విద్యుత్ కు డోకా లేదు – మంత్రి జగదీష్ రెడ్డి

ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ పంపిణీకి అంతరాయం ఉండబోదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణ విద్యుత్ సంస్థలకే దక్కిందని ఆయన కొనియాడారు. ఇవే వర్షాలు గతంలో పడ్డప్పుడు విద్యుత్ శాఖ అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో వర్షాలతో విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం హైదరాబాద్ విద్యుత్ సౌదాలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ సి యం డి రఘుమారెడ్డి,జె యం డి శ్రీనివాసరావు తదితర డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సరిహద్దుల్లో సైనికుల్లా క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బందితో సి యం డి లు సమన్వయం చేసుకోవడం వల్లనే ఇంతటి ప్రకృతి వైపరీత్యాలలోను విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగలేదన్నారు. అది ముమ్మాటికీ సి యం డి ల ఘనతగానే ఆయన అభివర్ణించారు. అంతకు మించి ముఖ్యమంత్రి కేసీఆర్  దూర ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలు ప్రధాన కారణమని ఆయన తేల్చిచెప్పారు. అందులో భాగమే ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న బొగ్గునిల్వలు నిదర్శనమన్నారు.  నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఏర్పాటు చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ముందెన్నడూ లేని రీతిలో వర్షాలు,వరదలు సంభవించినప్పటికి ట్రాన్స్ మిషన్ ,డిస్ట్రిబ్యూషన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ విద్యుత్ సంస్థల కృషి అభినందనీయమన్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో నీరు చేరడం,ట్రాన్స్ పోర్ట్ తదితర సమస్యలతో ఉత్పత్తి తగ్గినప్పటికీ జెన్కో కు సరఫరా చేస్తున్న బొగ్గు విషయంలో సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నారు.

విద్యుత్ సరఫరా అన్నది డైనమిక్ సిస్టం అని ఆటుపోట్లను అధిగమిస్తూ గ్రిడ్స్ దెబ్బతినకుండా పనిచేయడం తెలంగాణ విద్యుత్ సంస్థల పనితీరుకు నిదర్శనమన్నారు. తాజాగా వర్షాలతో 2,300 స్తంభాలు నెలకొరిగాయని వాటిలో ఇప్పటికే 1800 పై చిలుకు పునరుద్ధరించమన్నారు. ఎన్ పి డి సి ఎల్ పరిధిలో ఇప్పటికి బారీ వర్షాలు నమోదు అవుతున్నాయని,భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఒక్క సర్వాయిపేట సబ్ స్టేషన్ 33/11 కెవి కి సరఫరా ఆగిందన్నారు. రెండు మూడు రోజుల్లో దానిని పురుద్ధరించి సరఫరా కొనసాగిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజల్లో అప్రమత్తత అవసరం
ఇదిలా ఉండగా విద్యుత్ ప్రసారాలపై ప్రజలలో అప్రమత్తత అవసరమని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు. నిమ్ముతో తడిసిన గోడలు,ట్రాన్స్ఫార్మర్స్, విద్యుత్ స్తంభాల పట్ల జాగరుకత పాటించాలన్నారు. తద్వారా ప్రమాదాల నివారణ సులబెమౌతుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *