Friday, April 19, 2024
HomeTrending Newsకేంద్రం దేశద్రోహపూరిత చర్య - జగదీష్ రెడ్డి

కేంద్రం దేశద్రోహపూరిత చర్య – జగదీష్ రెడ్డి

విద్యుత్ సంస్థలపై కేంద్రప్రభుత్వం పెత్తనం ఏమిటని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని, విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వదేనని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ విపనిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు,అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు విదించాల్సి వస్తే అది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు, అమ్మకాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు పొందిందని,అయినా కోర్టు తీర్పును ఉల్లంఘించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేందుకు బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈ తరహా కుట్రలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం పేద,బడుగు, బలహీన,దళిత గిరిజనులకు అందించే సబ్సిడీలు ఎత్తి వేయాలి అన్నదే బిజెపి ఎజెండా అని ఆయన విమర్శించారు.
విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలు అన్నది పూర్తిగా ఆయా రాష్ట్రాల పరిదిలోనిదని లేని అధికారంతో రాష్ట్రాలలో కేంద్రము జోక్యం చేసుకోవడం ఎందంటూ ఆయన విరుచుకుపడ్డారు. కేంద్రం చెప్పినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కుడా బకాయి పడలేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అంతే గాకుండా ఇది పూర్తిగా డిస్కం లకు సప్లై దారులకు మధ్య కుదిరే ఒప్పందం మాత్రమేనని ఆయన తెలిపారు. వారిద్దరూ మధ్య తగవులు సంభవిస్తే పరిష్కరించేందుకు ఈ ఆర్ సి లు లేదా కోర్టులు ఉన్నాయన్నారు. 2014 కు ముందు,తరువాత విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటన్నది తెలంగాణ ప్రజలకు సుస్పష్టం గా తెలుసని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుండే విద్యుత్ సరఫరా ను మెరుగు పరచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.

జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి పేరు రావడం యిష్టం లేకనే రాజకీయ ప్రేరేపిత నిర్ణయం తీసుకుందన్నారు. యావత్ భారత దేశంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసే రాష్ట్రాంగ తెలంగాణ ఖ్యాతి గడించినందునే కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ఆటంకాలు కల్పిస్తుందన్నారు.మోడీ సొంత రాష్ట్రంలోనూ ఈ తరహా సరఫరా లేక పోవడంతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలలో కరెంట్ కోతలు ఉండడడంతో విసిగిపోయిన ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారన్న మీ మాంస తోటే ఇటువంటి దుశ్చర్యలకు కేంద్రం పాల్పడుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యతో రాష్ట్ర అభివృద్ధి కుంటు పడే ప్రమాదం ఉందని, అది అక్కడితో ఆగకుండా దేశాభివృద్ధికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దేశద్రోహ పురతమైన నిర్ణయం తీసుకున్న బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పై న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్