Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం"సాయిబాబా టాకీస్! యాదిలో సరదా సన్నివేశాలు!!"

“సాయిబాబా టాకీస్! యాదిలో సరదా సన్నివేశాలు!!”

ఒక సినిమా ఒకసారి చూడ్డమే గగన గండమయ్యే రోజులవి.. కానీ, సినిమాలో డ్యాన్సర్స్, ఫైటర్స్, సైడ్ క్యారెక్టర్స్ ఇలా ఎంతమంది ఉంటారో.. అన్నిసార్లు చూసే అవకాశం కల్పించిన సినిమా భార్యామణి!

అడగంగా అడగంగ.. ఎప్పుడో అవకాశం దొరికితే 2 రూపాయల 50 పైసలతో ఒక్క సినిమా చూడ్డం.. ఓ సంవత్సరం మొత్తంలో ఎస్సెస్సీలో పాస్ మార్కులు సంపాదించినంత పెద్ద విజయం!

అలాంటి కాలంలో రోజూ సినిమా చూపించే అవకాశం కల్పించింది సోగ్గాడైన శోభన్ బాబు భార్యామణి!

అది కరెంట్ కటింగ్స్ కాలం! సారీ, అప్పుడప్పుడూ అలా ఓ మెరుపులా మెరిసి వెళ్లిపోయే కరెంట్ ను కంటితో చూసి ఆనందించిన వేళ!

భార్యామణి మధ్యలోనే కరెంట్ పోయేది.

జనరేటర్ ఉన్నా.. పెట్రోల్ పోయలేక.. దాన్ని ఆన్ చేయలేక.. ఏది దొరికితే అది పోసేసి నడిపించేందుకు సినిమా ఆపరేటర్లు.. జనరేటర్ ప్రిపరేటర్లుగా మారిన రోజులవి!

ఆ జనరేటర్ గందరగోళం.. ఆఫ్ స్క్రీన్ లో భార్యామణి సినిమాకూ కృష్ణ, కృష్ణంరాజు యుద్ధం సినిమాను కళ్లకుగడుతుండేది!

సరిగ్గా అప్పుడే ఆపరేటర్ల అయోమయంలో రీళ్ల మార్పిడీ జరిగి మధ్యమధ్యలో కృష్ణ వచ్చి పోతూ ఉండేవాడు!

అవి అంతకుముందు భార్యామణితో ఎలాంటి సంబంధం లేని కృష్ణ రక్తసంబంధంలోని సన్నివేశాలు!

ఒక్క శోభన్ బాబు సినిమా అని వస్తే.. మధ్యలో కృష్ణ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కొంత కన్ఫ్యూజన్! కానీ, డబుల్ బోనస్ గా కృష్ణ కూడా తెరపైకి రావడంతో మరోవైపు సంతోషం!!

ఏదేమైనా జనరేటర్ స్టార్ట్ కాక.. కరెంట్ పోకుండా ఉండలేక.. టిక్కెట్ కొన్నవారికి మొత్తం సినిమా చూపించాలని కల్పిత బేతాళ కథల్లో పట్టు వదలని విక్రమార్కుల్లా కమిటెడ్ ప్రయత్నం నాటి సాయిబాబా యాజమాన్యానిది!

ఒక్క సినిమాకే ఎగిరి గంతేస్తే.. రోజూ సేమ్ టైమ్ కు కరెంట్ పోతుండటంతో.. కాశీలో రోజూ గంగాహారతిలా.. సినిమా కూడా నిత్యకృత్యమైంది.

సేమ్ భార్యామణి సినిమానే!

మళ్లీ తెల్లారితే చూసేదీ అక్కడి వరకే!

కానీ, సినిమాకు పోతే చాలనుకుని గంతేసే రోజులు.. పెళ్లైన పెద్దలు చూడాల్సిన సినిమా అన్న కాన్షియస్ నెస్ ఎరుగని కాలం.. ఇంకేం రోజూ.. సేమ్ టైం ఈవినింగ్ సిక్స్ కు సేమ్ సినిమా!

పైగా, ఎండాకాలం.. కానీ, సాయిబాబా థియేటర్ ఫుల్ ఏసీ!

ఏసీ ఎక్కడుండేదని బుర్ర గోక్కోవద్దు!

పైన ఉన్న రేకులు కూడా తీసేసి కేవలం సాయంత్రం షోస్ మాత్రమే నడుస్తున్న రోజులవి.

అందుకే, ఆ న్యాచురల్ ఏసీ థియేటర్లో సినిమా ఓ అనుభూతి!

సినిమా ఫుల్ చూసేదుంటే మధ్యలో విశ్రాంతి అవసరం.

కానీ, విశ్రాంతి వరకే సినిమా చూడాల్సి రావడంతో శుభం ఏనాటికి చూడగల్గుతామానన్న ఓ చిన్న యాంగ్జిటీ! ఎలాగైనా కచ్చితంగా చూడాలన్న ఓ క్యూరియాసిటి!!

అప్పాల కాంతమేమో ఖుష్!

ఎందుకంటే, మొత్తం సినిమా శుభం వరకూ చూపిస్తే.. విశ్రాంతి వరకూ ఓవైపు అప్పాల గంప.. ఇంకోవైపు లుంగీపై నిద్రావస్థలో తాను సోలుతూ ఉండాల్సిన పనిలేదని!

ఒక్క రోజు సినిమానే అద్భుతమైన వరమని భావిస్తే.. సాయిబాబా యాజమాన్యం పెద్ద మనసుకు రోజూ సినిమా చూట్టం ఓ బోనస్!

అలాంటి సందర్భంలో కాస్తో, కూస్తో నాలుగు డబ్బులున్నోళ్లు మునీర్ కట్ మిర్చిలను కటకటమనిపిస్తే.. లోపలెంత కటకట ఉన్నా.. రోజూ సినిమా బోనస్ ను తల్చుకుని ఆత్మారాముణ్ని సంతుష్ఠి చేసుకోవడం అలవాటుగా మార్చుకున్న గ్రహపాటైంది!

ఊరించే కరీం గారెలను పక్క సీట్లలో వాళ్లు పటపటా కొరుకుతుంటే.. నకనకలాడే ఆకలి కేకలతో పుట్టిన ఈర్ష్యతో కూడిన ద్వేషంలో.. ఈ సినిమాకెప్పుడు శుభం కార్డ్ పడుతుందానన్న ఒకింత ఆవేశం! కానీ, అంతలోకే శుభం కార్డ్ పడితే.. రోజూ సినిమా ఉండదన్న మరింత బాధ!

వెరసి.. శుభం కార్డ్ పడకుండానే భార్యామణి పెట్టె వెళ్లిపోయింది!

విశ్రాంతి వరకే తప్ప.. భార్యామణి ముందుకెళ్ళి చూసిందీ లేదు.. శుభం కార్డ్ పడిందీ లేదు!

కానీ, చేసేదిలేక యాంగ్జిటీ అంతమైంది, క్యూరియాసిటికి శుభం కార్డ్ వేయాల్సివచ్చింది!

ఇది 1984 ముచ్చట!

అయితే, ఈ మొత్తం స్టోరీలో కొసమెరుపేంటంటే.. సాయిబాబా టాకీస్ లో రోజూ హౌజ్ ఫుల్.. కలెక్షన్ నిల్!

– రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్