత్రం నిలకడగా రాణించి 62 బంతుల్లో 12 ఫోర్లు, 4సిక్సర్లతో  103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పోలార్డ్, మెరెడిత్ చెరో రెండు, డానియెల్ శామ్స్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.

ముంబై తొలి వికెట్ కు 49 పరుగులు చేసింది. నిదానంగా ఆడిన ఇషాన్ కిషన్ ( 20 బంతుల్లో 8 పరుగులు) అనూహ్యంగా ఔటయ్యాడు. అతను కొట్టిన బంతి కీపర్ కాలి బూటుకి తగిలి గాల్లోకి లేవగా దాన్ని హోల్డర్ క్యాచ్ పట్టాడు.  ఈ సీజన్లో మంచి గుర్తింపు పొందిన బ్రేవిస్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 39 పరుగులు చేసిన రోహిత్…క్రునాల్ పాండ్యా బౌలింగ్ లో ఔటయ్యాడు, ఆ వెంటనే సూర్య కుమార్ యాదవ్ (7) కూడా ఔట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది.  తిలక్ వర్మ –పోలార్డ్ ఐదో వికెట్ కు 57 పరుగులు జోడించారు. తిలక్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేసి 18వ ఓవర్లో హోల్డర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. క్రునాల్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో ఒక రనౌట్ సహా మూడు వికెట్లు కోల్పోయిన ముంబై 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో క్రునాల్ పాండ్యా మూడు; మోసిన్ ఖాన్, జేసన్ హోల్డర్, రవి విష్ణోయ్, ఆయుష్ బదోనీ తలా ఒక వికెట్ పడగొట్టారు.

కెఎల్ రాహుల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : బెంగుళూరుపై హైదరాబాద్ ఘన విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్