లోక్ సభ ఎన్నికల కీలక దశ వేళ కాంగ్రెస్ – బిజెపి నేతలకు కొత్త అస్త్రం దొరికింది. దేశంలో 1950-2015 మధ్య ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన డాటా ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా మారింది. అటు అధికార బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ కూటమి పరస్పర విమర్శలకు దిగాయి.
ఈ కారణంగానే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ తహతహలాడుతున్నదని బీజేపీ విమర్శలు చేయగా, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ వివరాలను ప్రకటించి దేశంలో మత చిచ్చు తేవడానికి కమలం పార్టీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది.
దేశంలో 7.08 శాతం హిందువుల జనాభా తగ్గిందని, 195౦లో 84 శాతంగా ఉన్న హిందువుల జనాభా 2015 నాటికి 78 శాతానికి పడిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. బుధవారం ప్రధాని ఆర్థిక సలహామండలి ఈ వివరాలు వెల్లడించగా రాజకీయ దుమారం మొదలైంది.
ఎన్నికల సమయంలో ఇలాంటి నివేదిక వెలువడటం రాజకీయ లబ్ధి పొందడానికేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బీజేపీపై మండిపడ్డారు.
2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జన గణన జరగనుంది. దీంతో రాబోయే రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో నియోకవర్గాల రూపురేఖలు మారనుండగా ముస్లిం జనాభా అదికం అవుతుంది అనటంలో సందేహం లేదు. మయాన్మార్,బంగ్లాదేశ్ ముస్లింల రాకతో ఈశాన్య రాష్ట్రాలు, పశిమ బెంగాల్లో జనాభా సమతౌల్యంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
హిందూ -ముస్లిం జనాభాలో మార్పు మరో నాలుగు దశల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజా అంశంతో వోటింగ్ సరళిలో కూడా మార్పు జరిగే సుహానలు కనిపిస్తున్నాయి.
-దేశవేని భాస్కర్